atul kumar
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
2022 కల్లా తూర్పు నావిక దళంలోకి ‘విక్రాంత్’
సాక్షి, విశాఖపట్నం: స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణమని తూర్పు నావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలకేనని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, ఎం.ఎస్.ఎం ఈ రక్షణ రంగ అవసరాలకు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ సాధనలో సముద్ర రవాణా కీలకమని, అందుకు తగ్గట్టుగా రక్షణ పర్యవేక్షక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. (చదవండి: విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక) ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, లాంగ్ రేంజ్ షిప్‌లు, న్యూ క్లియర్ సబ్ మెరైన్లను సమకూర్చుకోవాలని తెలిపారు. మేరీటైమ్ డొమైన్ ఎవేర్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. నిర్మాణంలో వున్న విక్రాంత్ ఎయర్ క్రాఫ్ట్ కెరియర్ కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని వెల్లడించారు. 2021లో విక్రాంత్‌కు ట్రైల్ రన్ పూర్తయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2022 కల్లా తూర్పు నావికదళంలోకి చేరవచ్చని తెలిపారు. హానీట్రాప్‌లో ఎంతటి వారున్న ఉపేక్షించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఫేక్ ఫేస్బుక్ ఎకౌంట్లతో హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. ఆన్‌బోర్డ్ షిప్‌ల్లో మొబైల్ ఫోన్లు నిషేధించామని తెలిపారు. హానీట్రాప్‌కు గురైన వారిలో యువసైలర్లే వున్నారని, నేవీ అధికారులు ఉన్నారనేది నిరాధారమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!) -
సాగరమంతా సంబరమే!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల నేవీ బ్యాండ్ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్‌వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారా జంపింగ్ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు. బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్సెట్లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ తేనీటి విందులో సీఎం జగన్ విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్‌లో ఎట్ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్‌ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
సముద్ర మార్గాన ఉగ్ర ముప్పు!
సాక్షి, విశాఖపట్నం : సముద్ర మార్గాన ఉగ్రవాదులు చొరబడే ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందనీ.. ఈ నేపథ్యంలో తీరంలో భద్రత కట్టుదిట్టం చేశామని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ తెలిపారు. దీంతో కోస్ట్‌గార్డ్ సహా ఇతర మ్యారీటైం రక్షణ బృందాలతో పహారాను ముమ్మరం చేశామన్నారు. డిసెంబర్ 4న నేవీ డేను పురస్కరించుకుని ఐఎన్ఎస్ జలశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ మహా సముద్రంలో ఇండోృపసిఫిక్ ప్రాంతం కీలకంగా మారిందని.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలంటే జలరవాణా ముఖ్య భూమిక పోషిస్తుందని జైన్ తెలిపారు. అందుకే.. నౌకాయాన వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే కాకుండా.. వివిధ దేశాలతో సత్సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు నౌకాదళం నిరంతరం శ్రమిస్తోందన్నారు. అలాగే, చొరబాట్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు స్థానిక తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులకూ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాక, త్వరలో మిగ్-29 యుద్ధ విమానాలు, ఎంఆర్‌ృ60 హెలీకాప్టర్లతో తూర్పు నావికాదళాన్ని పటిష్టం చేస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. అరేబియా సముద్ర తీరంలో వివిధ నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సంకల్ప్ నిర్వహించాయనీ.. దీని ద్వారా మన దేశం దిగుమతి చేసుకున్న 68 చమురు ట్యాంకులకు నేవీ రక్షణ కల్పించిందన్నారు. వచ్చే ఏడాది ‘విక్రాంత్’ ఇదిలా ఉంటే.. తూర్పు నౌకాదళాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా కొత్తగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఏడు నౌకలు రానున్నాయని.. ఇందులో మూడు యుద్ధ నౌకలని జైన్ వెల్లడించారు. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చే ఏడాది నుంచి సేవలు అందించనుందన్నారు. అలాగే, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధనౌక, పీృ28 సబ్‌మెరైన్‌తో పాటు మరో సబ్‌మెరైన్, రెండు యుద్ధ నౌకలు చేరనున్నాయని తెలిపారు. కాగా, వచ్చే ఏడాది ఐఎన్ఎస్ రాజ్‌పుత్ యుద్ధ నౌక తన సేవల నుంచి నిష్క్రమిస్తోందన్నారు. సమావేశంలో తూర్పు నౌకాదళ వివిధ విభాగాల ప్రధానాధికారులు రియర్ అడ్మిరల్ కిరణ్‌దేశ్ ముఖ్, రియర్ అడ్మిరల్ సూరజ్‌భేరీ, రియర్ అడ్మిరల్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా 'నేవీ మారథాన్'
విశాఖ స్పోర్ట్స్: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వైజాగ్ నేవీ మారథాన్ విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. మారథాన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్, స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ గొర్మాడేతో కలసి రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కరేజ్ రన్ పేరిట 42.2 కిలోమీటర్ల మేరకు సాగిన మారథాన్‌లో 458 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డెస్టినీ రన్ కింద 21.1 కిలోమీటర్ల మేరకు కొనసాగిన హాఫ్ మారథాన్‌లో 2,739 మంది అథ్లెట్లు ఉత్సాహంగా పరుగు తీశారు. అలాగే ఫ్రెండ్షిప్ రన్‌గా పది కిలోమీటర్ల మేరకు సాగిన పరుగులో 5,850 మంది పాల్గొనగా.. ఐదు కిలోమీటర్ల పరుగులో 10,061 మంది పాల్గొన్నారు. విజేతలు వీరే.. మారథాన్ మెన్ కేటగిరీలో ఫెలిక్స్ చిరిమోత్ రాబ్ విజేత కాగా మోహిత్ రాథోర్ రన్నరప్‌గా నిలిచాడు. హాఫ్ మారథాన్‌లో నికోడిమస్ కిప్రుగట్ గెలుపొందగా.. మోసెస్ కిప్టానియా రన్నరప్‌గా వచ్చాడు. మారథాన్ మహిళా విభాగంలో ఎట్రేగెనట్ బెలెటే విజేత అవగా, సెల్లీ జెబివుట్ రన్నరప్‌గా నిలిచింది. హాఫ్ మారథాన్ మహిళా విభాగంలో కరెన్ జబెట్ విజేత అవగా ఫూలన్ పాల్ రన్నరప్‌గా నిలిచింది. -
రైతు సంతోషంగా ఉంటే దేశం సస్యశ్యామలం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్: రైతు ఆనందంగా ఉంటే దేశం సస్య శ్యామలంగా ఉంటుందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే ప్రమాణాలను మేనిఫెస్టోల్లో పొందుపరిచిన పార్టీలకు మద్దతిస్తామని స్పష్టంచేశారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన జాతీయ రైతు సమ్మేళనం మహాసభలు శుక్రవారం ముగిశాయి. కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన ముగింపు సమావేశంలో అతుల్‌కుమార్ మాట్లాడుతూ సమావేశాల్లో రైతుల అభివృద్ధి, ఆర్థిక భద్రతకు నూతన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రణాళికలో రైతులకు వడ్డీలేని ఋణాలు నేరుగా 10 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, రైతు కూలీలకు జీవన భృతికి నెలకు రూ3వేలు అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విధమైన ప్రమాణాలను రానున్న ఎన్నికల్లో ఏపార్టీ తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యతనిస్తుందో ఆపార్టీకి తమ మద్దతు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ దాని తొత్తు పార్టీల నిర్లక్షం వల్ల దేశంలో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దేశంలో నిత్యావసర సరుకులు నుంచి అన్నింటికీ ధరలు పెంచి పంటలకు మాత్రం మద్దతు ధర కల్పించలేదన్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోద్పాండా మాట్లాడుతూ వ్యవసాయంలో నేటి నుంచి కొత్త ఒరవడి రానుందన్నారు. రానున్న ఎన్నికల్లో రైతుల చైతన్యంతో నూతన చారిత్రాత్మకమైన మార్పులు జరుగనున్నాయన్నారు. రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసే నాయకుడినే ఎన్నుకుంటారని దీంతో రైతులకు ప్రభుత్వానికి మద్య అవాంతరాలు తొలగి రైతు క్షేమం మొదలౌతుందన్నారు. ఏపీ రైతుసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ 1998 నుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా దేశ వ్యాప్తంగా రైతులు 1.54 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యంచేసి రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యాడని తెలిపారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలు నేడు ఎన్నికల సమయం ఆసన్న మవటంతో రైతులు వారి సంక్షేమం అంటూ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఏపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ మాట్లాడుతూ రైతులకు, పేద ప్రజలకు మహారాష్ట్ర నెలకు రూ.650, గోవా రూ.1500, కేరళ రూ.500, హర్యానా రూ.1000 జీవనభృతి ఇస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులకు గుర్తింపుకూడా లేక పోవడం విచారకరమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరారవు మాట్లాడుతూ మహాసభల సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి రైతులు ఆర్థికంగా బలపడేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏకేఎస్ జిల్లా నాయకులు వివిధ రాష్ట్రాల నాయకులు ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.