సముద్ర మార్గాన ఉగ్ర ముప్పు!  | Terrorist Threat By the Sea | Sakshi
Sakshi News home page

సముద్ర మార్గాన ఉగ్ర ముప్పు! 

Published Wed, Dec 4 2019 4:46 AM | Last Updated on Wed, Dec 4 2019 4:46 AM

Terrorist Threat By the Sea - Sakshi

సాక్షి, విశాఖపట్నం : సముద్ర మార్గాన ఉగ్రవాదులు చొరబడే ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం అందిందనీ.. ఈ నేపథ్యంలో తీరంలో భద్రత కట్టుదిట్టం చేశామని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. దీంతో కోస్ట్‌గార్డ్‌ సహా ఇతర మ్యారీటైం రక్షణ బృందాలతో పహారాను ముమ్మరం చేశామన్నారు. డిసెంబర్‌ 4న నేవీ డేను పురస్కరించుకుని ఐఎన్‌ఎస్‌ జలశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ మహా సముద్రంలో ఇండోృపసిఫిక్‌ ప్రాంతం కీలకంగా మారిందని.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు భారత్‌ చేరుకోవాలంటే జలరవాణా ముఖ్య భూమిక పోషిస్తుందని జైన్‌ తెలిపారు. అందుకే.. నౌకాయాన వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే కాకుండా.. వివిధ దేశాలతో సత్సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు నౌకాదళం నిరంతరం శ్రమిస్తోందన్నారు. అలాగే, చొరబాట్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు స్థానిక తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులకూ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాక, త్వరలో మిగ్‌-29 యుద్ధ విమానాలు, ఎంఆర్‌ృ60 హెలీకాప్టర్లతో తూర్పు నావికాదళాన్ని పటిష్టం చేస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. అరేబియా సముద్ర తీరంలో వివిధ నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ సంకల్ప్‌ నిర్వహించాయనీ.. దీని ద్వారా మన దేశం దిగుమతి చేసుకున్న 68 చమురు ట్యాంకులకు నేవీ రక్షణ కల్పించిందన్నారు.  

వచ్చే ఏడాది ‘విక్రాంత్‌’ 
ఇదిలా ఉంటే.. తూర్పు నౌకాదళాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా కొత్తగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఏడు నౌకలు రానున్నాయని.. ఇందులో మూడు యుద్ధ నౌకలని జైన్‌ వెల్లడించారు. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వచ్చే ఏడాది నుంచి సేవలు అందించనుందన్నారు. అలాగే, ఐఎన్‌ఎస్‌ కవరత్తి యుద్ధనౌక, పీృ28 సబ్‌మెరైన్‌తో పాటు మరో సబ్‌మెరైన్, రెండు యుద్ధ నౌకలు చేరనున్నాయని తెలిపారు. కాగా, వచ్చే ఏడాది ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ యుద్ధ నౌక తన సేవల నుంచి నిష్క్రమిస్తోందన్నారు. సమావేశంలో తూర్పు నౌకాదళ వివిధ విభాగాల ప్రధానాధికారులు రియర్‌ అడ్మిరల్‌ కిరణ్‌దేశ్‌ ముఖ్, రియర్‌ అడ్మిరల్‌ సూరజ్‌భేరీ, రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement