= స్నాన ఘట్టాల్లో నీటికి ఇబ్బందులు
= మోటారు పనిచేయక ఆగిన జల్లు స్నానాలు
= క్లోక్ రూమ్‌ల్లో నిలువు దోపిడీ
= రోడ్లు సరిగాలేక గిరిప్రదక్షిణలోనూ తప్పని తిప్పలు
సాక్షి, విజయవాడ : భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భక్తులకు తిప్పలు తప్పడంలేదు. అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. మంగళవారం దుర్గా స్నానఘాట్లలో నీటి మోటార్లు పనిచేయకపోవడంతో జల్లు స్నానాలు నిలిపివేశారు. ఉదయం భక్తులు ఎక్కువగా ఉండడం, అదే సమయంలో జల్లు స్నానాలు నిలిపివేయడంతో భవానీలు ఇబ్బందిపడ్డారు. సోమవారం నుంచి పంటకాలువలకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని పెంచడంతో ఘాట్లలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.
దాదాపు అడుగున్నర మేర నీరు తగ్గడంతో భక్తులు మోకాళ్లపై నిల్చుని స్నానాలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. భవానీ సౌకర్యార్థం ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌లు, మరుగుదొడ్ల వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదుచేశారు. మరుగుదొడ్లను ఉపయోగించిన వారినుంచి రూ.10, క్లోక్‌రూమ్‌లో చెప్పుల జత, బ్యాగ్ పెడితే రూ.25 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కుర్రాళ్లు దురుసుగా వ్యవహరిస్తున్నారని భవానీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో దారి సరిగా లేక భవానీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కనిపించని రద్దీ
భవానీ దీక్షల విరమణ రెండోరోజున భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మంగళవారం ఇరుముడులు సమర్పించడానికి భక్తులు ఇష్టపడకపోవడమే దీనికి కారణం. తెల్లవారుజామున ఓ మోస్తరుగా ఉన్న భక్తుల సంఖ్య పది గంటల నుంచి అంతంత మాత్రంగానే ఉంది. వీరిలో కూడా అత్యధికులు సోమవారం ఇరుముడులు సమర్పించినవారే. మంగళవారం కూడా రెండోసారి అమ్మవారి దర్శనం చేసుకొని వారు తిరుగుముఖం పట్టారు. రెండో రోజు లక్ష లడ్డూలు అమ్ముడయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి భవానీల రాక కాస్త పెరిగింది. నగరానికి చేరుకున్న భక్తులు బుధవారం ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
భవానీలకు అవస్థలు
Published Wed, Dec 25 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement