నూతక్కి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర దుర్ఘటనలో స్కూల్ విద్యార్థిని మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు నింపింది. మీడియా ద్వారా సంఘటన జరిగిన తీరు తెలియడంతో కంటతడి పెట్టనివారు లేరు.
నూతక్కి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర దుర్ఘటనలో స్కూల్ విద్యార్థిని మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు నింపింది. మీడియా ద్వారా సంఘటన జరిగిన తీరు తెలియడంతో కంటతడి పెట్టనివారు లేరు. ప్రధానంగా సంఘటనా స్థలానికి వెళ్లి చూసిన వారైతే బస్సులో చిక్కుకున్న పాప మృత దేహాన్ని బయటకు తీసేంత వరకు దాదాపు రెండు గంటలపాటు అక్కడి నుంచి కదలలేకపోయారు. ఎంతటి దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కూడా నిండని చిన్నారికి ఇంతటి ఘోరమైన చావా అంటూ మూగగా బాధపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, రోడ్డుపై తాటి దుంగలు వేసినా పట్టించుకోని పంచాయతీ, చాలీ చాలకుండా బస్సులు నడుపుతున్న స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
దుగ్గిరాల/మంగళగిరి : నూతక్కి- కొత్తపాలెం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. సంఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలతో ఆ రోడ్డు కిక్కిరిసిపోయింది. నూతక్కిలోని విజ్ఞాన్ విహార్ స్కూల్ బస్సు ఉదయం 7.30 గంటల సమయంలో దుగ్గిరాల మండలం శృంగారపురం, మంగళగిరి మండలం నూతక్కి శివారు కొత్తపాలెం గ్రామాల నుంచి 32 మంది విద్యార్థులను తీసుకువెళుతోంది. వేగంగా వెళ్తూ నూతక్కి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న తాటి దుంగలను ఢీకొట్టింది.
దీంతో ఒక దుంగ బస్సు అడుగు భాగం నుంచి వెనుక నుంచి రెండవ సీటులో ఉన్న విద్యార్థిని నాగేశ్వరం లహరి(8) పొట్ట నుంచి దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శృంగారపురం గ్రామానికి చెందిన నాగేశ్వరం రఘు, రమాదేవి దంపతుల కుమార్తె లహరి విజ్ఞాన్ విహార్‌లో రెండవ తరగతి చదువుతుండగా, ఆ చిన్నారి అక్క లలిత అదే స్కూల్‌లో మూడవ తరగతి చదువుతోంది. తండ్రి రఘు కృష్ణాజిల్లా నందమూరు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తుంటారు. మరోవైపు గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యులుగా అందరికి తలలో నాలుకగా మెసులుతుంటారు.
కన్నీరుమున్నీరుగా రోదించిన తల్లి...
రోజూ లాగే లహరి తల్లి రమాదేవి తన ఇద్దరి పిల్లలను బస్సు ఎక్కించి ఇంటి దారిపట్టారు. ఇంతలోనే బస్సు ప్రమాదానికి గురైందని తెలియడంతో స్థలానికి చేరుకున్న రమాదేవి దుర్ఘటనను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. బస్సు వెనుక నిర్జీవంగా వేలాడుతున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆ తల్లి ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
తండోపతండాలుగా
తరలివచ్చిన ప్రజలు..
స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నూతక్కి-కొత్తపాలెం రోడ్డుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విద్యార్థిని లహరి మృతి చెందిన తీరు చూసి కంట తడిపెట్టుకున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను దగ్గరకు తీసుకుని హృదయాలకు హత్తుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్కూలు యాజమాన్యం, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు గంటలు శ్రమిస్తేగానీ బయటకు రాని మృతదేహం..
బస్సు నుంచి విద్యార్థిని లహరి మృతదేహం బయటకు తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. బస్సు మధ్యలోకి దూసుకు వెళ్లిన తాటి దుంగను ముక్కలుగా కోసి, సీటు బోల్టులు తీసివేసి, చివరకు మోకులు సాయంతో దుంగను భద్రంగా పక్కకు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు.
స్కూల్ యాజమాన్యంపై డీఎస్పీ ఆగ్రహం...
నార్త్ జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ, ఎస్‌ఐలు అంకమరావు, వై. సత్యనారాయణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి మృతదేహాన్ని బయటకు తీయడంలో సాయపడ్డారు. ఓ దశలో స్కూలు యాజమాన్యం, సిబ్బందిపై స్థానికులతో పాటు డీఎస్పీ రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కబురు చేసేవరకు, ప్రమాదం జరిగిన రెండు గంటలకు కూడా స్కూల్ ప్రిన్సిపాల్ ఘటనా స్థలికి చే రుకోక పోవటంతో విద్యార్థుల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా, మానవత్వం లేదా అంటూ మండిపడ్డారు.
చిన్నారిని బలిగొన్న అతివేగం, తాటి దుంగ...
చిన్నారి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, రోడ్డు పక్కన తాటి దుంగలు వేసి ఉండడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, చుట్టుపక్కల 18 గ్రామాల నుంచి స్కూలుకు వచ్చే 750 మంది విద్యార్థులను కేవలం తొమ్మిది బస్సుల్లో తరలించడం, ఒక్కొక్క బస్సు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య మూడు, నాలుగు ట్రిప్పులు వేయాల్సిరావటంతో డ్రైవర్లు వేగం పెంచి బస్సులు నడపటం వల్ల ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి యాజమాన్య నిర్లక్ష్యం కూడా కారణమని ఆరోపించారు.