ఐకేపీ యానిమేటర్ల అరెస్టు
సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ యానిమేటర్లు సోమవారం చేయతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 120 మందికిపైగా యానిమేటర్లు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేశారు.
ఒంగోలు సెంట్రల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చేపట్టిన చలో హైదరాబాద్‌కు ఆదివారం జిల్లానుంచి వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి యానిమేటర్లతో పాటు మద్దతుగా వెళ్తున్న సీఐటీయూ నేతలనూ అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 120 మందికిపైగా అరెస్టు చేసి నిర్బంధించారు.
వంద రోజులుగా ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అయితే, జిల్లా నుంచి చలో హైదరాబాద్‌కు వెళ్తున్న వారిని రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావును వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. మరో నాయకుడు చీకటి శ్రీనివాసరావును టూటౌన్‌లో ఉంచారు.
అరెస్టులకు నిరసనగా నేడు ర్యాలీలు...
చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను అడ్డుకుని అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్ తెలిపారు. యానిమేటర్లంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షురాలు అరెస్టు, విడుదల...
బేస్తవారిపేట : ఐకేపీ యానిమేటర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు డీ జరీనాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు.. జరీనా లేకపోవడంతో చిల్లర దుకాణంలో ఉన్న ఆమె భర్త ఫకీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కనీసం దుకాణం మూసేందుకు కూడా సమయం ఇవ్వకుండా లాక్కుని వచ్చారు. సమాచారం అందుకున్న జరీనా.. సీఐటీయూ నాయకులతో పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన భర్త అరెస్టుపై ప్రశ్నించారు.
తాను చలో హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ఆరోగ్యం బాగలేకపోవడంతో కంభం వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నానని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆమె భర్త ఫకీరయ్యను విడుదల చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో జరీనా, సీఐటీయూ నాయకులు మాట్లాడిన తర్వాత విడుదల చేశారు.
అరెస్టు అప్రజాస్వామికం
ఒంగోలు టౌన్ : ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్‌కు సన్నద్ధమవుతున్న సీఐ టీయూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, నాయకుడు టీ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి జీ శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ గంగయ్య, డీఎంకే రఫీ, ఎన్.నాగేశ్వరరావులను పోలీసులు వారి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అంతేగాకుండా సీఐటీయూ కార్యాలయంలో ముఠా కార్మికుల యూనియన్ సమావేశంలో ఉన్న నాయకులను కూడా అరెస్టు చేశారన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం విడనాడకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ముందస్తు నిర్బంధం
Published Mon, Dec 22 2014 2:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement