* సర్కారుపై ఐకేపీ యానిమేటర్ల ఆక్రోశం
* వేతన బకాయిల కోసం కొనసాగిన ఆందోళన
* కలెక్టరేట్ వద్ద ధర్నా, రోడ్డుపై వంటావార్పు
కాకినాడ సిటీ : వారేమీ అయిదంకెల జీతాలందుకునే వారు కారు. ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనాన్నీ నెలల తరబడి బకాయి పెడితే బతుకు గడవక కడగండ్లు పడుతున్న చిరుద్యోగులు. పదిహేను నెలల వేతన బకాయిలను చెల్లించాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా అణుమాత్రం చలించని సర్కారును నిరసిస్తూ యానిమేటర్లు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రోడ్డుపైనే వండుకుని, సామూహికంగా భోజనాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరసనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యానిమేటర్లు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ యానిమేటర్లు 15 సంవత్సరాలుగా పేద మహిళలను సమీకరించి పొదుపు సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం, తిరిగి కట్టించడం, రికార్డుల నిర్వహణ, ప్రతి నెలా సమావేశాల నిర్వహణ వంటి సేవలు చేస్తున్న యానిమేటర్లను అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మహిళలను రోడ్డెక్కేలా చేస్తోందన్నారు. పని చేసిన కాలానికి ఇవ్వాల్సిన వేతనం నెలల తరబడి చెల్లించకపోవడం దారుణమన్నారు. గౌరవ వేతనం అందక యానిమేటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా యానిమేటర్ల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, బకాయిలు చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు డి.ఆనందకుమార్, ప్రధాన కార్యదర్శి కె.మణి, అధిక సంఖ్యలో యానిమేటర్లు పాల్గొన్నారు. 24 గంటల ఆందోళనకు కొనసాగింపుగా యానిమేటర్లు గురువారం రాత్రి కూడా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే నిద్రకు ఉపక్రమించారు.
మొర పట్టని మొరటుతనమేల?
Published Fri, Nov 14 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement