
కదంతొక్కిన ఐకేపీవీవోఏలు
* కలెక్టరేట్ ముట్టడి.. ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం
* పోలీసులు, మహిళల మధ్య తోపులాట.. 25మంది అరెస్ట్
ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : ‘చెట్టు మీద కొంగ.. చంద్రబాబు దొంగ’, ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం’, ‘సీఎం డౌన్.. డౌన్’ నినాదాలతో కలెక్టరేట్ దద్ధరిల్లింది. వందలాదిగా ఏలూరు తరలివచ్చిన ఐకేపీవీవోఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఐకేపీవీవోఏలు, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
‘నెలల తరబడి పస్తులున్నాం.. పిల్లలను బడికి పంపలేకపోతున్నాం.. మా బిడ్డలకు రెండుపూటలా కడుపునింపేందుకు మేము మూడు పూటలు పస్తులుంటున్నాం... ఇంకా ఎన్నాళ్లు ఇలా వేచిచూడాలి.. ఇప్పటికైనా బకాయి జీతాలు ఇప్పించండి’ అంటూ ఐకేపీవీవోఏలు డిమాండ్ చేశారు. పోలీసులను సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ ‘కలెక్టర్ బయటకు రావాలి.. మాకు జీతాలు ఇప్పించాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి’ అంటూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద గేటుకు వద్దకు దూసుకువచ్చారు. అక్కడ గేటు బయట బైఠాయించారు.
కొద్ది సేపటి తరువాత కలెక్టర్‌ను కలిసేందుకు పది మంది నాయకులను అనుమతించారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయగా ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. అయితే కలెక్టర్ బయటకు వచ్చి నెలల తరబడి జీతాలకోసం ఎదురు చూస్తున్న తమకు జీతాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఒక్క మాట చెబుతారని ఆందోళనకారులు ఆశించారు. అయితే కలెక్టర్‌ను కలిసిన మహిళలు తమకు ఏ మాట చెప్పకుండా వెళ్లిపోయారని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ బయటకు రావాలంటూ మహిళలు, సీఐటీయూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. తోపులాట కారణంగా వై.ప్రమీలారాణి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు తోటి మహిళలు సపర్యలు చేశారు.
పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం
కలెక్టర్ వెళ్లిపోయిన వెంటనే ముఖద్వారం వద్దే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను, మహిళలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీసు వాహనాలలో ఎక్కించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు డీఎన్‌వీడీ ప్రసాద్, నాయకులు భగత్, ఐకేపీ సంఘం జిల్లా నాయకురాలు ఎ.శ్యామలారాణి, ఐకేపీవీవోఏ సభ్యులు మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఐకేపీవీవోఏలు, సీఐటీయూ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది.
పోలీసులు అరెస్ట్ చేసిన తమ నాయకులను, కార్యకర్తలను, యానిమేటర్లను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ వాహనాలను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని తక్షణమే విడుదల చేయాలంటూ ఆందోళనకారులు త్రీటౌన్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. జీతాలు లేక నానా పాట్లు పడుతూ జీతాలిప్పించండి మహాప్రభో అని ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్ట్ చేయడం దారుణమని ఆందోళనకారులు వాపోయారు.