హోదా కోసం ఎందాకైనా.. | YSRCP's Fight For Special Status | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఎందాకైనా..

Published Wed, May 11 2016 3:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP's Fight For Special Status

 సాక్షి ప్రతినిధి, ఏలూరు/(ఆర్‌ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాల్ని సాగిస్తామని.. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మంగళవారం ఏలూరు నగరంలో కదం తొక్కాయి. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ప్రజలు సైతం
 
 పెద్దఎత్తున తరలివచ్చారు. నాయకులను టీడీపీ నేతలు మభ్యపెట్టి ఆ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో ఈ ధర్నాకు పెద్దఎత్తున శ్రేణులు తరలిరావడం ఉత్సాహాన్ని నింపింది.  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మరోనేత ప్రసాదరాజు హాజరుకావాల్సి ఉండగా, వారిద్దరూ హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా కారు బోల్తా పడింది. స్వల్పగాయాలు కావడంతో వారు రాలేకపోయారు. దీంతో పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ధర్నాకు నేతృత్వం వహించారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన వల్ల అన్నిరంగాల్లో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిం చాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు.  విభజన తర్వాత రాజధాని లేదని, అత్యంత ఎక్కువ రెవెన్యూ లోటుతో, ఉన్నత విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ వంటి వైద్యశాలలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు. ఒక రాష్ట్రం విభజన జరిగిన అనంతరం ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే కారణంతో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు ఐదేళ్ల హోదా చాలదని, తాము అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
 
  అదే సమయంలో విభజన బిల్లుకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు నాయుడు ఏపీకి 15 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని తెలి పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిద్దరూ మాట మార్చి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17.50లక్షల మంది నిరుద్యోగులున్నారని, మన ఆదాయం మనకే సరిపోని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వడం తప్ప మరో మార్గం లేదన్నారు.
 
 జిల్లాలో టీడీపీని నూటికి నూరు శాతం గెలిపించినందుకు కృతజ్ఞతగా పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించి ఈ జిల్లా రైతులను నిలువునా ముంచేశారన్నారు. సుమారు 9.60 లక్షల ఎకరాలకు సరిపడే నీటిని ఇతర జిల్లాలకు తరలించుకు వెళ్లే వరమిచ్చారని ఎద్దేవా చేశారు. జిల్లాలో నీటిఎద్దడి కారణంగా పంట పొలాలు ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదని, కేవలం పట్టిసీమ ప్రాజెక్ట్ కారణంగానే జిల్లా రైతులకు ఈ దుర్గతి పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
  కాగా రైతులకు పంట రుణాలుగా రూ.50 వేల కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నప్పటికీ, జిల్లాలో రైతులు కేవలం రూ.19వేల కోట్లు మాత్రమే తీసుకోగలిగారని, మిగిలిన రైతులు డిఫాల్టర్లుగా గుర్తించబడి రుణాలకు అర్హత సాధించలేకపోయారని వివరించారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడమే దీనికి కారణమన్నారు. నాయకులు పార్టీని వీడి వెళ్లినా బెంగ పడక్కరలేదని, కార్యకర్తలే పార్టీకి బలమని స్పష్టం చేశారు. ప్రజలు అమాయకులు కారని, వారు అన్నీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఫిరాయింపుదారులకు ఘాటుగా సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉందన్నారు.
 
 రాజకీయ ప్రయోజనాల కోసమే..
 ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబునాయుడు తాపత్రయపడుతున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా  అడ్డుకున్న ప్రథమ వ్యక్తి చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, బీజేపీ చేసిన మోసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరి వరకూ ఉద్యమిస్తుందన్నారు.
 
 పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచా రం చేస్తామని చెప్పారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీని వీడి వెళతారని అనుకోలేదని, వెళ్లిన వారిని విమర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు దారిదోపిడీ దొంగల్ని మించిపోయారని ధ్వజమెత్తారు. దోచుకున్న ప్రజాధనంతోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. ‘బాబూ నీది నోరా.. తాటిపట్టా.. నీకు చిన్న మెదడు చితికిపోయినట్టు ఉంది. అందుకే అవాకులు చవాకులు పేలుతున్నా’రని విమర్శించారు.
 
  ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఇసుక విధానం కారణంగా హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని, టీడీపీ నాయకులను ఆ పార్టీ నాయకులే చంపుకునే స్థాయికి దిగజారిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. చింతల పూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ ఇసుక ఉచితమని చెబుతున్నారని, ఎవరికైనా  ఇసుక ఉచితంగా దొరుకుతోందా అని ప్రశ్నించారు. ప్రత్యేక కేటగిరీలో ఉద్యోగాలు, పరిశ్రమలు రావని, కేవలం హోదాతోనే వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 చంద్రబాబును ఎలా అర్థం చేసుకోవాలో
 పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ ‘చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలియడం లేదు. ఒకసారి హోదా సంజీవని కాదంటాడు. మరోసారి హోదా చాలా అవసరమంటారు. హోదా కోసం పోరాటం చేస్తానంటాడు. మరోసారి కాళ్లు పట్టుకుంటానంటాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’ అన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర మాట్లాడుతూ అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబునాయుడు పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
 
 రాష్ట్ర సమస్యల్ని పక్కనపెట్టి అబద్ధాలు, అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి అడుగుకు రూ.వెయ్యి సరిపోయే పరిస్థితి ఉండగా, చంద్రబాబు మాత్రం రూ. 3,800 ఖర్చు చేస్తున్నారని వివరించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు విఫలమైన కారణంగానే వైఎస్ జగన్ గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం అధినేతతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే జిల్లాకు నూతన పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని, వ్యాట్ ఇతర పన్నుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు.
 
  వైఎస్ జగన్ పోరాటానికి రాష్ర్ట వ్యాప్తంగా మద్దతు పెరుగుతోందన్నారు. గోపాలపురం కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దోచుకో- దాచుకో అన్న చందంగా బాబు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. హోదా సాధించే వరకు వైఎస్ జగన్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. నిడదవోలు నియోజకవర్గ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి, నరసాపురం నియోజకవర్గ నేత పాలంకి శివప్రసాద్, తాడేపల్లిగూడెం కన్వీనర్ తోట గోపి, దెందులూరు కన్వీనర్ కొఠారు రామచంద్రరావు, నాయకులు బొద్దాని శ్రీనివాస్, చలమోలు అశోక్‌గౌడ్, కారుమంచి రమేష్, డేవిడ్ లంకపల్లి, నడపన చినసత్యనారాయణ, ముప్పిడి విజయరావు, పెన్మెత్స రామరాజు,  గోలి శరత్‌రెడ్డి, ముప్పిడి సంపత్‌కుమార్, వందనపు సాయిబాల పద్మ, దిరిశాల వరప్రసాదరావు, పటగర్ల రామ్మోహనరావు, నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, వేగి లక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement