- ఏఎస్‌డబ్ల్యూవో, వార్డెన్లపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఆగ్రహం
తిరువూరు : ‘విద్యార్థినుల సంక్షేమ వసతిగృహ నిర్వహణ ఇలాగేనా..? మీ పిల్లల్ని ఇటువంటి వాతావరణంలో ఉంచుతారా..? ప్రభుత్వం విద్యార్థినుల సంక్షేమానికి విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేయకుండా నిర్లక్ష్యం ఏమిటీ..’ అంటూ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకులు మధుసూదనరావు తిరువూరు సాంఘిక సంక్షేమ వసతిగృహ మేట్రన్, ఏఎస్‌డబ్ల్యూవోలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండు రోజులుగా తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతిగృహ విద్యార్థినులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి ఆందోళన చేస్తున్నారు. వారికి నంబరు-2 హాస్టల్ విద్యార్థినులు కూడా మద్దతు పలికారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి వచ్చి విద్యార్థినులకు సర్దిచెప్పినా వారు ఆందోళన విరమించలేదు.
దీంతో డీడీ మధుసూదనరావు వచ్చి రెండు, మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.5కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హాస్టల్లో సమస్యలను మేట్రన్, ఏఎస్‌డబ్ల్యూవో తన దృష్టికి తీసుకురాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గత సంవత్సరం బీసీ, ఎస్సీ విద్యార్థినుల మెస్ చార్జీలు, ఉపకారవేతనాలు రూ.2లక్షలకు పైగా మంజూరయ్యాయని తెలిపారు.
ఫిర్యాదుల వెల్లువ
కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో నెలకొన్న సమస్యలను మధుసూదనరావు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. వారానికి ఒకరోజే గుడ్డు ఇస్తున్నారని, సమాచార హక్కు చట్టం కింద హాస్టల్లో అధికారుల ఫోను నంబర్లు నమోదు చేయలేదని, మెనూ బోర్డు లేదని, కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటంతో అన్నం పొగచూరు వాసన వస్తోందని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్లకు, స్నానపు గదులకు నీటిసదుపాయం లేదని, ట్యాంకు పగిలిపోయి నీరు వృథాగా పోతున్నాయని ‘సాక్షి’లో ఇప్పటికి మూడుసార్లు కథనాలు వచ్చినా మేట్రన్ స్పందించలేదని విద్యార్థినులు డీడీ దృష్టికి తెచ్చారు.
వంటచెరకు కోసం పుల్లలు ఏరుకుని రావాలని చిన్న పిల్లల్ని మేట్రన్ పంపుతున్నారని, వంట గ్యాస్ కొనుగోలు చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. తాగునీరు బయట నుంచి తెచ్చుకుంటున్నామని, తమ సమస్యలను సహాయ సాంఘిక సంక్షేమాధికారిణి మేరీమాతకు, ఏఎస్‌డబ్ల్యూవోకు తెలియజేసినా ప్రయోజనం లేకపోయిందని విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. మేట్రన్, ఏఎస్‌డబ్ల్యూవోపై వెంటనే విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీడీ పేర్కొన్నారు. తహశీల్దారు బాలకృష్ణారెడ్డి, ఎంఈవో జోగేశ్వరశర్మ పాల్గొన్నారు.