పేట కేంద్రంగా జోరుగా లాటరీ విక్రయాలు
రోజుకు రూ.10 లక్షల మేరకు వ్యాపారం
నిషేధం ఉన్నా చర్యలు తీసుకోని అధికారులు
నరసరావుపేట టౌన్ ఒక్కసారిగా లక్షాధికారి కావాలనే ఆశతో పేద, బడుగు వర్గాలకు చెందిన ప్రజలు లాటరీలకు బానిసలుగా మారుతున్నారు. నిత్యం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో లాటరీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నరసరావుపేట కేంద్రంగా నిషేధిత లాటరీ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఫలితంగా అనేక కుటుంబాలు లాటరీ రక్కసికి బలవుతున్నాయి.
బోడోల్యాండ్ లాటరీలు తమిళనాడు, కేరళ, అరుణాచలం, గోవాలతోపాటు ఇతర దేశాలు బూటాన్, నేపాల్‌లలో విక్రయిస్తుంటారు. అవి మన రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. లాటరీ వ్యసనానికి సామాన్యులు బలై వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు. రోజు సంపాదనలో కొంత భాగాన్ని లాటరీ టికెట్లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తుండటంతో వారి కుటుంబాలు ఆర్ధికంగా దెబ్బతింటున్నాయి. పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని కొందరు హోల్‌సేల్ వ్యాపారులు ఈ దందాను మూడు పూలు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతూ వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి పట్టణంలో పలు ప్రాంతాల్లో విక్రయ స్థావరాలను ఏర్పాటు చేసుకొని పల్నాడు ప్రాంతానికి సప్లై చేస్తున్నాడు. ప్రతిరోజూ పది లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందంటే ఏ స్థాయిలో లాటరీ విక్రయాలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
మార్కెట్‌సెంటర్, పల్నాడు బస్టాండ్, శివుడిబొమ్మ, కోట సెంటర్, గుంటూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో 15 మంది హోల్‌సేల్ వ్యాపారులు, మరో 25 మంది చిన్న స్థాయి వ్యాపారులు ఈ లాటరీ టికెట్ల విక్రయాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలలో ఉన్న ఏజెంట్లకు వీరు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్‌రూపంలో చెల్లించి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలియవచ్చింది. విక్రయించిన టిక్కెట్లలో లాటరీ ఫ్రైజ్‌మనీ తగలగానే రెండోరోజు వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతుంది. అందులో 5 నుంచి 10 శాతం వ్యాపారి తీసుకొని, మిగిలిన మొత్తాన్ని లాటరీ తగిలిన వ్యక్తికి అందజేస్తున్నాడు. టిక్కెట్ల విక్రయాల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు ఒక ప్రణాళికా బద్దంగా చేపడుతున్నారు.
రూ.20 నుంచి రూ.250 వరకు టికెట్ల ధరలు
మార్కెట్లో విక్రయించే నిషేధిత లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.250 వరకు విక్ర యిస్తున్నారు. కుయల్ -20, రోసా - 30, తంగం - 50, నల్లనేరమ్ - 100, కుమరన్- 200, విష్ణు - 250 టిక్కెట్ల ధరలను నిర్ణయించి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వీటికి రూ.11 వేల నుంచి రూ.8 లక్షల వరకు లాటరీ బహుమతులు ఉన్నట్లు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. బహుమతి తమకే తగులుతుందన్న ఆశతో ప్రజలు నిత్యం టిక్కెట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు.
నంబర్లన్నీ స్లిప్పులపైనే
పలు కంపెనీల లాటరీలకు సంబంధించి నంబర్లను వ్యాపారులు తెల్ల స్లిప్పులపై రాసి విక్రయిస్తున్నారు. డ్రా తేదీకి వారం ముందు నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ గతంలో పనిచేసిన రూరల్ ఎస్పీ లాటరీ విక్రయాల వ్యవహారంలో కఠినంగా వ్యవహరంచడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మళ్లీ ఈ వ్యాపారం ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే పేదలు నష్టపోకుండా కాపాడినట్టు అవుతుంది.
పేదల జీవితాలతో చెలగాటం
Published Tue, Jan 19 2016 1:11 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement