ఒక శిశువు.. ఇద్దరు తల్లులు | Illegal adoption Revealed Rims hospital doctors | Sakshi
Sakshi News home page

ఒక శిశువు.. ఇద్దరు తల్లులు

Published Thu, Nov 16 2017 1:14 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

Illegal adoption Revealed Rims hospital doctors - Sakshi

రిమ్స్‌లోని నవజాత శిశు సంక్షరణ కేంద్రంలోని మగ శిశువు

ఒంగోలు టౌన్‌: ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు తక్కువ బరువు ఉండటంతో వైద్యుల సూచన మేరకు వెంటనే రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చింది. అదే రోజు కొన్ని గంటల తరువాత మరో మహిళ అదే శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అంతకు ముందు తక్కువ బరువుతో చేరిన శిశువు, ఆ తర్వాత తన బిడ్డేనంటూ మరో మహిళ తీసుకొచ్చిన శిశువు ఒక్కరే కావడంతో వైద్యుడు అవాక్కయారు. అనుమానం వచ్చిన ఆయన వెంటనే ఐసీపీఎస్‌ డీసీపీఓకు సమాచారం అందించారు. దీంతో అక్రమ దత్తత వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరుకు చెందిన ఒక మహిళ ఈనెల 13వ తేదీ మాతా శిశు వైద్యశాలలో మగ బిడ్డను ప్రసవించింది. అప్పుడా బిడ్డ బరువు ఒక కిలో 750 గ్రాములు. తక్కువ బరువు ఉన్న ఆ శిశువును వెంటనే రిమ్స్‌లో చేర్పించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె వెంటనే ఆ శిశువును తీసుకొని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. వైద్యం పొందుతున్న శిశువును ఎత్తుకుంటున్నట్లుగా చెప్పి బయటకు వచ్చేసింది. అప్పటికే ఆ మహిళ ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన దంపతులతో అక్రమ దత్తత ఒప్పందం కుదుర్చుకొని కన్న పేగును తెంచుకొని ఆ బిడ్డను ఇచ్చేసింది. పేర్నమిట్టకు చెందిన దంపతులు ఆ శిశువును రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించడంతో అక్కడి వైద్యుడు గుర్తించి, ఐసీపీఎస్‌ డీసీపీఓ జ్యోతిసుప్రియకు సమాచారం ఇచ్చారు. ఆమె పేర్నమిట్టకు చెందిన దంపతులను విచారించగా వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారి కుమారుడు పుట్టుకతోనే మంచానికి పరిమితమయ్యాడు. ప్రస్తుతం 13 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ దంపతులకు 12

ఏళ్ల కుమార్తె కూడా ఉంది.
ఈ నేపథ్యంలో మగ పిల్లాడు కావాలన్న ఆశతో దత్తత తీసుకున్నట్లు పేర్నమిట్టకు చెందిన దంపతులు అంగీకరించారు. గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ ఇంటి యజమాని మరో బిడ్డను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు గుర్తించి వెంటనే ఐసీపీఎస్‌ డీసీపీఓ ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ సరోజిని దృష్టికి తీసుకువెళ్లి బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తమ ఆధీనంలోకి తీసుకొని రిమ్స్‌లోని నవజాత శిశు సంక్షరణ కేంద్రంలో చికిత్స నిమిత్తం ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీఓ జ్యోతిసుప్రియ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement