RIMS doctors
-
రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యహరించిన రిమ్స్ వైద్యుడిపై ఆస్పత్రి డైరెక్టర్ బలరాం నాయక్ ఫిర్యాదు చేశారు. మర్కజ్ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్యుడు విధులకు హాజరయ్యాడు. సమాచారం గోప్యంగా ఉంచి.. నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహించిన డాక్టర్‌పై సెక్షన్ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్లో చికిత్స పొందుతున్నాడు. (ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన కిరణ్ బేడీ.. నెటిజన్ల మండిపాటు) -
మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా..!
సాక్షి, కడప :ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడాల్సిన పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. తమ ఎదుట ఉన్న రోగికి మెరుగైన వైద్యం అందితే బతుకుతాడనే విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. పులివెందులకు చెందిన శ్రీనివాసులరెడ్డి విషయంలో కడప రిమ్స్ వైద్యులు కనీస మానవత్వం చూపి ఉంటే ఆయన బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా నిబంధనల పేరుతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించకపోవడంతో ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. పోనీ మెరుగైన వైద్యం ఇక్కడ ఉందా? అంటే యంత్రాలు లేక.. అసౌకర్యాల మధ్య వైద్యం అంతంత మాత్రంగానే ఉందని చెప్పకనే చెప్పొచ్చు. రిమ్స్‌లో కార్డియాలజీ వైద్యుడే లేనప్పుడు సాధారణ వైద్యంతో గుండె సంబంధిత సమస్యను కనిపెట్టి ఉన్నత వైద్యం అందించడం సాధ్యమేనా? అన్నది అంతటా చర్చకు దారితీస్తోంది. ఎంతో మహోన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తే.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రిమ్స్‌లో వైద్యం దైన్యంగా మారిందని స్పష్టమవుతోంది. ప్రాణానికి ఏదీ పూచీ ఇటీవల పులివెందుల పూలఅంగళ్ల వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో అరెస్టు అయిన వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుండె నొప్పి రావడంతో మంగళవారం ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. అయితే కార్డియాలజీ వైద్యులు లేకపోవడం, నిందితులు అన్న నెపంతో బయటికి పంపకపోవడం, మెరుగైన వైద్య సేవలు అందించకపోవడం తదితర కారణాలతోనే శ్రీనివాసులురెడ్డి మృతి చెందారని బంధువులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత సంబంధిత పరీక్షలు నిర్వహిస్తే సమస్య నిర్ధారణకు ఆస్కారంతోపాటు తీవ్రత తగ్గించడానికి అవకాశం ఉండేది. కానీ కొన్ని పరికరాలు పనిచేయకపోవడం కూడా వైద్యం తీరుపై విమర్శలకు అవకాశం కల్పించింది. కేంద్ర కారాగారంలో 16 మార్లు పరీక్షలు పులివెందుల పూలంగళ్ల వద్ద మార్చి 4వ తేదీన జరిగిన ఘర్షణ కేసులో శ్రీనివాసులురెడ్డిని మార్చి మూడవ వారంలో పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత రిమాండ్‌కు కేంద్ర కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉండగా మంగళవారం బెయిలు కూడా వచ్చింది. శ్రీనివాసులురెడ్డి కేంద్ర కారాగారంలో ఉన్న నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు జైలులో వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు మార్లు కడుపునొప్పి, మూత్ర సంబంధిత, రక్తపోటుతో ఇబ్బంది పడినట్లు తెలియవచ్చింది. ఈమేరకు వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నట్లు రికార్డులో నమోదైంది. కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు పరీక్షలు నిర్వహించుకున్న శ్రీనివాసులురెడ్డిని కనీసం ఒక సారైనా రిమ్స్‌కు తీసుకొచ్చి వైద్య సేవలు అందించిన పాపాన పోలేదు. చివరకు మంగళవారం శ్రీనివాసులురెడ్డిని రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో కూడా పాత పరీక్షల రిపోర్టులను రిమ్స్ అధికారులకు చూపించకపోవడంతో సాధారణ కేసుగా తీసుకుని వైద్య సేవలు అందించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. తిలాపాపం.. తలాపిడికెడు.. పులివెందుల మండలంలోని పుట్రాయనిపేటకు చెందిన కల్లూరు శ్రీనివాసులురెడ్డి మరణంలో తిలాపాపం..తలాపిడికెడు అన్న చందాన ఇటు వైద్యులు.. అటు కేంద్ర కారాగార అధికారులను బాధ్యులుగా చేయక తప్పదు. కేంద్ర కారాగార అధికారులు రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో శ్రీనివాసులురెడ్డి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలియజెప్పకపోవడం... రిమ్స్‌లో ప్రత్యేక నిబంధనల పేరుతో ప్రాణం పోతున్నా బయటికి పంపించకపోవడం వంటి కారణాల వల్ల శ్రీనివాసులురెడ్డి మృతి చెందాడని బంధువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఆయన మరణానికి అధికారులు తప్పు చేసిన నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
గ్యాంగ్‌స్టర్ సునీల్ ఆత్మహత్య
కడప అర్బన్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ సునీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా కడప సెంట్రల్ జైలులో ఓ బ్యారక్‌లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ శుక్రవారం రాత్రి కొక్కేనికి బెడ్‌షీట్ అంచుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లాతోపాటు మరో మూడు జిల్లాల్లో నేరాలకు పాల్పడి 19 కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ను మార్చి 27న కర్నూలు జిల్లాలో ఓ కేసు విషయమై కోర్టులో హాజరుపరచి తిరిగి తీసుకొస్తుండగా ఎస్కార్ట్ పోలీసులను బురిడీ కొట్టించి పరారయ్యాడు. ఈ నెల 4 రాత్రి బెంగళూరులో పట్టుబడ్డాడు. గురువారం వైఎస్సార్ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సునీల్‌కుమార్‌ను పోలీసులు హాజరు పరిచారు. శుక్రవారం ఉదయం 10.30కు కడప కేంద్ర కారాగారానికి తరలించి కావేరి బ్యారక్‌లో సింగిల్‌గా ఉంచారు. సాయంత్రం 7.30 గంటల వరకు మాట్లాడిన అతడు తనకిచ్చిన ఉలెన్ బెడ్‌షీట్ అంచును చింపివేసి ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకున్నాడు. జైలు సబ్బంది వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు సునీల్‌కుమార్‌కు పరీక్షలు నిర్వహించి అప్పటికే మరణించినట్లు రాత్రి 8.26 గంటలకు నిర్ధారించారు. -
ఒక శిశువు.. ఇద్దరు తల్లులు
ఒంగోలు టౌన్: ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు తక్కువ బరువు ఉండటంతో వైద్యుల సూచన మేరకు వెంటనే రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చింది. అదే రోజు కొన్ని గంటల తరువాత మరో మహిళ అదే శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అంతకు ముందు తక్కువ బరువుతో చేరిన శిశువు, ఆ తర్వాత తన బిడ్డేనంటూ మరో మహిళ తీసుకొచ్చిన శిశువు ఒక్కరే కావడంతో వైద్యుడు అవాక్కయారు. అనుమానం వచ్చిన ఆయన వెంటనే ఐసీపీఎస్ డీసీపీఓకు సమాచారం అందించారు. దీంతో అక్రమ దత్తత వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరుకు చెందిన ఒక మహిళ ఈనెల 13వ తేదీ మాతా శిశు వైద్యశాలలో మగ బిడ్డను ప్రసవించింది. అప్పుడా బిడ్డ బరువు ఒక కిలో 750 గ్రాములు. తక్కువ బరువు ఉన్న ఆ శిశువును వెంటనే రిమ్స్‌లో చేర్పించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె వెంటనే ఆ శిశువును తీసుకొని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. వైద్యం పొందుతున్న శిశువును ఎత్తుకుంటున్నట్లుగా చెప్పి బయటకు వచ్చేసింది. అప్పటికే ఆ మహిళ ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన దంపతులతో అక్రమ దత్తత ఒప్పందం కుదుర్చుకొని కన్న పేగును తెంచుకొని ఆ బిడ్డను ఇచ్చేసింది. పేర్నమిట్టకు చెందిన దంపతులు ఆ శిశువును రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించడంతో అక్కడి వైద్యుడు గుర్తించి, ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియకు సమాచారం ఇచ్చారు. ఆమె పేర్నమిట్టకు చెందిన దంపతులను విచారించగా వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారి కుమారుడు పుట్టుకతోనే మంచానికి పరిమితమయ్యాడు. ప్రస్తుతం 13 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ దంపతులకు 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలో మగ పిల్లాడు కావాలన్న ఆశతో దత్తత తీసుకున్నట్లు పేర్నమిట్టకు చెందిన దంపతులు అంగీకరించారు. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ ఇంటి యజమాని మరో బిడ్డను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు గుర్తించి వెంటనే ఐసీపీఎస్ డీసీపీఓ ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ సరోజిని దృష్టికి తీసుకువెళ్లి బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తమ ఆధీనంలోకి తీసుకొని రిమ్స్‌లోని నవజాత శిశు సంక్షరణ కేంద్రంలో చికిత్స నిమిత్తం ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీఓ జ్యోతిసుప్రియ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
రిమ్స్‌లో చిన్నారి మృతి
ఆదిలాబాద్ రిమ్స్ : సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రిమ్స్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందుంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. బేల మండలం కొగ్ధూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ తన కూతురు అక్షర (5)ను జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం అర్ధరాత్రి రిమ్స్‌కు తీసుకొచ్చాడు. క్యాజువాలిటీ వైద్యుడు చూసి చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. ఓ రెండు సెలైన్లు ఎక్కించి నర్సులు చేతులు దులుపుకున్నారని, పరిస్థితి విషమించినా సదరు వైద్యులకు సమాచారం అందించలేదని మృతురాలి తండ్రి ఆరోపించారు. రాత్రి నుంచి ఉదయం వరకు అదే పరిస్థితి ఉన్నా ఇక్కడి నర్సులే వైద్యం అందించారని, వైద్యులు మాత్రం రాలేదని అన్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చిన సంబంధిత వైద్యుడు చిన్నారిని పరీక్షించిన అరగంటకే చనిపోయిందని చెప్పాడు. వైద్యులు సకాలంలో స్పందించకనే తమ కూతురు చనిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు రిమ్స్‌లో పెద్ద ఎత్తున మొహరించారు. అయితే.. తనకు రాత్రి సమాచారం అందిస్తే వచ్చి ఉండేవాడినని సంబంధిత వైద్యుడు పేర్కొన్నాడు. -
వైవీయూ హాస్టల్లో షార్ట్‌సర్క్యూట్
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో ఆదివారం అర్ధరాత్రి విద్యార్థినుల వసతి గృహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వైవీయూ చిత్రావతి బ్లాక్‌లో పీజీ విద్యార్థినుల వసతిగృహం ఉంది. ఆదివారం రాత్రి వర్షం పడటంతో హాస్టల్ వెనుకవైపున ఉన్న కేబుల్వైరులో రాత్రి ఒంటి గంట సమయంలో షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. హాస్టల్ కింది వైపు నుంచి రెండో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. మంటలను చూసి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. పవర్ రూంలో ట్రిప్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థినులు ఒక్కొక్కరుగా సృ్పహ తప్పి పడిపోయారు. వీరిలో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చీఫ్ వార్డన్ సుబ్బరాయుడు వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం రిమ్స్‌కు తరలించారు. ఎటువంటి ప్రమాదం లేదని విద్యార్థినులు భయానికి లోనయ్యారని రిమ్స్ వైద్యులు ధైర్యం చెప్పి పంపారు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో విద్యార్థులను వైవీయూకు పంపించారు. అయితే మళ్లీ కొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వైవీయూ డిస్పెన్సరీలోనే స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు రెడ్డిబాషా ఆధ్వర్యంలో విద్యార్థినులకు, సిబ్బందికి సెలైన్ బాటిల్స్ ఎక్కించారు. దీంతో విద్యార్థినులు మెల్లగా కోలుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన.. రాత్రి ఒంటి గంట సమయంలో విద్యార్థినుల హాస్టల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే ఉదయం వరకు వీసీ తదితర అధికారుల ఎవరూ అటు వైపు చూడలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఉదయం ప్రమాదం జరిగిన హాస్టల్ వద్దకు విచ్చేసిన వీసీ శ్యాంసుందర్ ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా అనడంతో విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వీసీ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు అగ్రిప్రమాదం రాత్రి జరిగినప్పటికీ ఉదయం వరకు అధికారులు ప్రమాద సంఘటన స్థలానికి రాకపోవడం దారుణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు విరుచుకుపడ్డారు. దీనికి తోడు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు కదా.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం తగదంటూ హాస్టల్ నుంచి వీసీ ఛాంబర్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి. అమర్నాథ్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఆర్ఎస్ఎఫ్ కో కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ గతంలో కూడా విశ్వవిద్యాలయంలో పలు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో మళ్లీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అనంతరం కొద్దిసేపు విశ్వవిద్యాలయ అధికారులకు, విద్యార్థి సంఘాల నాయకులకు వాగ్వాదం జరిగింది. పూర్తిస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తానని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించారు. తరచూ చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు.. యోగివేమన విశ్వవిద్యాలయంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో విశ్వవిద్యాలయంలోని పలు కార్యాలయాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పలు రికార్డులు కాలి బూడిదయ్యాయి. అదే విధంగా కేంద్ర లైబ్రరీ వద్ద కూడా ఇటీవలే మంటలు చెలరేగాయి. తాజాగా ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేబుల్ వైర్లు ఉన్న చోట చెత్తా చెదారం వేయడంతో పాటు పలుమార్లు దానికి నిప్పు పెట్టడంతో కేబుల్‌వైర్లు కరిగి షార్ట్‌సర్క్యూట్ జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద షార్ట్‌సర్క్యూట్.. ఓవైపు హాస్టల్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు లోనవుతుండగా.. అదే సమయంలో సోమవారం ఉదయం తిరిగి సెంట్రల్ లైబ్రరీ భవనంలో కేబుల్‌వైర్లు షార్ట్‌సర్క్యూట్ అవడం విశేషం. దీంతో హుటాహుటిన సిబ్బంది వచ్చి మెయిన్ ఆఫ్ చేసి పెద్ద ప్రమాదం చోటుచేసుకోకుండా ఆపగలిగారు. -
రిమ్స్‌లో సమయపాలన పాటించని వైద్యులు
జిల్లాలోని పేద రోగులకు దిక్కైన ఏకైక పెద్దాస్పత్రి.. రిమ్స్. అత్యవసర వైద్యం కోసం మారుమూల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది అక్కడకు వస్తుంటారు. వందమందికిపైగా వైద్యులు..అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా..రోగులకు వైద్యం అందడం గగనమే. కారణం..మధ్యాహ్నం 12 గంటల తర్వాత రిమ్స్‌లో నాడిపట్టే నాథుడుండడు. డాక్టర్లు రిజిస్టర్లలో సంతకాలు చేసెళ్లి..ప్రైవేటు సేవలో తరిస్తుంటారు. ఒంగోలు సెంట్రల్: ‘వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ గత నెల రిమ్స్‌ను సందర్శించిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన హెచ్చరిక ఇది.. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లు, వైద్యుల ట్రాకింగ్ సిస్టమ్‌లు అమలు చేస్తామని హెచ్చరించినా మాకేమిటన్నట్లు ఉంది రిమ్స్ వైద్యుల పరిస్థితి. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ‘సాక్షి’ రిమ్స్‌ను సందర్శించగా విధుల్లో ఉండాల్సిన 35 మంది వైద్యులు గైర్హాజరయ్యారు. రిమ్స్‌లో ఉండే 103 మంది వైద్యుల్లో 16 మంది తప్ప మిగిలిన వారంతా కాంట్రాక్టుబేసిక్ మీద పనిచేసేవారు. రెగ్యులర్ వైద్యుల్లో సీనియర్లకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఉంటే..కాంట్రాక్టు వైద్యులకు రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఇస్తున్నారు. కాంట్రాక్టు వైద్యులు బయట ప్రాక్టీస్ చేయకుండా ఉండేందుకు కూడా కొంత నగదు దీనిలోనే కలిపి ఇస్తారు. ఇంతేసి జీతాలిస్తున్నా..ప్రైవేటు ప్రాక్టీసు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు తప్ప చిత్తశుద్ధితో రిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారు అరుదే. ‘ఆస్పత్రికి ఇలా వచ్చి..అలా వెళతాం అంటే కుదరదు. డ్యూటీ సమయంలో ప్రైవేటు వైద్యం అంటే అసలు కుదరదు. సీనియర్ అయినా..జూనియర్ అయినా రోజుకు ఏడు గంటలు ఆస్పత్రిలో పనిచేయాల్సిందేనని’ ఇటీవల స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ ఒంగోలు రిమ్స్‌లో అవేవీ అమలు కావడం లేదు. చాలా మంది వైద్యులు కనీసం రెండు గంటలు కూడా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా ఉదయం 9.15 లోపల విధులకు హాజరుకాకపోతే..వారిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ వైద్యశాలల డెరైక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు మార్గదర్శకాలిచ్చారు. ఉదయం గం.9.30 తర్వాత వైద్యుల అటిండెన్సు పట్టిక వివరాలను వైద్య విద్యా సంచాలకులకు పంపించాలి. సాయంత్రం కూడా వైద్యుల హాజరు వివరాలను మెయిల్లో పంపాలి. ఆలస్యంగా వచ్చిన వారు, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారు, అసలు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారి వివరాలు కూడా ఏరోజుకారోజు తప్పని సరిగా మెయిల్ చేయాలని ఆదేశించారు. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం విధులకు గైర్హాజరైన వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఒంగోలు రిమ్స్‌లో ఇటువంటి నిబంధనలు అమలు కావ డం లేదు. ఆదేశాలిచ్చి నెల రోజులు కావస్తున్నా..ఒక్క వైద్యుడు కూడా వాటిని పాటించడం లేదు. సాయంత్రం 4 గంటల దాకా కాదుకదా..మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచే బయటకెళ్లిపోతున్నారు. అనంతరం క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ మినహా మిగతా విభాగాల్లో వైద్యులే కనపడరు. ఫోన్ ద్వారా ట్రీట్మెంట్: వైద్యులు లేని సమయంలో వచ్చే రోగులకు అత్యవసర చికిత్సను నర్సులే చేస్తున్నారు. ‘ఈ టైంలో మేము రాలేం..ఫోన్లో చెబుతాం చికిత్స చేయండి’ అని బయట ఉన్న వైద్యులు నర్సులకు హుంకుం జారీ చేస్తున్నారు. ఈ ఫోన్ట్రీట్మెంట్ పుణ్యమా అని ఈమధ్యకాలంలో ఒకరిద్దరు మృతిచెందారు. పోతేపోనీ..పేదోడి ప్రాణమేగానన్న నిర్లక్ష్యం ఇక్కడి వైద్యుల్లో గూడుకట్టుకుంది. విధులకు డుమ్మాకొట్టి ప్రైవేటు విధులు చక్కబెట్టుకుంటున్నారు. కొందరు హెచ్వోడీలు అయితే కిందిస్థాయి వైద్యులు చేసే శస్త్ర చికిత్సలను తామే చేశామని గణాంకాలు తయారు చేస్తున్నారు. ఒకరి సంతకాలు మరొకరు... కింది స్థాయి ఉద్యోగులు కూడా ఎవరికి వారే ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట..రెండు గంటల మధ్య ఆర్ఎంవో లేని సమయంలో హాజరుపట్టికలో సంతకం చేస్తున్నారు. అధికారుల ఉదాసీనతే దీనికి కారణం. రిమ్స్‌లో వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది హాజరుపట్టికలో సంతకాలు చేయకపోయినా..అక్కడి ఇన్చార్జ్ పట్టించుకోరు. ఇదే అలుసుగా తీసుకున్న సిబ్బంది ఒకరి సంతకం ఒకరు పెట్టడం చేస్తున్నారు. చాలా మంది వైద్యులు తీరిగ్గా పదిన్నర తరువాత విధులకు హాజరవుతున్నారు. రిజిస్టర్లలో ఉన్నహాజరుకు..విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్యకు మధ్య పొంతన ఉండదు. వైద్యులంతా అలా లేకపోయినా..కొందరు వైద్యులు నిబద్ధతతో పనిచేసేవారున్నారు. కనీ సం భోజనానికి సమయం కూడా చూడకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ పనిచేసేవారే చేస్తున్నారు..చేయని వారు తప్పించుకుంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారు తీరా..వైద్యులు అందుబాటులో లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. -రిమ్స్ డైరక్టర్ అంజయ్య వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జారీ చేసిన ఆదేశాలపై వైద్యులతో సమావేశం నిర్వహించి చర్చించాం. విధుల్లో ఉండాల్సిందిగా హెచ్చరించాం. పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.