రిమ్స్‌లో సమయపాలన పాటించని వైద్యులు | Rims doctors not followed to time | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో సమయపాలన పాటించని వైద్యులు

Published Sun, Aug 17 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

Rims doctors not followed to time

జిల్లాలోని పేద రోగులకు దిక్కైన ఏకైక పెద్దాస్పత్రి.. రిమ్స్. అత్యవసర వైద్యం కోసం మారుమూల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది అక్కడకు వస్తుంటారు. వందమందికిపైగా వైద్యులు..అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా..రోగులకు వైద్యం అందడం గగనమే. కారణం..మధ్యాహ్నం 12 గంటల తర్వాత రిమ్స్‌లో నాడిపట్టే నాథుడుండడు. డాక్టర్లు రిజిస్టర్లలో సంతకాలు చేసెళ్లి..ప్రైవేటు సేవలో తరిస్తుంటారు.
 
ఒంగోలు సెంట్రల్: ‘వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ గత నెల రిమ్స్‌ను సందర్శించిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన హెచ్చరిక ఇది.. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లు, వైద్యుల ట్రాకింగ్ సిస్టమ్‌లు అమలు చేస్తామని హెచ్చరించినా మాకేమిటన్నట్లు ఉంది రిమ్స్ వైద్యుల పరిస్థితి. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ‘సాక్షి’ రిమ్స్‌ను సందర్శించగా విధుల్లో ఉండాల్సిన 35 మంది వైద్యులు గైర్హాజరయ్యారు.  
 
రిమ్స్‌లో ఉండే 103 మంది వైద్యుల్లో 16 మంది తప్ప మిగిలిన వారంతా కాంట్రాక్టుబేసిక్ మీద పనిచేసేవారు. రెగ్యులర్ వైద్యుల్లో సీనియర్లకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఉంటే..కాంట్రాక్టు వైద్యులకు రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఇస్తున్నారు. కాంట్రాక్టు వైద్యులు బయట ప్రాక్టీస్ చేయకుండా ఉండేందుకు కూడా కొంత నగదు దీనిలోనే కలిపి ఇస్తారు. ఇంతేసి జీతాలిస్తున్నా..ప్రైవేటు ప్రాక్టీసు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు తప్ప చిత్తశుద్ధితో రిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారు అరుదే.
 
‘ఆస్పత్రికి ఇలా వచ్చి..అలా వెళతాం అంటే కుదరదు. డ్యూటీ సమయంలో ప్రైవేటు వైద్యం అంటే అసలు కుదరదు. సీనియర్ అయినా..జూనియర్ అయినా రోజుకు ఏడు గంటలు ఆస్పత్రిలో పనిచేయాల్సిందేనని’ ఇటీవల స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ ఒంగోలు రిమ్స్‌లో అవేవీ అమలు కావడం లేదు. చాలా మంది వైద్యులు కనీసం రెండు గంటలు కూడా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా  ఉదయం 9.15 లోపల విధులకు హాజరుకాకపోతే..వారిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ వైద్యశాలల డెరైక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు మార్గదర్శకాలిచ్చారు.
 
ఉదయం గం.9.30 తర్వాత వైద్యుల అటిండెన్సు పట్టిక వివరాలను వైద్య విద్యా సంచాలకులకు పంపించాలి. సాయంత్రం కూడా వైద్యుల హాజరు వివరాలను మెయిల్‌లో పంపాలి. ఆలస్యంగా వచ్చిన వారు, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారు, అసలు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారి వివరాలు కూడా ఏరోజుకారోజు తప్పని సరిగా మెయిల్ చేయాలని ఆదేశించారు.
 
ఈ వివరాలను పరిశీలించిన అనంతరం విధులకు గైర్హాజరైన వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఒంగోలు రిమ్స్‌లో ఇటువంటి నిబంధనలు అమలు కావ డం లేదు. ఆదేశాలిచ్చి నెల రోజులు కావస్తున్నా..ఒక్క వైద్యుడు కూడా వాటిని పాటించడం లేదు. సాయంత్రం 4 గంటల దాకా కాదుకదా..మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచే బయటకెళ్లిపోతున్నారు. అనంతరం క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ మినహా మిగతా విభాగాల్లో  వైద్యులే కనపడరు.
 
ఫోన్ ద్వారా ట్రీట్‌మెంట్:
వైద్యులు లేని సమయంలో వచ్చే రోగులకు అత్యవసర చికిత్సను నర్సులే చేస్తున్నారు.  ‘ఈ టైంలో మేము రాలేం..ఫోన్‌లో చెబుతాం చికిత్స చేయండి’ అని బయట ఉన్న వైద్యులు నర్సులకు హుంకుం జారీ చేస్తున్నారు. ఈ ఫోన్‌ట్రీట్‌మెంట్ పుణ్యమా అని ఈమధ్యకాలంలో ఒకరిద్దరు మృతిచెందారు. పోతేపోనీ..పేదోడి ప్రాణమేగానన్న నిర్లక్ష్యం ఇక్కడి వైద్యుల్లో గూడుకట్టుకుంది. విధులకు డుమ్మాకొట్టి ప్రైవేటు విధులు చక్కబెట్టుకుంటున్నారు. కొందరు హెచ్‌వోడీలు అయితే కిందిస్థాయి వైద్యులు చేసే శస్త్ర చికిత్సలను తామే చేశామని గణాంకాలు తయారు చేస్తున్నారు.
 
ఒకరి సంతకాలు మరొకరు...
కింది స్థాయి ఉద్యోగులు కూడా ఎవరికి వారే ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట..రెండు గంటల మధ్య ఆర్‌ఎంవో లేని సమయంలో హాజరుపట్టికలో సంతకం చేస్తున్నారు. అధికారుల ఉదాసీనతే దీనికి కారణం. రిమ్స్‌లో వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది హాజరుపట్టికలో సంతకాలు చేయకపోయినా..అక్కడి ఇన్‌చార్జ్ పట్టించుకోరు. ఇదే అలుసుగా తీసుకున్న సిబ్బంది ఒకరి సంతకం ఒకరు పెట్టడం చేస్తున్నారు. చాలా మంది వైద్యులు తీరిగ్గా పదిన్నర తరువాత విధులకు హాజరవుతున్నారు.

రిజిస్టర్లలో ఉన్నహాజరుకు..విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్యకు మధ్య పొంతన ఉండదు. వైద్యులంతా అలా లేకపోయినా..కొందరు వైద్యులు నిబద్ధతతో పనిచేసేవారున్నారు. కనీ సం భోజనానికి సమయం కూడా చూడకుండా విధులు నిర్వర్తిస్తుంటారు.  ఇక్కడ పనిచేసేవారే చేస్తున్నారు..చేయని వారు తప్పించుకుంటున్నారు.
 
వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారు తీరా..వైద్యులు అందుబాటులో లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.  
 
చర్యలు తీసుకుంటాం..
-రిమ్స్ డైరక్టర్ అంజయ్య
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జారీ చేసిన ఆదేశాలపై వైద్యులతో సమావేశం నిర్వహించి చర్చించాం. విధుల్లో ఉండాల్సిందిగా హెచ్చరించాం. పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement