రిమ్స్‌లో చిన్నారి మృతి
ఆదిలాబాద్ రిమ్స్ : సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రిమ్స్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందుంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. బేల మండలం కొగ్ధూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ తన కూతురు అక్షర (5)ను జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం అర్ధరాత్రి రిమ్స్‌కు తీసుకొచ్చాడు.
క్యాజువాలిటీ వైద్యుడు చూసి చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. ఓ రెండు సెలైన్‌లు ఎక్కించి నర్సులు చేతులు దులుపుకున్నారని, పరిస్థితి విషమించినా సదరు వైద్యులకు సమాచారం అందించలేదని మృతురాలి తండ్రి ఆరోపించారు. రాత్రి నుంచి ఉదయం వరకు అదే పరిస్థితి ఉన్నా ఇక్కడి నర్సులే వైద్యం అందించారని, వైద్యులు మాత్రం రాలేదని అన్నాడు.
సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చిన సంబంధిత వైద్యుడు చిన్నారిని పరీక్షించిన అరగంటకే చనిపోయిందని చెప్పాడు. వైద్యులు సకాలంలో స్పందించకనే తమ కూతురు చనిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు రిమ్స్‌లో పెద్ద ఎత్తున మొహరించారు. అయితే.. తనకు రాత్రి సమాచారం అందిస్తే వచ్చి ఉండేవాడినని సంబంధిత వైద్యుడు పేర్కొన్నాడు.