సాక్షి, కడప :ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడాల్సిన పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. తమ ఎదుట ఉన్న రోగికి మెరుగైన వైద్యం అందితే బతుకుతాడనే విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. పులివెందులకు చెందిన శ్రీనివాసులరెడ్డి విషయంలో కడప రిమ్స్ వైద్యులు కనీస మానవత్వం చూపి ఉంటే ఆయన బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా నిబంధనల పేరుతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించకపోవడంతో ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. పోనీ మెరుగైన వైద్యం ఇక్కడ ఉందా? అంటే యంత్రాలు లేక.. అసౌకర్యాల మధ్య వైద్యం అంతంత మాత్రంగానే ఉందని చెప్పకనే చెప్పొచ్చు. రిమ్స్‌లో కార్డియాలజీ వైద్యుడే లేనప్పుడు సాధారణ వైద్యంతో గుండె సంబంధిత సమస్యను కనిపెట్టి ఉన్నత వైద్యం అందించడం సాధ్యమేనా? అన్నది అంతటా చర్చకు దారితీస్తోంది. ఎంతో మహోన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తే.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రిమ్స్‌లో వైద్యం దైన్యంగా మారిందని స్పష్టమవుతోంది.
ప్రాణానికి ఏదీ పూచీ
ఇటీవల పులివెందుల పూలఅంగళ్ల వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో అరెస్టు అయిన వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుండె నొప్పి రావడంతో మంగళవారం ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. అయితే కార్డియాలజీ వైద్యులు లేకపోవడం, నిందితులు అన్న నెపంతో బయటికి పంపకపోవడం, మెరుగైన వైద్య సేవలు అందించకపోవడం తదితర కారణాలతోనే శ్రీనివాసులురెడ్డి మృతి చెందారని బంధువులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత సంబంధిత పరీక్షలు నిర్వహిస్తే సమస్య నిర్ధారణకు ఆస్కారంతోపాటు తీవ్రత తగ్గించడానికి అవకాశం ఉండేది. కానీ కొన్ని పరికరాలు పనిచేయకపోవడం కూడా వైద్యం తీరుపై విమర్శలకు అవకాశం కల్పించింది.
కేంద్ర కారాగారంలో 16 మార్లు పరీక్షలు
పులివెందుల పూలంగళ్ల వద్ద మార్చి 4వ తేదీన జరిగిన ఘర్షణ కేసులో శ్రీనివాసులురెడ్డిని మార్చి మూడవ వారంలో పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత రిమాండ్‌కు కేంద్ర కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉండగా మంగళవారం బెయిలు కూడా వచ్చింది. శ్రీనివాసులురెడ్డి కేంద్ర కారాగారంలో ఉన్న నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు జైలులో వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు మార్లు కడుపునొప్పి, మూత్ర సంబంధిత, రక్తపోటుతో ఇబ్బంది పడినట్లు తెలియవచ్చింది. ఈమేరకు వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నట్లు రికార్డులో నమోదైంది. కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు పరీక్షలు నిర్వహించుకున్న శ్రీనివాసులురెడ్డిని కనీసం ఒక సారైనా రిమ్స్‌కు తీసుకొచ్చి వైద్య సేవలు అందించిన పాపాన పోలేదు. చివరకు మంగళవారం శ్రీనివాసులురెడ్డిని రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో కూడా పాత పరీక్షల రిపోర్టులను రిమ్స్ అధికారులకు చూపించకపోవడంతో సాధారణ కేసుగా తీసుకుని వైద్య సేవలు అందించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
తిలాపాపం.. తలాపిడికెడు..
పులివెందుల మండలంలోని పుట్రాయనిపేటకు చెందిన కల్లూరు శ్రీనివాసులురెడ్డి మరణంలో తిలాపాపం..తలాపిడికెడు అన్న చందాన ఇటు వైద్యులు.. అటు కేంద్ర కారాగార అధికారులను బాధ్యులుగా చేయక తప్పదు. కేంద్ర కారాగార అధికారులు రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో శ్రీనివాసులురెడ్డి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలియజెప్పకపోవడం... రిమ్స్‌లో ప్రత్యేక నిబంధనల పేరుతో ప్రాణం పోతున్నా బయటికి పంపించకపోవడం వంటి కారణాల వల్ల శ్రీనివాసులురెడ్డి మృతి చెందాడని బంధువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఆయన మరణానికి అధికారులు తప్పు చేసిన నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment