- రూ.12 లక్షల మద్యం నిల్వలు స్వాధీనం
- గుడ్లవల్లేరు నుంచి సరకు తెచ్చి అక్రమంగా విక్రయాలు
- నిర్వాహకులు తెలుగు తమ్ముళ్లే!
మచిలీపట్నం : మచిలీపట్నంలో అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయ్యింది. బైపాస్ రోడ్డులోని బైపాస్ వైన్స్‌లో పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బైపాస్ వైన్స్‌ను తెలుగు తమ్ముళ్లే నిర్వహించటం గమనార్హం. ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ సీఐ రామశివ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని బైపాస్ వైన్స్‌కు కేటాయించిన మద్యం కాకుండా గుడ్లవల్లేరు, గుడివాడ ప్రాంతంలోని మద్యం షాపులకు కేటాయించిన మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదు అందిందింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎక్సైజ్ ఏఈఎస్ ఎం సునీత, సీఐ రామశివ, ఇతర సిబ్బంది బైపాస్ వైన్స్‌పై దాడి చేశారు. మద్యం దుకాణం వెనుక వైపు ఉన్న పెద్ద గదిలో మద్యాన్ని నిల్వ ఉంచారు.
ఈ గదికి సంబంధించిన తాళాలు తెరవాలని ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు కోరినా మద్యంషాపు యజమానులు తాళం తీసేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రాంత వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టి తనిఖీలు చేస్తామని అధికారులు చెప్పటంతో మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బంది ఎట్టకేలకు తాళం తీశారు. ఈ తతంగం మొత్తం రెండు గంటల పాటు కొనసాగింది.
కప్పిపుచ్చేందుకు యత్నాలు...
ఈ లోపుగానే మద్యం షాపుపై దాడులు చేయవద్దని, ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కొందరు వ్యక్తులు రంగంలోకి దిగారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలోనే ఈ వ్యవహారం బయటపడటంతో విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకులు కసరత్తు చేశారు. అయితే బైపాస్ వైన్స్‌కు కేటాయించిన మద్యం కాకుండా వేరే ప్రాంతాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి ఇక్కడ విక్రయించటం, ఎక్సైజ్ అధికారులు దాడులు చేయటంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారు.
గురువారం రాత్రి 7.30 గంటలకు బైపాస్ వైన్స్‌లో 112 లిక్కర్ కేసులు, 102 బీరు కేసులు వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం కేసులకు సంబంధించి జారీ చేసిన తేదీ, లేబుల్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మరికొన్ని మద్యం కేసులను పరిశీలించాల్సి ఉందని ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
నిబంధనలకు విరుద్దంగా వేరే ప్రాంతం నుంచి మద్యాన్ని మచిలీపట్నంకు తరలించి విక్రయించిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయిన అనంతరం బైపాస్ వైన్స్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏఈఎస్ సునీత తెలిపారు. షాపు యజమాని బయట ప్రాంతాల నుంచి మద్యం ఇక్కడ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారని ఆమె తెలిపారు.