టీడీపీకి పోలీసుల వత్తాసు | illegal arreste in our party zptc | Sakshi
Sakshi News home page

టీడీపీకి పోలీసుల వత్తాసు

Published Fri, Jul 18 2014 4:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

టీడీపీకి పోలీసుల వత్తాసు - Sakshi

టీడీపీకి పోలీసుల వత్తాసు

జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని...

- మా జెడ్పీటీసీ అరెస్టు అక్రమం
- ఎమ్మెల్యేలపై కేసులు అన్యాయం
- పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని

 ఒంగోలు అర్బన్ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆరోపించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుట్ర కోణంలో భాగంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజే తమ పార్టీ మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డిని డీఎస్పీ రామాంజనేయులుతో తెలుగు తమ్ముళ్లు అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్ సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నా జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు టీడీపీ ఎన్నో ఎత్తులు వేయగా పోలీసు యంత్రాంగం వాటికి సహకరించిందని నూకసాని విమర్శించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అండతో వైఎస్సార్ సీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
టీడీపీ కుట్రలకు వైఎస్సార్ సీపీ బ్రేక్
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయిందని బాలాజీ వ్యంగ్యంగా అన్నారు. తనను టీడీపీలో అణగదొక్కుతున్నారని, ఈ సారికి సహకరించాలని ఈదర హరిబాబు కోరినందునే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఆయనకు అండగా నిలిచారని వివరణ ఇచ్చారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ఈదర కోరికను వైఎస్సార్ సీపీ అంగీకరించిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ సభ్యులు తన మాయలో పడ్డారని ఈదర హరిబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఈదర మాటలు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు ఉన్నాయని, సీనియర్ నాయకునిగా అలా మాట్లాడటం సరికాదని బాలాజీ హితవు పలికారు.

ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తోందని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలు, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం మానుకోకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలాజీ హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement