‘సాక్షి’ మీడియా విలేకరిపై అక్రమ కేసు
తుని : రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు చేసే ప్రయత్నానికి రాజకీయ రంగు పులిమారు. నిజాలను నిష్పక్షపాతంగా ప్రజలకు వివరించిన ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపులు మొదలెట్టారు. రైతుబజార్‌లో టీడీపీ నాయకుడి దందాపై ‘సాక్షి’ మీడియా విలేకరి చిత్రీకరించిన సంఘటనే ఈ కేసుకు కారణమని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసు బనాయించారని పలువురు విమర్శిం చారు. కేసు బనాయింపును ప్రజాసంఘాలు, జర్నలిస్టు సం ఘాలు తీవ్రంగా ఖండించాయి. ‘సాక్షి’ మీడియా విలేకరి కంఠం అప్పారావుపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయాన్ని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు తీసుకువెళ్లారు. మీడియా స్వేచ్ఛను హరించేలా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వ్యహరించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు.
ఎస్పీని కలిసిన జర్నలిస్టు నేతలు
కాకినాడ క్రైం : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని జర్నలిస్టు సంఘ నేతలు పేర్కొన్నారు. తుని సాక్షి టీవీ రిపోర్టర్ అప్పారావుపై మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు, టీడీపీ నేత ఆర్.సూరిబాబు తప్పుడు కేసు బనాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. తుని మార్కెట్ యార్డులోని రైతు బజారులో టీడీపీ నేత సూరిబాబు బాగోతాన్ని చిత్రీకరించేందుకు అక్కడకు వెళ్లాడు.
విషయం తెలుసుకున్న టీడీపీ నేత సూరిబాబు అక్కడకు చేరుకుని అప్పారావును బెదిరించాడు. దీంతో అప్పారావు పోలీసులను ఆశ్రయించాడు. కాగా అప్పారావు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సూరిబాబు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. పాత్రికేయుడు అప్పారావుపై టీడీపీ నేత సూరిబాబు చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలని జర్నలిస్టు నేతలు ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ రవిప్రకాష్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవింద్ బాబును విచారణకు ఆదేశించారు.