బడే దేవరకొండపై యంత్రాలు మాయం!
పార్వతీపురం టౌన్: మండలంలోని బడేదేవరకొండపై అక్రమంగా తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కొక్కటిగా యంత్రాలను తరలించేస్తున్నారు. అయినా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంవద్ద కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ వచ్చి సర్వే చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై తీర్పు వెలువడేంతవరకూ అక్కడ ఎలాంటి పనులు చేయకూడదనీ... ఇదివరకు అక్కడ ఉన్న వస్తువులను, యం త్రాలను తరలించకూడదనీ ఉత్తర్వులున్నాయి. కానీ యంత్రాలు తరలిపోతున్నా అటవీశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
మండలంలోని ములగపంచాయతీ పరిధి సర్వేనంబర్ 1లో తవ్వకాలకు ఎంఎస్ పళని గ్రానైట్స్ కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సంస్థ ఆ ఉత్తర్వులను విస్మరించి కోరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1లో తవ్వకాలు ప్రారంభించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కానీ ఇచ్చిన అనుమతులు సక్రమమేనంటూ స్థానిక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, రెవె న్యూ, అటవీ, మైన్స్ శాఖాధికారులు నిర్థారించారు.
అయి తే హైకోర్టు నియమించిన హైపవర్ కమిటీలోని అధికారులు పక్కాగా రిజర్వ్ ఫారెస్టు అని తేల్చి నివేదికను తయా రు చేసి హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో హైకో ర్టు అక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని, కొండపైవున్న యంత్రాలను తరలించకూడదని హైపవర్ కమిటీకి సూచించింది. అంతేగాకుండా సబ్‌కమిటీ రిపోర్టును కూడా సమర్పించాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రెండు వారాల గడువు కావాలని కోరినట్లు సమాచారం. సబ్‌కమిటీ రిపోర్టు తయారు చేసే లోగా బడేదేవరకొండపై ఉన్న యంత్ర పరికరాలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్కొక్కటిగా తరలిన యంత్రాలు
కొండపై గ్రానైట్ కటింగ్ పనులు ప్రారంభించిన సమయంలో ఐదు యంత్రాలు ఉండేవి. వాటితోపాటు జనరేటర్, జేసీబీ వంటి యంత్రాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవేవీ అక్కడ కన్పించడం లేదు. కేవలం ఒక్క యంత్రం మాత్రమే ప్రస్తుతం ఉంది. సబ్ కమిటీ రిపోర్టు తయారు చేసే లోపు ఉన్న ఆ ఒక్క యంత్రాన్ని కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలు జరిపి, పచ్చని కొండలను విధ్వంసం చేసినందుకు ఎవరు బాధ్యులవుతారు. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొదటినుంచీ ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను, రిజర్వ్‌ఫారెస్టులో జరుగుతున్న తవ్వకాలను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసిన సంగతీ తెలిసిందే. ఇతనితోపాటు మరో 40 మంది గిరిజనులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నదే ప్రశ్న.