అడ్డగోలు భూ సేకరణ!
► అధికారుల ఇష్టారాజ్యం
► ఇళ్ల స్థలాలకు మెట్టభూమి ధర
► సోమశిల బాధితులకు తిప్పలు
సంగం: నెల్లూరు-ముంబై జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ అడ్డగోలుగా జరింది. రహదారి పనుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం మంజూరు విషయంలో నిబంధనలు తుంగలో తొక్కారు. ఇళ్ల స్థలాలకు మెట్ట భూమి ధర ఇస్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాలకు సైతం అతి తక్కువ ధరకు కోట్ చేస్తుండటంతో తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
విషయం ఏమిటంటే
నెల్లూరు - ముంబాయి రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరణలో భాగంగా సంగంలో 12.26 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించారు. ఆ భూములకు ధరలు నిర్ణయించే ప్రక్రియ ప్రారంభం నుంచి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంగం మండలంలో ఎకరా భూమిని రూ.4 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. అయితే రూ.20, రూ.30 లక్షలకు కూడా సంగం జాతీయ రహదారి పక్కన భూములు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాస్తవాలను పక్కనపెట్టిన అధికారులు ఎకరానికి రూ.4 లక్షల ఇస్తామనడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఇళ్ల స్థలాలకూ మెట్ట భూమిధరే
మరో విచిత్రమేమిటంటే సంగం గ్రామంలో కొన్ని ఇళ్లు జాతీయ రహదారి విస్తరణలో పోతున్నాయి. వీటికి సైతం ఇంటి ధరలు నిర్ణయించకుండా మెట్ట భూములకు ఇచ్చినట్లే రూ.లక్షలు నిర్ణయించారు. దీంతో ఇళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎంవీ రమణ అవార్డు ప్రకటించడంతో ఇంటి యజమానులు, రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ వార్డులో ఏ ఒక్కటీ నిజం లేదని, తమను సంప్రదించకుండానే అధికారులు నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఇవ్వడం లేదు
నా ఇంటి స్థలానికి రిజిస్ట్రేషన్ నగదు కూడా ఇవ్వడం లేదు. మెట్టభూమిగా పరిగణించి ధర నిర్ణయించడం దారుణం.- సింగమల శ్రీనివాసులరెడ్డి
కన్వర్షన్ కట్టినా మెట్టభూమిగా పరిగణించారు
నేను వ్యవసా య భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు కన్వర్షన్ చెల్లించి ఇంటి స్థలంగా మార్చుకుని వాటర్ ప్లాంట్, వే బ్రిడ్జి, రూములు కట్టుకున్నా. కానీ ఇప్పుడు స్థలాలకు మెట్టభూమి ధర ఇస్తున్నట్లు అవార్డు తీర్మానించారు. - వెంకటేశ్వర్లురెడ్డి