గుంటూరు జిల్లాలో అనధికార లే అవుట్లలోని స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. నాలుగు నెలల వ్యవధిలో 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్ధలాలను పప్పుబెల్లాల్లా అమ్మేశారు. ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ సిబ్బంది తలమునకలై ఉండటాన్ని గమనించి తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు తెరతీశారు. ఈ అక్రమ లే అవుట్లతో ఒకవైపు కొనుగోలుదారులను మోసగించడంతోపాటు మరోవైపు భారీగా ప్రభుత్వాదాయానికి గండికొట్టారు.
రియల్టర్లకు జైలుశిక్ష...
అనధికార లే అవుట్లలోని నివేశన స్ధలాలను విక్రయించిన రియల్టర్లు, ఏజెంట్లకు మూడు సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. అయినా అధికార పార్టీ నేతల అండదండలతో రియల్టర్లు ఒక ఎకరానికి లే అవుట్ తీసుకుని ఐదారు ఎకరాల్లోని నాన్ లే అవుట్లలోని స్ధలాలను అమ్మేశారు. మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కొరత, గ్రామపంచాయతీ సిబ్బంది అవినీతి కారణంగా ఈ దందా ఇంకా కొనసాగుతోంది. బిపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) తరహాలోనే అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందనే ఉద్దేశంతో అనేకమంది కొనుగోలుదారులు ఈ నివేశన స్ధలాలను కొన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం,తిరుపతి, విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో అనధికార లేఅవుట్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. విశాఖ, గుంటూరు, నెల్లూరు వంటి కార్పొరేషన్లలో సమీప గ్రామాలు కూడా విలీనం అవుతుండటంతో అక్కడి స్ధలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ విలీన గ్రామాల్లోని స్ధలాలకు సమీప కాలంలో మంచి డిమాండ్ రానుందని ఏజెంట్లు ప్రచారం చేసుకుని అమ్మకాలు చేశారు. రంగురంగుల బ్రోచర్లలో లే అవుట్ల అనుమతులకు సంబంధించిన సీఆర్‌డిఏ నెంబర్లు ఉదహరించి మరీ అమ్మకాలు సాగించారు. అయితే కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న లే అవుట్ల విస్తీర్ణానికి మించిన స్ధలాలను అమ్మి కొనుగోలుదారులను నిలువునా ముంచేశారు.
ఎన్నికల సందడిలో..
ఆన్‌లైన్ విధానంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించింది. గతంలో పంచాయతీ పరిధిలో లే అవుట్ల అనుమతికి అక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతి తప్పనిసరి. వారు సిఫారసు చేసిన తరువాత కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖలో ఆ లే అవుట్లకు అనుమతి మంజూరు చేసేది. ఈ విధానంలో గ్రామ పంచాయతీల సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తమ పరిధిలో అనధికార లే అవుట్లు ఉంటే వాటి వివరాలను కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖకు పంచాయతీ సిబ్బంది సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత డిసెంబరు వరకు రాష్ట్రంలో అనధికార లే అవుట్ల సంఖ్య 2 వేలకు మించిలేదు. అయితే జనవరి నుంచి సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అన్ని శాఖల సిబ్బంది నిమగ్నం కావడంతో రియల్టర్ల అక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు.
తెలుగుదేశం నేతల అండ
కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రియల్టర్ల వెంచర్లకు అక్కడి కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే అనుమతుల కంటే ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అనుమతి తప్పనిసరి. వారి నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లిన తరువాతనే కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖ ఆ వెంచర్లకు అనుమతి ఇచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రియల్టర్ల నుంచి భారీ మొత్తాల్లో మామూళ్లు తీసుకుని లే అవుట్ల అనుమతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. దీనికితోడు వారే అనధికార లే అవుట్లలోని స్ధలాల అమ్మకాలను ప్రోత్సహించారు. దీంతో రియల్టర్లు ఎకరం పొలంలో లే అవుట్లకు అనుమతి తీసుకుని నాలుగైదు ఎకరాల్లోని అనధికార లే అవుట్ల స్ధలాలను విక్రయించారు. ఇలా దాదాపు 18 వేల లే అవుట్లలోని స్థలాలను విక్రయించేశారు. కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ చేసిన సర్వేలో 16 వేలకుపైగా అనధికార లే అవుట్లు ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ విభాగం డైరెక్టర్ రాముడు ధ్రువీకరించారు. దాదాపు అన్ని పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోందని చెప్పారు. దాదాపు 1100 మంది సిబ్బంది కొరత తమ శాఖలో ఉందని, దీని కారణంగా అక్రమాలను నిలువరించలేని పరిస్ధితి ఉందన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
రియల్టర్ల దందా కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దాదాపు 18 వేల అనధికార లే అవుట్లలోని స్ధలాలన్నింటినీ క్రమబద్దీకరిస్తే కోట్లలోనే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపనున్నారు. వీటి క్రమబద్దీకరణతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రియల్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయం ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నామని ప్లానింగ్ డైరెక్టర్ రాముడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment