ఏపి రాజధాని:రియల్టర్లకు లాభాల పంట!
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభాల పంట పండించుకుంటున్నారు. మూడు నెలల నుంచి రాజధాని ఎక్కడో స్పష్టంగా తేల్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఎంపిలు అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా తేల్చలేదు. చంద్రబాబు విజయవాడ- గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణస్వీకారం చేశారు. దాదాపు ఆ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నంబూరు, కాజ, కంతేరు, తాడికొండ, అమరావతి రోడ్డు పక్కల, పొన్నెకల్లు, మంగళగిరి చుట్టుపక్కల నీరుకొండ, నిడమర్రు, పరిమి, చినకాకాని, ఆత్మకూరు, విప్పటం .....గ్రామాలలోతోపాటు, గుంటూరు చుట్టుపక్కల చిలకలూరిపేట వరకు భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గ్రామాలలో ఎక్కడబడితే అక్కడ భూములు కొనుగోలు చేసి, ఉడా ఆమోదంలేకుండా, 20, 30 అడుగుల రోడ్లు మాత్రమే చూపుతూ వందల వెంచర్లు వేసేశారు. కొందరైతే కాగితాలమీదే వెంచర్లు వేసి అమ్మకాలు కొనసాగించారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ పక్కన ఆ ప్రాజెక్టు, ఈ పక్కన మరో ప్రాజెక్టు అని చెప్పేసి అమ్మకాలు చేసేస్తున్నారు.
ఆ తరువాత అమరావతి వద్ద అని ప్రచారం జరిగింది. దాంతో అమరాతి చుట్టుపక్కలతోపాటు, పక్కనే ఉన్న తుళ్లూరు మండలంలో భూముల ధరలు పెరిగిపోయాయి. మళ్లీ కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం అని ప్రచారం జరిగింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు చుట్టుపక్కల ఎకరం ధర లక్షల నుంచి కోట్ల రూపాయలకు చేరింది. అడ్డదిడ్డంగా ఎక్కడబడితే అక్కడ ఉడా ఆమోదంలేకుండా వెంచర్లు వేసేశారు. 18 అడుగుల రోడ్లు, 65 గజాల ప్లాట్లు కూడా వేసి అందినకాడికి దండుకుంటున్నారు. రాజధాని సమీపంలో ఇల్లు కట్టుకోవడానికి వంద గజాల స్థలం ఉన్నా చాలునని చాలా మంది భావిస్తున్నారు. దాంతో అందరూ ఎగబడి కొనడం మొదలు పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాల పంటపండుతోంది. మొదటి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కడో ఒకచోట రాజధాని ఏర్పడుతుందనేది అందరి నమ్మకం. ఆ విధంగా ప్రచారం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకనైతే చేశారు గానీ, ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. విజయవాడ చుట్టుపక్కల అని మాత్రమే చెప్పారు. కృష్ణా నదికి అటువైపా? ఇటువైపా? అనేది స్పష్టం చేయలేదు. నూజివీడా? అమరావతా? మంగళగిరా? అనేది కూడా వివరించలేదు. దానికి తోడు ఎంపిలు, మంత్రులు పోటీలు పడి ఒకరు నూజివీడు అంని చెబుతుంటే, మరొకరు మంగళగిరి వైపని, ఇంకొకరు అమరావతి వైపని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా కొందరు ప్రమాణస్వీకారం చేసిన వద్దనుంచి మొదలుకొని అటు అమరావతి వైపు విస్తరిస్తుందని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారాలతో ఈ అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులలో బాధ్యత గల ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని విషయంలో ఒక స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు.
- శిసూర్య