సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యాశాఖలో అక్రమ బదిలీలకు తెరలేచింది. ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రత్యేక ఉత్తర్వుల పేరిట వ్యవహారం జోరుగా నడుస్తోంది. రెండ్రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 41 మంది టీచ ర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో 25 మంది టీచర్లు పరస్పర బదిలీలు కావడం విశేషం. మరోవైపు ఖాళీ లేని పోస్టుకు ఏకంగా నలుగురిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
వాస్తవంగా ఒకేచోట ఎనిమిదేళ్లపాటు పనిచేసిన ప్రతి టీచరుకూ బదిలీ తప్పనిసరి. ఏటా వేసవి సెలవుల్లో చేపట్టే ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకునే టీచర్లంతా కోరిన చోటుకు బదిలీ అయ్యేందుకు వ్యూహరచన చేసి విజయవంతమయ్యారు. దొడ్డిదారిలో బదిలీ చేసుకుని దర్జాగా విధుల్లో చేరుతున్నారు.
పట్టణ రాబడి వదులుకోలేక..
పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లకు 30 శాతం ఇంటి అద్దె భృతితోపాటు ఇతర అలవెన్సులు వస్తాయి. ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కానున్న నేపథ్యంలో.. కౌన్సెలింగ్‌కు ముందే కోరిన చోటుకు బదిలీ అయ్యేందుకు ఎత్తు వేశారు. పట్టణ బడిలో పనిచేయడంతో వచ్చే ప్రత్యేక అలవెన్సులు వదులుకోలేక ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీ నడిపించారు. పోస్టులు ఖాళీ లేనప్పటికీ.. ఇద్దరు ఉపాధ్యాయులు పరస్పరం బేరం కుదుర్చుకుని బదిలీకి మార్గం సుగమం చేసుకున్నారు. పరస్పర బదిలీ కేటగిరీలో ఏకంగా 25 మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు అందడం గమనార్హం.
ఖాళీయే లేని చోటుకు నలుగురు..
తాజా బదిలీల ప్రక్రియలో భాగంగా పైరవీలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఖాళీ లేని చోటికి సైతం నలుగురు టీచర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఇటీవల భర్తీ అయ్యింది. కానీ తాజా బదిలీ ప్రక్రియలో ఏకంగా నలుగురు టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఖాళీలేని ఘట్‌కేసర్ మండలం పిర్జాదీగూడ జెడ్పీ పాఠశాల జీహెచ్‌ఎం పోస్టులో కూడా నలుగురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు అందాయి. ఒకే పోస్టుకు నలుగురు, ఐదురుగు టీచర్లను నియమించడంతో విద్యాశాఖ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
ఆ ఉత్తర్వులు రద్దు చేయాలి: ఉపాధ్యాయ సంఘాల నేతలు
ప్రత్యేక ఉత్తర్వులతో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయొద్దని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉత్తర్వులన్నీ రద్దు చేయాలని కోరాయి. జిల్లా స్థాయిలో చేపట్టే బదిలీల కౌన్సెలింగ్ నిబంధనలకు ఈ ఉత్తర్వులు పూర్తి విరుద్ధమని, ఈ తంతును వెంటనే రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్‌రెడ్డి, ఆంజనేయులు, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కైలాసం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బదిలీల జాతర!
Published Thu, Feb 6 2014 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement