గాడి తప్పిన పౌరసరఫరాల వ్యవస్థ
సాక్షి, గుంటూరు : రేషన్ బియ్యం అక్రమ రవణా జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతోంది. నియంత్రించాల్సిన పౌరసరఫరాలశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో జిల్లాలో రేషన్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ బియ్యాన్ని మిల్లులకు తరలించి సంచులు మార్చి రీసైక్లింగ్ చేసి, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేయకుండా మళ్లీ లెవీ కింద ఈ బియ్యాన్నే ఇస్తున్నారు. జిల్లాలోని కొన్ని ముఠాలు పక్కా ప్రణాళికతో ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాయి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
కొత్త కార్డులు ఏవీ?
ఆధార్ అనుసంధానంతో జిఆ్లలో బోగస్ రేషన్‌కార్డులకు చెక్ పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా కొత్తగా రేషన్‌కార్డుల కోసం రచ్చబండ-3లో 73,000 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారికి కార్డులు ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 14,19,952 రేషన్ కార్డులన్నాయి. వీటిలో దాదాపు 46,52,994 మంది సభ్యులున్నారు. ఇందులో దాదాపు 97 శాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. దాదాపు 3,38,918 యూనిట్లు బోగస్‌విగా గుర్తించడంతో జిల్లాలో 1.5 లక్షల తెల్లరేషన్ కార్డులకు బియ్యం సరఫరా ఆగిపోయింది. దీనికితోడు దసరా పండుగకు పేదలకు అదనంగా చక్కెర సరఫరా విషయంపై ప్రభుత్వం ఇంత వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు.
సిబ్బంది కొరత...
పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. జిల్లాలో దాదాపు 96 మంది సిబ్బంది ఉండాలి. కాని 34 మంది మాత్రమే ఉండటంతో పర్యవేక్షణ కొరవడి ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నేరుగా బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. గ్రేపర్చేజింగ్ అసిస్టెంట్‌లు (జీపీఏలు) 8 మంది ఉండాలి. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు 19 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. దీంతో బియ్యం అక్రమ రవాణాపై సిబ్బంది పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. వీటన్నింటిపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.
నేడు అధికారులతో మంత్రి సునీత సమీక్ష
పాతగుంటూరు: పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పౌర సమాచార శాఖ అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున ఆమె గుంటూరు చేరుకుంటారు. ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు రేపల్లె నియోజకవర్గం బే తపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.