సాక్షి ప్రతినిధి, గుంటూరు :పాడి పరిశ్రమకు, పశుపోషకులకు ఆలంబనగా నిలవాల్సిన డెయిరీ అక్రమాలకు కేంద్రంగా మారింది. సంస్థలోని కొందరు ఉద్యోగులు తెలుదేశం పార్టీ కార్యకర్తలుగా రూపాంతరం చెందారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీకి టీడీపీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కొందరు ఉద్యోగులు డెయిరీలోవిధులు నిర్వహించకుండా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతూ జీతాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది రైతులు పాడిపరిశ్రమ అభివృద్ధికి తమ భూములను విరాళంగా ఇచ్చి ఒక రోజు పాల వేతనాన్ని అప్పగించి పునాదులు వేస్తే నేడు ఆ డెయిరీ ఆశయాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ఇతర జిల్లాల వారికే ఉద్యోగాలు..
జిల్లాలో పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాల్సిన పాలకవర్గం అందుకు భిన్నంగా అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలోని నిరుద్యోగ యువతకు శఠగోపం పెడుతోంది. 1994లో సంగం డెయిరీలో పాల ఉత్పత్తిదారుల పిల్లల సంక్షేమం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసేందుకు వీరయ్య చౌదరి ఆధ్వర్యంలోని దూళిపాళ్ల మెమోరియల్ ట్రస్టుకు పదెకరాల భూమిని విరాళంగా అందజేశారు. కళాశాలను ఏర్పాటు చేయకుండా ఆ భూములను సొంత ఆస్తిగా అనుభవిస్తున్నారు.
వీరయ్య చౌదరి మరణానంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల పాల ఉత్పత్తిదారులు ట్రస్టు కోసం ఒక రోజు పాల వేతనం రూ.18 లక్షలను జమ చేయగా, ఆ నగదు జమా లెక్కలు వివరాలను చైర్మన్ ఇంత వరకు వెల్లడించలేదు.కీలక సిబ్బందికి నో రిటైర్‌మెంట్.. డెయిరీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసినప్పటికి వారి స్థానంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. అదే సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకొని వేలకు వేలు జీతాలిస్తూ పెంచి పోషిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కొందరు సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయి నిబంధనలకు విరుద్ధంగా పెదకాకాని మండలంలో నగదు పంచుతూ పోలీసులకు చిక్కటమే ఇందుకు నిదర్శనం.
ఎక్స్‌గ్రేషియానూ వదలటం లేదు.. డెయిరీలో 200 మంది వరకు ఎసైన్‌మెంట్ సిబ్బంది ఉన్నారు. వారికిచ్చే అరకొర జీతం నుంచి విరాళాలు ఇవ్వాలని డెయిరీ యూనియన్ నాయకులు పార్టీకి చందాలు వసూలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌గా ఉన్న నరేంద్రకుమార్ పొన్నూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఆ పార్టీ అనుబంధ యూనియన్ నాయకులు ఒక్కో ఉద్యోగి నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు విరాళాలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా కింద అందజేసే సొమ్ములో కొంత మొత్తాన్ని విరాళంగా వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్క్ సొసైటీల నుంచి ఇదే తరహాలో విరాళాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.సంగం డెయిరీ ఏర్పడిన తరువాత పాలక వర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారు డైరక్టర్లుగా ఎన్నిక కాకపోవటం గమనార్హం.
బలహీన వర్గాలకు చెందిన వారు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు గ్రామాల్లో పాల ఉత్పత్తిదారులుగా ఉండగా వారికి పాలకవర్గంలో అవకాశం దక్కటం లేదు. ప్రస్తుత పాలకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అధిక శాతం ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం కూడా లేకపోవటం విమర్శలకు కారణమవుతుంది. పవర్‌ప్లాంట్‌కు డెయిరీ భూమి.. డెయిరీ భూమిలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన పాలకవర్గం ఆ భూమిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నదనే విమర్శలున్నాయి. ప్రయివేట్ పవర్ ప్లాంట్‌కు మూడెకరాల భూమిని అధిక మొత్తాలకు లీజుకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీనాథ్‌ను వివరణ కోరగా ఆ భూమిని పదేళ్లకు మాత్రమే లీజుకిచ్చామని, అక్కడ ఉత్పత్తయ్యే కరెంటులో కొంతభాగం డెయిరీకిచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.
అక్రమాల పుట్ట
Published Sun, Apr 27 2014 12:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement