
నేను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు: చంద్రబాబు
తెలుగు ప్రజలకు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్: ‘నేను ఒక్కసారి కమిటైతే కాంప్రమైజ్ అయ్యే రకం కాదు..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి రాష్ట్ర పర్యటనకు వెళ్లే ముందు.. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రను తిరగరాసే సంధికాలంలో ఉన్నాం. తెలుగువారి సత్తా ఏంటో లోకానికి చాటే మహత్తర అవకాశం మన ముందుంది.
భావితరాలకు బంగారు ఆంధ్రప్రదేశ్‌ను అందించేందుకు మరోసారి సంక్రాంతి శుభ సమయంలో సంకల్పం చెప్పుకుందాం. నవలోకం వైపు నడిపిస్తా నాతో రండి. ఒక గొప్ప రాష్ట్రాన్ని నిర్మించుకుందాం..’ అని ఒక ప్రకటనలో కోరారు. ‘రైతు కష్టాలు తెలుసు కాబట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింప చేయకుండా రూ.50 వేలలోపు రుణాలను పూర్తిగా రద్దు చేశాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు మంచి ప్యాకేజీ ప్రకటించాం. గృహావసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కొత్తగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ తీసుకున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.