‘‘నేను విద్యాశాఖ డెరైక్టర్‌ని మాట్లాడుతున్నా’’ | I'm talking the director of Education | Sakshi
Sakshi News home page

‘‘నేను విద్యాశాఖ డెరైక్టర్‌ని మాట్లాడుతున్నా’’

Published Thu, Jul 31 2014 1:16 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘‘నేను విద్యాశాఖ డెరైక్టర్‌ని మాట్లాడుతున్నా’’ - Sakshi

‘‘నేను విద్యాశాఖ డెరైక్టర్‌ని మాట్లాడుతున్నా’’

కాకినాడ లీగల్ :మే ఒకటో తేదీ...సమయం : ఉదయం పది గంటలు కాకినాడలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం... ట్రింగ్.. ట్రింగ్.. ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. అటెండర్ ఫోన్ ఎత్తగానే ‘‘నేను విద్యాశాఖ డెరైక్టర్‌ని మాట్లాడుతున్నా... మీ డీఈఓ గారు ఉన్నారా?’ అవతలి వ్యక్తి అడిగాడు. ‘లేరు సార్... కలెక్టరేట్‌లో మీటింగ్‌కు వెళ్లారు...’ అంటూ అటెండర్ సమాధానం ఇచ్చాడు.‘నా సెల్ నంబర్ 7675935991... మీ డీఈఓ గారిని అర్జెంటుగా నాకు ఫోన్ చేయమని చెప్పు...’ అని అవతలి వ్యక్తి ఆదేశించాడు.‘అలాగే సార్...’ అంటూ అటెండర్ సమాధానమిచ్చాడు. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టగానే అటెండర్ డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పి, అవతలి వ్యక్తి సెల్ నంబర్‌ను ఆయనకు ఇచ్చాడు.
 
 సమావేశం అనంతరం డీఈఓ బయటకు వచ్చి అటెండర్ ఇచ్చిన సెల్ నంబర్‌కు ఫోన్ చేశాడు. తాను విద్యాశాఖ డెరైక్టర్‌నని, తన కుమారుడు అవంతి మెడికల్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళుతుండగా రైలులో సూట్‌కేసు ఎవరో దొంగిలించారని చెప్పాడు. తన కుమారుడి అవసరాల నిమిత్తం రూ. 30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేయాల్సిందిగా, అవతలి వ్యక్తి డీఈఓకు సూచించాడు. దీంతో డీఈఓ శ్రీనివాసులు రెడ్డి ఏటీఎం నుంచి సొమ్ము డ్రా చేసి అవతలి వ్యక్తి ఇచ్చిన ఖాతా నంబర్‌కు సొమ్ము జమ చేశారు. మరలా ఆ వ్యక్తి డీఈఓకు ఫోన్ చేసి తాను అన్నవరం వెళ్లేందుకు విమానంలో మధురపూడి వస్తున్నానని, ఇన్నోవా కారు తన కోసం సిద్ధం చేయాలని సూచించాడు.
 
 అతడు నిజంగానే డెరైక్టర్ అని నమ్మిన డీఈఓ కారులో మధురపూడి విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ వ్యక్తికి డీఈఓ ఫోన్ చేయగా 15 నిముషాల్లో మధురపూడి చేరుకుంటున్నామని బదులిచ్చాడు. అతడి కోసం డీఈఓ నిరీక్షిస్తుండగా.. ఎంతకీ అతడు రాకపోవడంతో విమానాశ్రయంలో డీఈఓ విచారించారు. ఆ సమయంలో విమానాలు ఏమీ రావని సమాధానం రావడంతో కంగుతిన్న డీఈఓ ఆ వ్యక్తి సెల్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌లోని డెరైక్టర్ కార్యాలయానికి డీఈఓ ఫోన్ చేసి విషయం తెలుసుకోగా డెరైక్టర్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడి సిబ్బంది చెప్పారు.
 
 దీంతో తాను మోసపోయానని గ్రహించిన డీఈఓ శ్రీనివాసులు రెడ్డి అవతలి వ్యక్తిపై ఆరా తీయించారు. అతడు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నాగులాపల్లి (పోస్టు) ఈదులపల్లికి చెందిన మామిడిపల్లి యాదయ్యదిగా గుర్తించారు. దీంతో డీఈఓ శ్రీనివాసులు రెడ్డి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి యాదయ్యను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement