విద్యా శాఖలో ప్రక్షాళన పర్వం
♦ డీఈఓ సస్పెన్షన్‌కు సిఫార్సు
♦ ముగ్గురు ఏడీలకు షోకాజ్ నోటీసులు
♦ పాఠశాల ఇన్‌చార్జి కమిషనర్ శ్రీనివాసులు
నెల్లూరు (టౌన్) : జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన పర్వం మొదలు కానుందా.. అవుననే చెబుతున్నారు పాఠశాల విద్యా శాఖ ఇన్‌చార్జి కమిషనర్ గుర్రాల శ్రీనివాసులు. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధికారిగా, పాఠశాల విద్యా శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులు బుధవారం డీఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సర్వశిక్షాభియాన్ బృందంతో కలిసి కార్యాలయంలోని అన్ని సెక్షన్లలో రికార్డులను పరిశీ లించారు. రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండటంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే నిర్ధారణకు వచ్చారు. జిల్లా విద్యాశాఖకు ఏటా ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులొస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారన్న దానిపై ఎలాంటి వివరాలు లేవు. మెడికల్ బిల్లులు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
సాధారణంగా బిల్లులను ఐదు రోజుల్లోగా క్లియిర్ చేయాల్సి ఉన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో వ్యక్తిగత రిజిసర్లు నిర్వహించాల్సి ఉండగా, అవి ఖాళీగా ఉండటాన్ని కమిషనర్ బృందం గుర్తించింది. బి, బి–1 సెక్షన్లలో ఎంట్రీలు చేయలేదు. కొత్త పాఠశాలల ఏర్పాటు, పాత అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి అందిన దరఖాస్తులు గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇదేమని అడిగితే ఎంఈఓల నుంచి నివేదికలు రాలేదని ఏడీఈలు సమాధానం ఇచ్చారు. కావలిలో ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో 7, 8, 9 తరగతుల ఏర్పాటుకు 2016లో దరఖాస్తు రాగా, అక్కడి ఎంఈఓ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఈ విషయాన్ని డీఈఓ పట్టించుకోకపోవడాన్ని ఎస్‌ఎస్‌ఏ బృందం తప్పుపట్టింది.
లోపాల పుట్ట
2015 అక్టోబర్‌లో అప్పటి విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించి.. 478 లోపాలను కనుగొన్నారు. ఆ తరువాత మరో 25 లోపాలను గుర్తించారు. మొత్తం 503 లోపాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓను ఆదేశించారు. ఇంతవరకు వాటిపై ఎలాంటి సమాధానం లేకపోవడంపై ఇన్‌చార్జి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎక్కడికి వెళుతున్నారన్న దానిపై మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా.. మూడేళ్ల కాలంలో కొన్ని నెలల వివరాలు మాత్రమే చూపించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నికర చెల్లింపులు జరగటం లేదని, పౌర సరఫరాల అధికారులు పెట్టిన బిల్లులకు యథాతథంగా చెల్లింపులు చేయడం తప్ప తప్ప పర్యవేక్షించిన దాఖలాలు లేవని గుర్తించారు. కొన్నిచోట్ల కేటాయిం చిన దానికంటే ఎక్కువ డ్రా చేశారని తనిఖీల్లో వెల్లడైంది. సామగ్రి కొనుగోళ్లు, కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించి ఎం.బుక్, సాంకేతిక మంజూరు పుస్తకాలు లేకపోవడాన్ని గుర్తించారు.
చర్యలకు సిఫార్సు చేస్తాం
పాలనలో లోపాలు, పర్యవేక్షణ కొరవడటం, గతంలో గుర్తించిన లోపాలపై చర్యలు తీసుకోకపోవడం వంటి పరిస్థితులపై పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి కమిషనర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ ఎం.రామలింగంను సస్పెండ్ చేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కార్యాలయ ఏడీలు విజయ, సుబ్రçహ్మణ్యం, నాగేశ్వరరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం వారిచ్చిన సమాధానాల ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. డీఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన వారిలో ఎస్‌ఎస్‌ఏ అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురుమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు.