రుణ మాఫీ ఫిర్యాదులపై మెలికలు
బ్యాంకు ధ్రువపత్రాలుంటేనే ఫిర్యాదుల స్వీకరణ
హైదరాబాద్: ఇప్పటికే రుణ మాఫీ విముక్తి పేరుతో రాష్ట్రస్థాయిలో పలు రకాల ఆంక్షలతో సగానికి పైగా రైతుల ఖాతాలను విముక్తి నుంచి ఏరివేసి రుణ ఊబిలోకి నెట్టివేసిన ప్రభుత్వం.. తాజాగా జిల్లా కేంద్రాల్లో రుణ విముక్తి ఫిర్యాదుల స్వీకరణలోను పలు మెలికలు, ఆంక్షలు విధించింది. బ్యాంకులు, సర్కారు చేసిన తప్పిదాలకు రైతులను బలి చేస్తోంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో గత నెల 27 నుంచి ఫిర్యాదుల స్వీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. వీటిపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
ఇలా ఉంటే ఫిర్యాదులు స్వీకరించరు
ఏ పంట, ఎంత విస్తీర్ణం అనే విషయంలో తప్పులు దొర్లితే.రుణ విముక్తి పత్రంలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైనట్టు చేసే ఫిర్యాదులు.కౌలు దారు, భూమి యజమాని ఒకే విస్తీర్ణంపై ఒకే సీజన్లో రుణం తీసుకుంటే. రుణం తీసుకున్న రైతు పేరు పలు రేషన్ కార్డుల్లో ఉంటే.. ఆ రైతును రుణ విముక్తి నుంచి తొలగించారు. దీంతో ఈ రైతు చేసే ఫిర్యాదులు. సరైన రేషన్ కార్డు, ఓటరు కార్డు ఉంటేనే ఇలాంటి వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. లేని వారి నుంచి స్వీకరించరు.
సర్వే నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నంబరు తప్పుగా నమోదైన రైతుల నుంచి స్వీకరించరు.ఒకవేళ.. ఇలాంటి వారు.. ఎమార్వో నుంచి అండగల్ ప్రతులు సమర్పిస్తే.. స్వీకరిస్తారు. భూ విస్తీర్ణం 50 ఎకరాలకు మించి ఉన్నా లేదా విస్తీర్ణం తప్పుగా నమోదైనా బ్యాంకు ధ్రువపత్రాలు ఇస్తేనే ఫిర్యాదు స్వీకరణ. రుణ బకాయి రూ.10 లక్షలకు పైనున్నా, రుణం మొత్తం విముక్తి పత్రంలో తప్పుగా నమోదైనా ఫిర్యాదు స్వీకరణకు షరతులు.
ప్రక్రియ ముందుకు సాగేనా?!
రుణమాఫీపై రైతుల నుంచి జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకోడానికి ముందు రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించలేదు. ఏదో ఒక నెపం జూపి రైతుల నుంచి ఫిర్యాదులను తిరస్కరిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.