నాలుగు నెలల్లో మన ప్రభుత్వం
Published Thu, Nov 28 2013 4:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
మలికిపురం/ అంబాజీపేట, న్యూస్‌లైన్:‘నాలుగు నెలల్లో రాష్ట్రంలో మన ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వం ఇలా ఉండదు. రైతులకు రుణమాఫీ చేస్తుంది. బాధితులకు తక్షణం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హెలెన్ తుపాను వల్ల నష్టపోయిన కోనసీమలో పర్యటించేందుకు మంగళవారం వచ్చిన ఆయన పర్యటన అర్ధరాత్రి దాటి తరువాత కూడా కొనసాగింది. తొలుత ఆయన అంబాజీపేట మండలం మాచవరంలో అరటి తోటను, తరువాత రాజోలు మండలం శివకోడులో తుపాను బాధిత రైతులను పరామర్శించారు. శివకోడులో నియోజకవర్గ కో ఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు తుపాను నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్‌మోహన్ రెడ్డి పరిశీలించారు. రైతుల నుంచి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే త్వరలో రాబోయే మన ప్రభుత్వం చేస్తుంది. అధైర్యపడవద్దు’ అని అని భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు కూడా అన్ని విధాలా సహాయం అందిస్తానన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జగన్ శివకోడు వచ్చినా ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూశారు. ఒంటి గంటకు దిండి చించినాడ వంతెన మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.
మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, మిండగుదిటి మోహన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుచ్చర్లపాటి సూర్యనారాయణరాజు, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు జక్కంపూడి తాతాజీ, మండల కన్వీనర్లు యెనుముల నారాయణస్వామి, జిల్లెళ్ల బెన్నీ, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగిరాజు సాయిరాజు, వాసంశెట్టి చిన సత్యనారాయణ, గెడ్డం పిలిఫ్‌రాజు, అల్లూరు రంగరాజు, పోతురాజు కృష్ణ, యూత్ కమిటీ సభ్యులు తెన్నేటి కిషోర్, గుండిమేను శ్రీనివాస్ యాదవ్, కుంపట్ల బాబి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాచవరంలో ధ్వంసమైన అరటి తోటను జగన్ పరిశీలించారు. కౌలు రైతు మంచాల సూరిబాబును పరామర్శించారు. ఎన్ని ఎకరాలు కౌలు తీసుకొని అరటి సాగు చేస్తున్నావని, అయిన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ‘ఐదెకరాలలో అరటి సాగు చేశాను. తుపానుకు మొత్తం ధ్వంసమైంది.
అరటి తోటను బాగుచేసుకొనేందుకే రూ.20 వేలు ఖర్చువుతుంది’ అని చెప్పాడు. మరో రైతు దొమ్మేటి వెంకటేశ్వరరావును జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ‘తుపానుకు కొబ్బరి చెట్లు విరిగిపోయాయి.. కొబ్బరి దిగుబడులు వచ్చేసరికి మూడేళ్లు పడుతుంద’ని చెప్పారు. 15 నిమిషాల పాటు జగన్ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పి.గన్నవరం మండల కన్వీనర్ అడ్డగళ్ల వెంకటసాయిరాం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదుటి మోహన్, మందపాటి కిరణ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గంగలకుర్రు మలుపు వద్ద యూత్ నాయకుడు విత్తనాల శేఖర్ ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.
Advertisement
Advertisement