రెండు నెలల పాటు కూతుర్నినిర్బంధించిన తల్లి
మతిస్థిమితం కోల్పోయిన వైనం
స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆస్పత్రికి
ఒక్కగానొక్కకూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఆ తల్లి చిత్ర హింసలకు గురిచేసింది. అనుమానం పెనుభూతమై తిండీ తిప్పలు లేకుండా చేసింది. ఏకంగా రెండు నెలల పాటు నిర్బంధించింది. ఏవేవో పూజలు చేసింది. చివరకు మతిస్థిమితం కోల్పోయేలా మార్చేసింది. మహిళాసంఘాల సహకారంతో ఆ బాలిక ఆస్పత్రికి చేరింది. ఈ ఘటన రేణిగుంట మండలంలో సోమవారం కలకలం సృష్టించింది.
తిరుపతి కార్పొరేషన్: కన్నబిడ్డను కంటికి రె ప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి మూఢనమ్మకాలు, పిచ్చి చేష్టలతో రెండు నెలలుగా గృహ నిర్బంధంలోకి నెట్టింది. సోమవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలు.. రేణిగుంటకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు(17) ఉన్నారు. తల్లి మొదటి నుంచి క్షుద్ర పూజలు, చేతబడులు వంటి వాటిపై నమ్మకం పెంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో అలాంటి వాతావరణాన్ని సృష్టించుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న తన ఒక్కగానొక్క కూతురి ప్రవర్తన సరిలేదని గుర్తించింది. క్షుద్రపూజలు చేస్తే మనసు మార్చుకుని దారిలోకి వస్తుందని భావించింది. అంతే పూజల పేరుతో రెండు నెలలు ఇంట్లోనే నిర్బంధించింది. రకరకాల క్షుద్ర పూజలు చేసింది.
పైగా కూతురి జడ వెంట్రుకలను కత్తిరించడం, కనీసం అన్నం కూడా పెట్టకుండా నిర్బంధంలో ఉంచడంతో ఆ చిట్టితల్లి మానసికంగా కుంగిపోయింది. పిచ్చిపిచ్చిగా అరవడం, మాట్లాడడం వంటి చేష్టలు చేసేది. దీంతో స్థానికులు గమనించి మహిళా సంఘాలు, సీపీఎం నాయకుల సహకారంతో గృహ నిర్బంధంలో ఉన్న ఆ బాలికను ఆదివారం కాపాడారు. మతి స్థిమితంలేని విధంగా మారిన సదరు బాలికను తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రుయాలో చికిత్స పొందుతోంది. బాలిక మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిసింది.
అనుమానమే పెనుభూతమై..
Published Tue, Sep 8 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement
Advertisement