ఆళ్లగడ్డటౌన్, న్యూస్‌లైన్: లాలించేది అమ్మ.. పాలించేది నాన్న. పిల్లలకు ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా తండ్రి గుండె వేగం పెరుగుతుంది. ఆ బాధ తనదిగా భావించి.. అప్పటికప్పుడు చికిత్స కోసం ఉరుకులుపరుగులు పెడతాడు. కుమారుడు.. కుమార్తెల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిషలు శ్రమిస్తాడు. అలాంటి ఓ నాన్న రోడ్డున పడ్డాడు. చెట్టంత కుమారులున్నా ఆయన వారికి కానివాడయ్యాడు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మును ఎవరికీ తక్కువ చేయకుండా పంచిపెట్టాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఊరుపొమ్మంటోంది.. పాడె రమ్మంటోందన్నట్లుగా బస్టాండ్‌లో రోజులు లెక్కబెడుతున్నాడు 70 ఏళ్ల ముసలితండ్రి. పట్టణంలోని షామిల్ వీధికి చెందిన జంగాలపల్లె జమాల్‌కు భార్య, ముగ్గురు కుమారులు సంతానం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కుటుంబ పోషణ కోసం చిన్నాచితకా పనులు చేస్తూ నెట్టుకొచ్చాడు. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేశాడు.
‘నీకేం.. అంతా మగపిల్లలే. చేతికొచ్చాక ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారులే’ అని ఇరుగుపొరుగు వారు అంటుంటే మురిసిపోయాడు. కుమారులు ఎదిగి వస్తుండటం.. ఈయన వయస్సు మీద పడుతుండటంతో పెళ్లిళ్లు చేయాలని భావించాడు. ఇద్దరు కుమారులు స్థానికంగానే ఆటోలు నడుపుతుండగా.. మరో కుమారుడు నంద్యాలలో వ్యాపారం చేసుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం అందరికీ వివాహాలు చేశాక.. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆస్తి పంపకాలు చేపట్టాడు. ముగ్గురికి మూడు భాగాలు.. తనకు, భార్యకు మరో భాగం చొప్పున పంచేశాడు. కుమారులకు భారం కాకూడదనే ఉద్దేశంతో భార్యభర్తలిద్దరూ వేరుగానే ఉంటూ.. కూలి పనులతో పొట్ట పోసుకోసాగారు. మూడేళ్ల క్రితం భార్య క్యాన్సర్ బారిన పడటంతో కుమిలిపోయాడు. ఉన్నంతలో ఆమెను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా అరకొర ఆస్తి కూడా హారతి కర్పూరమైంది. ఇంత చేసినా ఆమెను కాపాడుకోలేకపోయాడు. రెండేళ్ల క్రితం ఆ ‘తోడు’ దూరమైంది. అప్పటికీ కుమారుల మనసు కరగలేదు. ఎలాంటి ఆసరా లేని తండ్రిని చేరదీయాలని ఎవరికీ అనిపించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ ముసలి తండ్రి రోడ్డునపడ్డాడు. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్లు హోటళ్లలో పని చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఐదారు నెలల క్రితం నుంచి అనారోగ్యం బారిన పడ్డాడు. అయినప్పటికీ శ్రమించాడు. వారం రోజుల క్రితం నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
తెలిసిన వాళ్లు విషయాన్ని కుమారుల దృష్టికి తీసుకెళ్లగా.. పంపకాలతోనే ఆ బంధం తెగిపోయిందన్నట్లు చెప్పడంతో వారూ ఏమీ చేయలేకపోయారు. తిండి లేక పూర్తిగా నీరసించిన జమాల్ బస్టాండ్‌లో అచేతనంగా పడిపోయాడు. స్థానికులు ఆహారం తినిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతోంది. కేవలం నీళ్లు తాగుతూ.. తన దైన్యాన్ని తల్చుకొని కన్నీటిపర్యంతమవుతున్నాడు. చిన్నప్పుడు నీకేం అందరూ కుమారులే కదా అని.. స్థానికులు అంటుంటే పడ్డ సంతోషమంతా ఇప్పుడు కన్నీళ్ల రూపంలో కరిగిపోతోంది. అసలే చలి కాలం కావడం.. పైగా అనారోగ్యం కారణంగా కొన ఊపిరితో ఉన్న ఆయనను చూసి అటువైపుగా వెళ్లే ప్రజలు.. బాగా తెలిసిన వారు చలించిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ అటువైపుగా రాకపోకలు సాగించే కుమారులు మాత్రం ఆయనను చేరదీయకపోవడం గమనార్హం.
బస్టాండ్‌లో ఓ తండ్రి చివరి ఘడియలు
Published Sun, Dec 1 2013 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement