బాధిత ఉద్యోగుల శాపనార్థాలు
ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన
కళాశాల వద్ద ధర్నా, ప్రిన్సిపాల్ చాంబర్‌లో బైఠాయింపు
శ్రీకాళహస్తి: ‘పదేళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నాం. రూ. 2వేల జీతం నుంచి 6 వేల జీతానికి మాత్రమే చేరుకున్నాం. మా 49 మంది జీతాలు కలిపితే ఒక్క అధ్యాపకుడి జీతంతో సమానం. అదికూడా లేకుండా చేసి మా కడుపు కొట్టడం భావ్యం కాదు. ఉన్న ఫలంగా తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి. మీలాగే మాకూ కుటుంబాలు, భార్య, బిడ్డలున్నారు.. వారిని పోషించలేక చంపుకోమంటారా? లేక మేమే ఆత్మహత్య చేసుకోవాలంటారా?’ చెప్పండి అంటూ బాధిత ఉద్యోగులు ప్రిన్సిపల్ జయుచంద్రయ్యను నిలదీశారు. మంగళవారం ఓ పత్రికలో స్కిట్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను టెండర్ ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించనున్నట్లు ఓ ప్రకటన ప్రచురించారు.
దాంతో స్కిట్ కాంట్రాక్ట్ ఉద్యోగు లు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇందుకు స్పందించిన ప్రిన్సిపాల్ జయచంద్రయ్య.. కళాశాల కరెస్పాండెంట్, ఆలయ ఈఓ సూచనల మేరకే పత్రికలో ప్రకటన వెలువడిందన్నారు. ఎవరినీ తొలగించడం లేదని, ఓ ఏజెన్సీ ద్వారా తీసుకుంటారని వివరించారు. కరెస్పాండెంట్, ఈవో భ్రమరాంబతో మళ్లీ చర్చించి న్యాయుం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఆయన సూచన మేరకు ఆలయ చైర్మన్ గురవయ్యనాయుుడు, ఈవోను కలిసి బాధిత ఉద్యోగులు ఆవేదనను తెలియజేశారు.