అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నారు. వారి ఆట కట్టించడంలో విఫలమైన పోలీసులు... బాధితులపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
ఎవరైనా తమ ఇంట్లో చోరీ జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళితే సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు. విలువైన వస్తువులు,డబ్బు దాచుకునే పద్ధతి ఇదా? నిజంగా అంత సొత్తు చోరీ అయ్యిందా? అంటూ బాధితులనే దొంగల్లా చూస్తున్నారు. దీనివల్ల అనేకమంది స్టేషన్ మెట్లెక్కడానికి భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల గస్తీ తగ్గడం దొంగలకు అవకాశంగా మారింది. ఇదే అదునుగా బరి తెగించి ఇళ్లను కొల్లగొడుతున్నారు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన చోరీల్లో దాదాపు 40 తులాల బంగారం, 28 కిలోల వెండి వస్తువులు, రూ.2 లక్షల నగదు కొల్లగొట్టారు.
నాలుగు రోజుల క్రితం అనంతపురం నగరంలోని ఆంజనేయనగర్‌లో అసిస్టెంట్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ సుందర్ ఇంట్లో 25 కిలోల వెండి, ఐదు తులాల బంగారు, రూ.లక్ష నగదు చోరీ చేశారు. త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెండో రోడ్డులో ఆర్ట్స్ కళాశాల ఉద్యోగి ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. గౌరవ్ గార్డెన్స్‌లో నివాసముంటున్న మున్నీ ఇంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రూ.52 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు నగలు, విలువైన చీరలు అపహరించుకుపోయారు.
అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అనురాధ అనే మహిళ నుంచి పట్టపగలే ఓ దొంగ హ్యాండ్ బ్యాగు లాక్కొని వెళుతుండగా.. ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
మే 4న నగరంలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో ఏకంగా లాకరును తెరిచి చోరీకి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో చివరి క్షణంలో అక్కడి నుంచి ఉడాయించారు. కళ్యాణదుర్గం రోడ్డులోని ఎస్‌బీహెచ్‌లో కూడా లాకరును తెరిచేందుకు విఫలయత్నం చేశారు.
డబ్బు జమ చేసేందుకు అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఎస్‌బీఐ- ఏడీబీ బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళను దొంగలు ఏమార్చి రూ.పది వేలు అపహరించారు. ఈ బ్యాంకు వద్ద దొంగలు తరచూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నా పోలీసులు ఒక్కరినీ పట్టుకున్న పాపానపోలేదు.
రాప్తాడు మండలం మరూరులో పసుపుల చిన్న నరసింహులు ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. రూ.పది లక్షలు విలువైన బాండ్లు, రూ.1.17 లక్షల నగదు అపహరించుకెళ్లారు. తాజాగా గురువారం తెల్లవారుజామున రాప్తాడులోని మూడిళ్లలో చోరీ జరిగింది. దారి శ్రీనివాసులు ఇంట్లో రెండు తులాల బంగారు నగలు, గవ్వల పరంధామ ఇంట్లో నాలుగు తులాల బంగారం, వికలాంగుడైన జానకిరామయ్య ఇంట్లో రూ.10 వేల నగదు దోచుకెళ్లారు.
మే 27న ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ శివారులో సావిత్రి అనే మహిళ కళ్లలో కారం చల్లి బంగారు గాజులతో పాటు గొలుసు, ఉంగరాన్ని లాక్కెళ్లారు. పది తులాలకు పైగా బంగారం అపహరించుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
మే 29న ధర్మవరంలోని చంబ్రాబాబు నగర్‌లో ఒకే రోజున నాలుగు ఇళ్లలో దొంగలు పడ్డారు. 10 తులాల బంగారంతో పాటు వెండి, కొంత నగదు చోరీ చేశారు.
చోరీలను నివారిస్తాం
ఇన్నాళ్లూ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున చోరీల నివారణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయాం. ఇక మీదట నిఘా కట్టుదిట్టం చేస్తాం. దొంగల ఆట కట్టిస్తాం.
- నాగరాజ, అనంతపురం డీఎస్పీ
గస్తీ..సుస్తీ!
Published Mon, Jun 9 2014 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement