పది జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సకలజనులభేరీకి జిల్లా నుంచి తెలంగాణవాదులు అధికసంఖ్యలో తరలివెళ్లారు. ఉదయం నుంచే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు రాజధాని బాటపట్టాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులన్నీ జెతైలంగాణ.. హైదరాబాద్ హమారా.. నినాదాలతో హోరెత్తాయి.
- సాక్షి, కరీంనగర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ప్రక్రియలో జాప్యానికి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జేఏసీ హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన సకలజనులభేరీని విజయవంతం చేసేందుకు జిల్లానుంచి సబ్బండవర్గాలు తరలివెళ్లాయి. అన్ని నియోజకవర్గాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా కదిలారు.
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కూడా తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు టీఎన్జీవోల భవనం నుంచి బయలుదేరారు. జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధు లు వీలైన మార్గాల్లో వెళ్లారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ నేతలు పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పార్టీ ముఖ్యనేతలు ముందుగానే హైదరాబాద్‌కు చేరుకోగా పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు పార్టీ కార్యకర్తలతో పాటు బయలుదేరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, వినోద్‌కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఈద శంకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు బొడిగె శోభ, ఓరుగంటి ఆనంద్, ఒడితెల సతీష్‌బాబు, మనోహర్‌రెడ్డి, జితేందర్‌రావు, రాంరెడ్డి, ఇతర నాయకులు, అనుబంధసంఘాల నేతలు ఈ సభలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతోపాటు కదిలారు. సింగరేణి నుంచి కార్మికులు గనుల్లోకి వెళ్లే సమయంలో ధరించే టోపీ,తట్ట, చెమ్మస్‌లను ధరించి సభలో పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య నాయకత్వంలో కార్మికులు తరలివెళ్లారు. గోదావరిఖని నుంచి వెళ్లిన కర్రసాము విన్యాసాలు చేసే ‘అకాడా’ బృందం సకలజనులభేరీలో ప్రదర్శన ఇచ్చింది. న్యూడెమాక్రసీ కార్యదర్శి చలపతిరావు, నేతలు రాజన్న, జ్యోతి, తాల్లపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో బీజేపీ నేతలు తరలివెళ్లారు. మధ్యాహ్నం వరకే సభ నిర్వహించే నిజాం కళాశాల మైదానం నిండిపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లినవారు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సభలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఒక్కరికే మాట్లాడే అవకాశం లభించింది. సకలజనభేరి సభ విజయవంతం కావడంతో అందరూ ఉత్సాహంతో తిరుగుపయనమయ్యారు.