
జనవరిలో అరకు ఉత్సవ్
అరకు, విశాఖ ఉత్సవ్‌ను జనవరిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు.
అప్పుడే విశాఖ ఉత్సవాలు కూడా ఏర్పాట్లు చేయాలని
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సిరిపురం: అరకు, విశాఖ ఉత్సవ్‌ను జనవరిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అధికారులు, హోటల్ యజమానులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. హుద్‌హుద్ తుపాను వల్ల నష్టపోయిన విశాఖకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు పునరుజ్జీవం కల్పించాలనే లక్ష్యంతో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు నగరం, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సలహాలు, సూచనలిచ్చికార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. విశాఖ ఉత్సవ్ నిర్వహణ పై త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి తేదీలను వెల్లడిస్తామన్నారు.
ఇందులో భాగంగానే అరకు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణకు నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ రంగాల సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్‌ను ఆదేశించారు. గతంలో విశాఖ ఉత్సవ్ నిర్వహించిన విధానం, ఏర్పాటు చేసిన కమిటీలపై డీఆర్‌డీఏ పీడీ ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.
వివిధ రకాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ డి.వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, పర్యాటక శాఖాధికారి డాక్టర్ ఎ.సిరి తదితరులు పాల్గొన్నారు.