శ్రీశైలం, న్యూస్‌లైన్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం మాఘశుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు ఆలయ రాజగోపురం వద్ద పల్లకీలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేకపూజలను నిర్వహిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఆర్టీసీ బస్టాండ్ ముందుభాగం, ట్రైబల్ మ్యూజియం వెనుక భాగం నుంచి దేవస్థానం టోల్ గేట్, యజ్ఞవాటిక, శ్రీగిరి కాలనీ వెనుకభాగం, గోశాల, హేమారెడ్డి మల్లమ్మ మందిరం మీదుగా గంగాభవాని స్నానఘట్టాల మీదుగా సాగుతుందన్నారు.
ఈ ప్రదక్షిణలో భాగంగా పంచమఠాలు, వీరభద్ర మఠం, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్పకొలను ఎగువభాగం తదితర చోట్ల స్వామి అమ్మవార్లకు నీరాజనాలను అర్పిస్తున్నట్లు తెలిపారు.
వివిధ జన్మల్లో చేసిన పాపాలన్నీ ప్రదక్షిణలో ఒక్కొక్క అడుగుతో తొలగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయన్నారు. భగవంతునికి అర్పించే కైంకర్యాలలో ప్రదక్షిణ పరిపూర్ణమైనదన్నారు. ఆలయాలలోనే కాకుండా పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఆయా పర్వతాల చుట్టూ, గిరుల చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయం కూడా ఉందన్నారు. భక్తులలో భక్తిభావాలను పెంపొందిండంతో పాటు క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికత కేంద్రంగా తీర్చిదిద్దేందకు, ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు.
శ్రీశైలంలో నేడు గిరిప్రదక్షిణ
Published Fri, Feb 14 2014 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement