
టీడీపీ పాలనలో పెరిగిన హత్యా రాజకీయాలు : మాజీ మంత్రి తమ్మినేని
శ్రీకాకుళం అర్బన్: హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని, టీడీపీని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు హత్యకు గురయ్యూరన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిటాల రవి హత్యకేసు ముగిసిపోయినా ఇంకా జగన్ దోషి అంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం శోచనీయమన్నారు. పరిటాల సునీత ప్రభుత్వంలోనే ఉన్నారని, అప్పట్లో జేసీ సోదరులపై ఆమె చేసిన విమర్శలు ఇపుడు ఏమయ్యాయన్నారు. జేసీ సోదరులకు రవి హత్యతో సంబంధం లేదని ఆమె చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రస్తుత క్యాబినెట్‌లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉన్న టీడీపీ నేతల్లో అత్యధికులు నేరచరిత్ర కలిగిన వారేనన్నారు. దీనిపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే పనిచేస్తోందా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రాజకీయ నరమేధానికి ముగింపు పలకాలని, లేదంటే జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఔరంగజేబును తలపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంత వరకూ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.