Paritala Ravi Murder Case
-
మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి
చిత్తూరు అర్బన్/ములకలచెరువు/దొండపర్తి (విశాఖ దక్షిణ): టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్.. శనివారం రాత్రి అనారోగ్య సమస్య రావడంతో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్య, జైలు అధికారులు ప్రకటించారు. ► ఓంప్రకాశ్ మదనపల్లెకు చెందిన వ్యక్తి. 2001లో ఓ లారీని చోరీ చేసి అడ్డొచ్చిన డ్రైవర్‌ను హత్య చేశాడు. ► ఈ కేసులో పుంగనూరు పోలీసులు ఓంప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది. ► అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాశ్ 2008 నవంబర్ 9న పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీనును జైల్లోనే డంబెల్‌తో కొట్టి హత్యచేసి వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
పరిటాల హత్య కేసులో సంచలన విషయాలు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి కందిగోపుల మురళి సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉంది. హత్యకు ఉపయోగించిన తుపాకులు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సరఫరా చేశారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో లభ్యమైన రివాల్వర్ కూడా జేసీ ఇచ్చిందే. నేను జేసీ వద్ద చాలాకాలం పనిచేశా. పరిటాల రవి హత్యలో జేసీ పాత్రపై విచారించాలని గతంలో మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి కొండన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు జేసీకి లేదు. జిల్లాలో ఆయన చేస్తున్న క్రిమినల్ రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్
* నేను వాళ్లను బఫూన్లు అంటే తప్పయిందా! * టీడీపీ నేతలు వారి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే * ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ * పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారినే పార్టీలో చేర్చుకున్నారు * వాస్తవాలు బయటపడతాయనే హత్యలపై విచారణకు ఒప్పుకోవ డం లేదు సాక్షి, హైదరాబాద్: ‘నన్ను హంతకుడని, నా తండ్రిని నరరూప రాక్షసుడని, మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లని అంటే ఒప్పయిందా? నన్ను నానా మాటలన్న వారిని ఉద్దేశించి బఫూన్లని నేనన్న ఒక్క మాట తప్పయిందా? వాళ్లు (టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు) మమ్మల్ని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయి దాపడిన తరువాత జగన్ తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తాను అందరు ఎమ్మెల్యేలను బఫూన్లని అనలేదని, మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు నిందించిన వారిని మాత్రమే అన్నానని చెప్పారు. ‘అసలు బఫూన్ అంటే అర్థం ఏమిటి? సర్కస్‌లో జోకర్ అని. అదికూడా సభలో అందరినీ ఉద్దేశించి నేను అనలేదు, ఎవరైతే నానా మాటలూ అన్నారో వాళ్లనే అన్నాను’ అని స్పష్టం చేశారు. ‘టీడీపీ వాళ్లు మమ్మల్ని పదే పదే నానా మాటలంటే అది ఆమోదయోగ్యమేనా? మమ్మల్ని ఏటీఎం దొంగలు, స్మగ్లర్లు, దొంగలని అనొచ్చు, అది మీకు న్యాయంగానే అనిపిస్తుంది. కానీ నేనన్న ఒకే ఒక్కమాట మాత్రం అన్యాయంగా అనిపిస్తోంది’ అని జగన్ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మమ్మల్ని అన్న అవే మాటలను మా ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంటే చూస్తూ ఊరుకునేవారా?’ అని ప్రశ్నించారు. ‘పదే పదే పరిటాల రవి హత్యను నాకు ఆపాదిస్తున్నారు. రవి హత్య జరిగి పదేళ్లయింది. న్యాయస్థానాల్లో విచారణ జరిగింది, దోషులను నిర్ధారించారు, వారికి శిక్ష కూడా పడింది. అయినా నాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు ఇది అబద్ధమని. రవి హత్య కేసులో ఆరోపణలెదుర్కొన్న జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్రెడ్డిలను టీడీపీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఇంకా మాట్లాడ్డం ఏమిటి!’ అని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ దమ్మూ, ధైర్యం ప్రభుత్వానికి లేవు ‘గత మూడు నెలలుగా జరుగుతున్న హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కానీ వారికి ఆ దమ్మూ ధైర్యం లేవు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. హత్యకు గురైన వారందరూ వైఎస్సార్సీపీ వారే. హత్య చేసిన వారూ, చేయించిన వారందరూ టీడీపీ వారే. విచారణలో ఈ వాస్తవాలు బయటపడతాయనే వారీ పనికి పూనుకోరు..’ అని జగన్ తెలిపారు. హత్యకు గురైనవారి కుటుంబాలకు ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నట్లు తెలి పారు. గత మూడు నెలలుగా జరిగిన హత్యలపై సభలో చర్చ జరిగి వారి కుటుంబాలకు ఏదైనా మేలు జరుగుతుందని మేం ఆశిస్తుంటే, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేం దుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించా రు. ‘శాసనసభలో శాంతిభద్రతలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చను కనుక టీవీల్లో హత్యకు గురైనవారి కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు. గతం తవ్వితే మేం వంగవీటి రంగా అంటాం, మీరు పరిటాల రవి అంటారని పలుసార్లు అధికార పక్షానికి మనవి చేశాం. అరుునా వినలేదు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు సంయమనం కోల్పోయి తమను బఫూన్లు అన్నారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన దృష్టికి తేగా.. ‘వాళ్లు మమ్మల్ని హంతకులని, దొంగలనీ పూర్తి సంయమనంతోనే అన్నారంటనా’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మిమ్మ ల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలకు మీరు ట్రాప్‌లో పడినట్టుగా భావించాలా? అని ప్రశ్నించగా.. ‘వాళ్లే మా ట్రాప్‌లో పడ్డారని అనుకోవచ్చు కదా..’ అని జవాబిచ్చారు. హత్యలపై కచ్చితమైన సమాచారాన్ని సభ ముందుంచాం హత్యలకు సంబంధించిన సంఖ్యను పలుమార్లు మారుస్తున్నారనే విమర్శలకు సమాధానం ఇస్తూ.. తమకు తొలుత వచ్చిన సమాచారం ప్రకారం ఒక సంఖ్యను చెప్పామని, కానీ అసెంబ్లీ ముందుకు వచ్చేటప్పుడు సమగ్రమైన, కచ్చితమైన సమాచారంతో ముందుకు వచ్చామని, ఇందులో తప్పేమీ లేదని జగన్ తెలిపారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని చెప్పారు. వాస్తవంగా ఎన్ని హత్యలు జరిగాయో సాక్షి దినపత్రికలో స్పష్టంగా వచ్చాయని అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా ఆదేశాలిప్పించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని, గ్రామాల్లో జరిగే చిన్న ఘర్షణలను హత్యలు జరిగేదాకా ప్రోత్సహించడం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారు. -
టీడీపీ పాలనలో పెరిగిన హత్యా రాజకీయాలు : మాజీ మంత్రి తమ్మినేని
శ్రీకాకుళం అర్బన్: హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని, టీడీపీని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు హత్యకు గురయ్యూరన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్యకేసు ముగిసిపోయినా ఇంకా జగన్ దోషి అంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం శోచనీయమన్నారు. పరిటాల సునీత ప్రభుత్వంలోనే ఉన్నారని, అప్పట్లో జేసీ సోదరులపై ఆమె చేసిన విమర్శలు ఇపుడు ఏమయ్యాయన్నారు. జేసీ సోదరులకు రవి హత్యతో సంబంధం లేదని ఆమె చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రస్తుత క్యాబినెట్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉన్న టీడీపీ నేతల్లో అత్యధికులు నేరచరిత్ర కలిగిన వారేనన్నారు. దీనిపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ నరమేధానికి ముగింపు పలకాలని, లేదంటే జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఔరంగజేబును తలపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంత వరకూ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
హత్యలన్నీ టీడీపీవే అంటే ఎలా?
వైఎస్సార్ కాంగ్రెస్‌పై టీడీపీ నేతల ధ్వజం శాంతిభద్రతలపై అసెంబ్లీలో ప్రతిపక్షం చర్చకోరడం అర్థరహితం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్యలు చేయిస్తోందని ప్రతిపక్షం ఆరోపించడంలో అర్థం లేదని.. సాధారణ హత్య కేసులను టీడీపీ ఖాతాలో వేసి సానుభూతి పొందేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కార్మికమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం శాసనసభ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలున్నాయని.. ప్రధాన ప్రతిపక్షం గా వాటిపై చ ర్చించడం మాని, శాంతిభద్రతల పై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం కోరడం అర్థరహితమని విమర్శించా రు. పదమూడు జిల్లాల్లో టీడీపీ ఎవరిని చంపిం చిందో, ఎక్కడ చనిపోయారో వారి పేర్లు ఇవ్వాలని పేర్కొన్నారు. పరిటాల రవి కేసులో ప్రధాన ముద్దాయిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయనను తప్పించారని ఆరోపించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక 226 మందిని రాజకీయంగా చంపిస్తే అందులో తమ పార్టీ వారు 120 మంది ఉన్నారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విభజన తరువాత కీలకంగా జరిగే బడ్జెట్ సమావేశాలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని.. ఇలాంటి స్థితిలో సమస్యలపై పోరుబాట పట్టకుండా.. ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ ఆజ్యం పోసి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. అందర్నీ సమంగా చూస్తుంటే శాంతిభద్రతలు అడుగంటాయని ప్రతిపక్షం బురద చల్లుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక గొడవల్లో మరణించిన వారివి హత్యలయిపోతాయా? అని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రశ్నించారు. -
కోర్టునే ధిక్కరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్రెడ్డి నిర్దోషి అని కోర్టు తేల్చిన తర్వాత కూడా టీడీపీ నేతలు, మంత్రులు ఆయనపై పదేపదే ఆరోపణలు చేస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పుడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు కొడాలి నాని తప్పుపట్టారు. గత పదేళ్ల చరిత్రను కథల రూపంలో ఒకటికి పదిసార్లు వినిపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చనిపోయినప్పుడు ఆయన కుమారులు ఆ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసి సీబీఐ దర్యాప్తు జరగాలని అడిగితే చంద్రబాబునాయుడు ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను మనస్తాపానికి గురిచేసి మరణానికి కారణమయ్యారని ఆరోపణలున్న చంద్రబాబు.. కోర్టు నిర్దోషి అని తేల్చిన జగన్‌పై ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నరరూప రాక్షసులెవరో అందరికీ తెలుసన్నారు. ‘‘జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డిలు ఒకప్పుడు చంద్రబాబు దృష్టిలో ముద్దాయిలు.. వారు దోషులు కాదని తేలిన తర్వాతే టీడీపీలో చేర్పించుకున్నారా? టీడీపీలో చేరడంతో చంద్రబాబుకు వారిద్దరు ఇంద్రులు, చంద్రులు అయిపోయారా?’’ అని కొడాలి ఎద్దేవా చేశారు. రెండు నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు యంత్రాంగంతో ప్రభుత్వమే హత్యలు చేయిస్తోందని.. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే వాయిదా తీర్మానం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పార్టీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో మనో ధైర్యం కల్పించడం కోసం జగన్ వాయిదా తీర్మానం ఇచ్చారని చెప్పారు. -
పరిటాలది ప్రభుత్వ హత్య: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి పరిటాల రవీంద్రది ప్రభుత్వ హత్య అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోలీసులను ఉపయోగించి పరిటాలను హత్య చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. పరిటాల తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పరిటాల రవిని చంపిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కోడెల శివప్రసాదరావు, పంచుమర్తి అనూరాధ, టీడీ జనార్ధన్‌రావు, డాక్టర్ సీఎల్ వెంకట్రావు, పిన్నమనేని సాయిబాబా పాల్గొన్నారు. -
పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
-
పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
హైదరాబాద్: టీడీపీ నేతలు కన్నుమూసినా, తెరిచినా వారికి వైఎస్సార్ కాంగ్రెస్సే కనిపిస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఏనాడూ వ్యవహరించలేదని విమర్శించారు. ఏ అవకాశం దొరికినా వైఎస్సార్సీపీపై బురదజల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్య విషయంలో చంద్రబాబు చేస్తున్నవి సిగ్గులేని ఆరోపణలని కొట్టిపారేశారు. చాలామంది నేతలు పరిటాల రవికి దగ్గరవుతున్న బాధతో చంద్రబాబే హత్యచేయించారని అనుమానాలున్నాయని అన్నారు. పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పరిటాల రవిని చంద్రబాబే హత్యచేయించారనే ఆరోపణలున్నాయన్నారు. చంద్రబాబు అన్నీ ఇలాంటి రాజకీయాలే చేస్తారన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడానికి కూడా అలాంటి రాజకీయాలే చేశారన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డిల మరణాలపై సీబీఐ దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమా అని శ్రీకాంత్‌రెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని అన్నారు.