మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్‌ | Ys Jagan mohan reddy slams TDP leaders | Sakshi
Sakshi News home page

మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్‌

Published Sat, Aug 23 2014 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్‌ - Sakshi

మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్‌

* నేను వాళ్లను బఫూన్లు అంటే తప్పయిందా!  
* టీడీపీ నేతలు వారి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే
* ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
* పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారినే పార్టీలో చేర్చుకున్నారు
* వాస్తవాలు బయటపడతాయనే హత్యలపై విచారణకు ఒప్పుకోవ డం లేదు

 
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను హంతకుడని, నా తండ్రిని నరరూప రాక్షసుడని, మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లని అంటే ఒప్పయిందా? నన్ను నానా మాటలన్న వారిని ఉద్దేశించి బఫూన్లని నేనన్న ఒక్క మాట తప్పయిందా? వాళ్లు (టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు) మమ్మల్ని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయి దాపడిన తరువాత జగన్ తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తాను అందరు ఎమ్మెల్యేలను బఫూన్‌లని అనలేదని, మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు నిందించిన వారిని మాత్రమే అన్నానని చెప్పారు. ‘అసలు బఫూన్ అంటే అర్థం ఏమిటి? సర్కస్‌లో జోకర్ అని. అదికూడా సభలో అందరినీ ఉద్దేశించి నేను అనలేదు, ఎవరైతే నానా మాటలూ అన్నారో వాళ్లనే అన్నాను’ అని స్పష్టం చేశారు.
 
  ‘టీడీపీ వాళ్లు మమ్మల్ని పదే పదే నానా మాటలంటే అది ఆమోదయోగ్యమేనా? మమ్మల్ని ఏటీఎం దొంగలు, స్మగ్లర్లు, దొంగలని అనొచ్చు, అది మీకు న్యాయంగానే అనిపిస్తుంది. కానీ నేనన్న ఒకే ఒక్కమాట మాత్రం అన్యాయంగా అనిపిస్తోంది’ అని జగన్ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మమ్మల్ని అన్న అవే మాటలను మా ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంటే చూస్తూ ఊరుకునేవారా?’ అని ప్రశ్నించారు. ‘పదే పదే పరిటాల రవి హత్యను నాకు ఆపాదిస్తున్నారు. రవి హత్య జరిగి పదేళ్లయింది. న్యాయస్థానాల్లో విచారణ జరిగింది, దోషులను నిర్ధారించారు, వారికి శిక్ష కూడా పడింది. అయినా నాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు ఇది అబద్ధమని. రవి హత్య కేసులో ఆరోపణలెదుర్కొన్న జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డిలను టీడీపీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఇంకా మాట్లాడ్డం ఏమిటి!’ అని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 ఆ దమ్మూ, ధైర్యం ప్రభుత్వానికి లేవు
 ‘గత మూడు నెలలుగా జరుగుతున్న హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కానీ వారికి ఆ దమ్మూ ధైర్యం లేవు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. హత్యకు గురైన వారందరూ వైఎస్సార్‌సీపీ వారే. హత్య చేసిన వారూ, చేయించిన వారందరూ టీడీపీ వారే. విచారణలో ఈ వాస్తవాలు బయటపడతాయనే వారీ పనికి పూనుకోరు..’ అని జగన్ తెలిపారు. హత్యకు గురైనవారి కుటుంబాలకు ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నట్లు తెలి పారు. గత మూడు నెలలుగా జరిగిన హత్యలపై సభలో చర్చ జరిగి వారి కుటుంబాలకు ఏదైనా మేలు జరుగుతుందని మేం ఆశిస్తుంటే, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేం దుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించా రు. ‘శాసనసభలో శాంతిభద్రతలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చను కనుక టీవీల్లో హత్యకు గురైనవారి కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు.
 
 గతం తవ్వితే మేం వంగవీటి రంగా అంటాం, మీరు పరిటాల రవి అంటారని పలుసార్లు అధికార పక్షానికి మనవి చేశాం. అరుునా వినలేదు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు సంయమనం కోల్పోయి తమను బఫూన్లు అన్నారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన దృష్టికి తేగా.. ‘వాళ్లు మమ్మల్ని హంతకులని, దొంగలనీ పూర్తి సంయమనంతోనే అన్నారంటనా’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మిమ్మ ల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలకు మీరు ట్రాప్‌లో పడినట్టుగా భావించాలా? అని ప్రశ్నించగా.. ‘వాళ్లే మా ట్రాప్‌లో పడ్డారని అనుకోవచ్చు కదా..’ అని జవాబిచ్చారు.
 
 హత్యలపై కచ్చితమైన సమాచారాన్ని సభ ముందుంచాం
 హత్యలకు సంబంధించిన సంఖ్యను పలుమార్లు మారుస్తున్నారనే విమర్శలకు సమాధానం ఇస్తూ.. తమకు తొలుత వచ్చిన సమాచారం ప్రకారం ఒక సంఖ్యను చెప్పామని, కానీ అసెంబ్లీ ముందుకు వచ్చేటప్పుడు సమగ్రమైన, కచ్చితమైన సమాచారంతో ముందుకు వచ్చామని, ఇందులో తప్పేమీ లేదని జగన్ తెలిపారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని చెప్పారు. వాస్తవంగా ఎన్ని హత్యలు జరిగాయో సాక్షి దినపత్రికలో స్పష్టంగా వచ్చాయని అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా ఆదేశాలిప్పించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని, గ్రామాల్లో జరిగే చిన్న ఘర్షణలను హత్యలు జరిగేదాకా ప్రోత్సహించడం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement