
కోర్టునే ధిక్కరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని కోర్టు తేల్చిన తర్వాత కూడా టీడీపీ నేతలు, మంత్రులు ఆయనపై పదేపదే ఆరోపణలు చేస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పుడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు కొడాలి నాని తప్పుపట్టారు. గత పదేళ్ల చరిత్రను కథల రూపంలో ఒకటికి పదిసార్లు వినిపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చనిపోయినప్పుడు ఆయన కుమారులు ఆ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసి సీబీఐ దర్యాప్తు జరగాలని అడిగితే చంద్రబాబునాయుడు ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ను మనస్తాపానికి గురిచేసి మరణానికి కారణమయ్యారని ఆరోపణలున్న చంద్రబాబు.. కోర్టు నిర్దోషి అని తేల్చిన జగన్‌పై ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నరరూప రాక్షసులెవరో అందరికీ తెలుసన్నారు. ‘‘జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డిలు ఒకప్పుడు చంద్రబాబు దృష్టిలో ముద్దాయిలు.. వారు దోషులు కాదని తేలిన తర్వాతే టీడీపీలో చేర్పించుకున్నారా? టీడీపీలో చేరడంతో చంద్రబాబుకు వారిద్దరు ఇంద్రులు, చంద్రులు అయిపోయారా?’’ అని కొడాలి ఎద్దేవా చేశారు.
రెండు నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు యంత్రాంగంతో ప్రభుత్వమే హత్యలు చేయిస్తోందని.. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే వాయిదా తీర్మానం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పార్టీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో మనో ధైర్యం కల్పించడం కోసం జగన్ వాయిదా తీర్మానం ఇచ్చారని చెప్పారు.