దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర | TDP attacks on YSRCP workers | Sakshi
Sakshi News home page

దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర

Published Sun, Jun 9 2024 4:52 AM | Last Updated on Sun, Jun 9 2024 7:24 AM

TDP attacks on YSRCP workers

మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మండిపాటు 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు

ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారడం దారుణం 

ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్‌ కేసులు వేస్తాం 

ఎస్పీకి విన్నవించేందుకు వస్తున్న నేతల నిర్బంధం విచారకరం 

చంద్రబాబు, లోకేశ్‌లే దాడులను ప్రోత్సహిస్తున్నారు 

రౌడీలే సీఐలు, ఎస్‌ఐల అవతారం ఎత్తారు.. బాధితులు అందరికీ అండగా ఉంటాం 

దాడులు ఆపకపోతే మేమూ రోడ్లపైకి వస్తాం 

శాంతి భద్రతల సమస్య ఎదురైతే పోలీసులదే బాధ్యత

మచిలీపట్నం టౌన్‌: కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

పేర్ని నాని మాట్లా­డుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నార­న్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడు­లపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. 

ఆ ఆదేశాలను పోలీసులు తూ­చా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థి­తిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీ­షీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడు­తున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో­లతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. 

కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు
‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధి­తు­లను వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. 

స్థానిక చిలకలపూడి గోడౌన్స్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్‌సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసు­పత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌­సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్‌ నవీన్‌.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. 

ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్‌ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్‌ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్‌ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరు­గుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారక­రం. 

మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్‌­కుమార్‌లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.

మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిర్వీ­ర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయ­కులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నార­­న్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్‌ చేస్తుండటం దారుణం.

స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తు­న్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడు­లను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకు­లందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. 

ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య­కర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఎదురైతే దానికి పోలీస్‌ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌­బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్‌ (రాము) పాల్గొన్నారు.

పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులు
టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్‌ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.

అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు.  పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా  ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement