కడప రూరల్, న్యూస్‌లైన్: బీమా ప్రీమియం చెల్లించే విషయంలో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ సేవ, వ్యవసాయ అధికారుల నిర్వాకాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.రబీ సీజన్‌లో జిల్లాలో బుడ్డశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, అరటి, జొన్న పంటలను రైతులు సాగుచేశారు. ఆయా పంటలకు బీమా ప్రీమియం చెల్లించుకోవడానికి జాతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఎన్‌ఎఐసీ) ప్రకటన జారీ చేసింది. అయితే గడువు దాటింది. దీంతో చాలామంది రైతులు బీమా ప్రీమియంచెల్లించలేకపోయారు.
ఈ తరుణంలో గడిచిన 31వ తేదీ ఆఖరు కావడంతో పెండ్లిమర్రి, కమలాపురం, వీరపునాయునిపల్లె, వేంపల్లె, పులివెందుల తదితర ప్రాంతాలకు చెందిన రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి మంగళవారం కడప కలెక్టరేట్ ప్రక్కనున్న మీసేవ కేంద్రానికి వచ్చారు. అక్కడ సాంకేతిక కారణాల వలన మీసేవ సిబ్బంది బీమా ప్రీమియంను స్వీకరించలేకపోయారు. దీంతో రైతులు ఆందోళన చెందారు. అయితే వ్యవసాయ శాఖ, మీసేవ సిబ్బంది రైతులకు టోకన్లు ఇచ్చి మరుసటి రోజు బీమా ప్రీమియంను స్వీకరిస్తామని తెలిపారు. ఆ మేరకు రైతులు వారి వారి ఊర్లకు వెళ్లి మరుసటి రోజు బుధవారం మీసేవ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ మీసేవను మూసి ఉంచడం చూసి ఆగ్రహించారు.
రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన అన్నదాతలు శ్రీరంజన్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, గంగాధర్, మాధవరెడ్డి మాట్లాడుతూ గతనెల 24వ తేదీన ప్రకటన జారీచేసి 31వ తేదీకి ప్రీమియం గడువు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం వ్యవసాయ శాఖ జేడీ జయచంద్ర రావడంతో ఆయనతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో పై అధికారులతో మాట్లాడి గురువారం మీసేవలో చెల్లింపులకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు.
అన్నదాతలంటే అంత అలుసా..?
Published Thu, Jan 2 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement