కూతురిని కడతేర్చిన తండ్రి అరెస్ట్ | In the case of the murders of his father's daughter | Sakshi
Sakshi News home page

కూతురిని కడతేర్చిన తండ్రి అరెస్ట్

Published Sat, Aug 17 2013 3:26 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

In the case of the murders of his father's daughter

మహబూబాబాద్, న్యూస్‌లైన్ :  కూతురిని హతమార్చిన కేసులో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసముద్రంలో బుధవారం అర్ధరాత్రి తండ్రి చేతిలో కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిందే. డీఎస్పీ రమాదేవి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వె ల్లడించారు. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన నర్ర సత్యనారాయణ, జయ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహాన్ని చేయగా చిన్న కుమార్తె మహేశ్వరి, కుమారుడు మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నారు.

మహేశ్వరి హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మహేశ్వరి ఫోన్‌లో తరచూ మాట్లాడుతుండడంతో గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆ బాలికను నిలదీశారు. సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లను పరిశీలించగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే ఉన్నాయి. దీంతో జూలై 31న  తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చి ఈ నెల  1న ఇంటికి పంపించారు. ఇంటికి చేరుకున్నాక కూతురి సెల్‌ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డును తీసి తండ్రి డబ్బాలో దాచాడు. 13వ తేదీన ఆయన భార్య జయ బంధువులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లింది. సత్యనారాయణ 14వ తేదీ సాయంత్రం వరంగల్‌కు వెళ్లి ఇంటికి వచ్చేసరికి మహేశ్వరి ఇంట్లోని చివరి గదిలో ఫోన్‌లో మాట్లాడడం కనిపించింది. తాను 15 రోజుల్లో మేజర్ అవుతానని, అప్పుడు పెళ్లి చేసుకుందామని ప్రియుడితో మాట్లాడడం వినిపించింది.

 దీంతో ఆగ్రహించిన ఆయన ఎన్నిసార్లు చెప్పినా మారవా ? నా పరువు తీస్తున్నావంటూ కర్రతో కొట్టాడు. ఆ రోజు రాత్రి దెబ్బలు తిన్న మహేశ్వరి వేరేగదిలో నిద్రించగా ఆ రోజు రాత్రి రెండు గంటలకు నిద్ర నుంచి లేపి మళ్లీ విషయాన్ని తండ్రి అడిగాడు. అయినా ఏమి మాట్లాడకుండా నిలబడడంతో సహనం నశించి ఆమె మెడకు ఉన్న చున్నీని గట్టిగా చుట్టి రెండు చేతులతో లాగాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. స్లాబ్‌కు ఎలాంటి కొక్కాలు లేకపోవడంతో ఆమె మెడకు చున్నీ కట్టి మంచం కోడుకు కట్టి ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

తిరిగి తన మంచంలో పడుకుని గురువారం ఉదయం లేచి ఏమి తెలియనట్లే తన కుమారుడు శిశప్రసాద్‌ను లేపి అక్క నిద్ర నుంచి లేచిందో చూడమని పంపాడు. అక్క ఉరివేసుకుందని అతడు వచ్చి చెప్పడంతో ఏమి తెలియనట్లే నటించాడు. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ మంచం కోడుకు ఉరి వేయడం, ఆ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తే హత్యగానే భావించిన స్థానిక పోలీసులు డీఎస్పీ రమాదేవికి సమాచారమందించారు. రంగంలోకి దిగిన డీఎస్పీ కూపి లాగి బంధువులను విచారించి, ఆ తర్వాత తండ్రిని విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా నిందితుడి భార్య, బంధువులు మాత్రం ఏ కేసు వద్దని, అతడిని అరెస్ట్ చేయొద్దని వేడుకున్నారు. అతడి అరెస్ట్‌తో కుటుంబం రోడ్డున పడుతుందని వారు వాపోయూరు. సమావేశంలో రూరల్ సీఐ వాసాల సతీష్, కేసముద్రం ఎస్పై కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement