
పాల్మన్ పేటలో దారుణకాండ
దాడులతో చిగురుటాకులా వణికిన గ్రామం
నాలుగు రోజుల్లో మూడు దాడులు
తాజా దాడుల్లో వీరంగం చేసిన వందలాదిమంది మూకలు
ఒకసారి కాదు.. నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒకే సామాజికవర్గం వారిపై.. మరో సామాజిక వర్గీయులు జరిపిన దాడులతో పాల్మన్‌పేట చిగురుటాకులా వణికిపోయింది. గ్రామంలో భయానక పరిస్థితి నెలకొంది. ఎప్పుడు.. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనన్న భయంతో అక్కడి ప్రభజలు బిక్కుబిక్కుమంటున్నారు. వందల సంఖ్యలో మూకలు కర్రలు, కత్తులు, బల్లాలతో విరుచుకుపడిన తీరు వారిని కంటి మీద కునుకు లేకుండా చేసింది.
నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనే ఇంతటి దారుణానికి నేపథ్యం. ఈ నెల 25న కొందరు మత్స్యకార వర్గీయులపై పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన యాదవ వర్గీయులు దాడి చేసి కొట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు గానీ.. యాదవ వర్గీయులు మాత్రం పట్టించుకున్నారు. మాపైనే ఫిర్యాదు చేస్తారా? అన్న ఆగ్రహంతో సోమవారం రాత్రి మళ్లీ మత్స్యకారులపై పడ్డారు. కొందరిని గాయపరిచారు. అప్పుడు కూడా గ్రామ సర్పంచ్ తదితరులు ఫిర్యాదు చేసినా పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు.
ఫలితంగా ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం పక్కనున్న తూర్పుగోదావరి జిల్లా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తమ వర్గీయులను రప్పించారు. వారందరూ వాహనాల్లో మారణాయుధాలతో పాల్మన్‌పేటపై దండెత్తారు. వీరవిహారం చేసి గ్రామాన్ని గడగడలాడించారు. సుమారు 50 మందిని గాయపరిచారు. ఇళ్లు, షాపులు, వస్తువులను ధ్వంసం చేశారు. బాధితులు, క్షతగాత్రులందరూ వైఎస్సార్‌సీపీకి చెందినవారే. తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు ఈ దాడులను ఆపలేకపోగా.. వారి ముగ్గురు గాయపడ్డారు.
ఇంత దారుణం జరిగిన తర్వాత అదనపు బలగాలు, పోలీసు అధికారులు తీరిగ్గా వచ్చారు. మత్స్యకారులను సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే తీవ్రంగా నష్టపోయిని బాధితులు వారిని నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడులు జరిగాయని స్పష్టం చేశారు. పక్క జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలకనేత ప్రమేయంతోనే పక్కా వ్యూహంతో తమపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీల ఫ్లెక్సీలను దహనం చేశారు.
పాయకరావుపేట: పాల్మన్‌పేటలో ఒక సామాజిక వర్గం వారు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. పాత కక్షలతో మండలంలోని పాల్మన్‌పేటలోని ఒక సామాజిక వర్గంపై మరో సామాజికవ ర్గం వారు పొరుగు జిల్లా గ్రామస్తులతో కలిసి మంగళవారం మరో సారి దాడులు చేసి బీభత్సం సృష్టించారు. పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన వారితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన సుమారు నాలుగు వందల మంది పాల్మన్‌పేట మత్స్యకారులపై కర్రలతో దాడులు చేసి స్వైర విహారం చేసి ఇళ్లు, బైక్‌లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. దొరికినవారిని దొరికినట్టు విచక్షణా ర హితంగా కొట్టడంతో 50 మంది వరకు మత్స్యకారులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ సత్యనారాయణ వెళ్లి దాడులు ఆపేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని ఆరోపిస్తూ మత్స్యకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రాంబాబును అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంవల్లే మళ్లీ దాడులు జరిగాయన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీలు ఉన్న ప్లెక్సీలు ధ్వంసం చేసి దహనం చేశారు. దాడులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికారపార్టీ కీలక నేత ప్రమేయంతో వేమవరం, ముసలయ్యపేట ,రాజయ్యపేట, గొల్ల ముసలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన వారు దాడులకు పాల్పడ్డారని మత్స్యకారులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఇళ్లతో పాటు సమారు వంద ఇళ్లలో సామాన్లు, బైక్‌ల వంటి ఆస్తులు ధ్వంసం చేశారు.
ఈ సంఘటనతో తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టు పక్కల స్టేషన్ల నుండి పోలీసులను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సంఘటనలో గాయపడిన కోడా రామూర్తి, పిక్కి కొండయ్య, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాధం, గోసల అప్పలరాజు, వెంకటలక్ష్మి, జి.నాగమణి, చొక్కా శ్రీను, వంకా మహేష్, గరికిన తిరుపతిరావు, గోసల జగదీష్, గోసల రమణ, భాస్కరరావు, గరికిన ముసలి, సత్యనారాయణ, వంకా రమణ, పిక్కి కోదండ తదితరులకు తుని ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం వారిని నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కోడా రామూర్తి, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాథంల పరిస్థితి విషమంగా ఉంది.
పాత కక్షలే సంఘటనకు మూలం
పాల్మన్‌పేటకు చెందిన మత్స్యకారులకు, రాజయ్యపేటకు చెందిన యాదవులకు మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయి. పాల్మన్‌పేటకు చెందిన దోని సాయికుమార్, చొక్కా మణికంఠలు ఈనెల 24న హేచరీలో పనికివెళ్తుండగా రాజయ్యపేటకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈనెల 27 రాత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కందాల సత్తిబాబు, చొక్కా దేవుడు, చింతకాయల నాగరాజు, కందాల రమణ, యజ్జల కృష్ణపై యాదవ సామాజికవర్గానికి చెందిన వారు రెండో సారి దాడికి పాల్పడ్డారు. దాడిలో యజ్జల కృష్ణను ఉరి వేయడానికి ప్రయత్నించారని బాధితులు చెబుతున్నారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో వారు స్పదించలేదని పాల్మన్‌పేట సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి ఉంటే మంగళవారం తమపై దాడులు జరిగేవి కావని మత్స్యకారులు చెబుతున్నారు.
పోలీసులదే నైతిక బాధ్యత
కేవలం మత్స్యకారులను అణగదొక్కాలనే ప్రయత్నంతోనే దాడులు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ దోని నాగార్జున మాట్లాడుతూ, ఈ దాడులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో ఉన్నామనిపిస్తోందన్నారు. తమ వర్గీయులపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింకోకపోవడంవల్లే మళ్లీ దాడులకు దిగారని ఆరోపించారు. ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ ప్రజాప్రనిధులకు రక్షణ లే కుండా పోయిందని, విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసులే ప్రత్యక్ష సాక్షులు
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోడా కోటేశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులపై అధికార పార్టీ అండదండలతో దాడులు చేశారన్నారు. ఈనెల 24న మత్య్సకారులపై జరిగిన దాడికి సంబంధించి 25న ఫిర్యాదు చేశామన్నారు. గ్రామానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుని కుమారుడిపై ఫిర్యాదు ఇవ్వడం వల్ల పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. దీనికి తోడు తమపైనే ఫిర్యాదుచేస్తారా అనే ధోరణితో మళ్లీ 27వ తేదీ రాత్రి రెండోసారి దాడిచేశారన్నారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ కోసం పోలీసులు పిలవగా వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో మంగళవారం మూడో సారి దాడులకు తెగబడ్డారన్నారు. అధికారపార్టీ నేత ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో ఎస్‌ఐతోపాటు పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నారని, మత్య్సకారులపై దాడులకు ప్రత్యక్ష సాక్షులు పోలీసులేనని చెప్పారు. దీనికి నైతిక బాధ్యత పోలీసులే వహించాలన్నారు.
గ్రామాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు
సంఘటన జరిగిన గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఏఎస్పీ రస్తోగీ, ఆర్డీవో సూర్యారావులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ దాడులకు పాల్పడినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.