Palmanpeta
-
నేనున్నానని..
పాల్మన్‌పేట.. ఆ ఊరు ఊరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే. మహానేత వైఎస్, జననేత జగన్ అంటే ప్రాణం పెట్టేస్తారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించి వైఎస్సార్ సీపీ నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిళ్లకు.. చివరికి బెదిరింపులకు దిగినా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారు. అంతే.. అహం దెబ్బతిని కక్షగట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు అదను చూసి మారణాయుధాలతో ఊరిపై పడిపోయారు. ఆడా మగా.. పిల్లా జెల్లా.. ముసలి ముతక.. తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టు చితకబాదేశారు. ఇళ్లు, ఇళ్లల్లో సామాగ్రి ధ్వంసం చేశారు. తీవ్రగాయాలపాలై భీతావహులైన గ్రామస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోలేదు. ఆనక.. ముళ్లపొదల్లో ఓ వద్ధుడి మృతదేహం కనపడగా.. ఆ వృద్ధుడిని పాల్మన్‌పేట గ్రామస్తులు చంపేశారంటూ కేసులు కట్టేశారు. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్య కేసు నమోదు చేశారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వర్గ పోరుగా చూపిస్తూ సునిశిత సమస్యగా మార్చే కుట్ర పన్నుతున్నారు. ఇంతజరిగినా జిల్లా కలెక్టర్ గానీ, మంత్రులు గానీ ఆ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆ పల్లె వైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఆపదలో ఉన్న ప్రజల కోసం అండగా నిలిచేందుకు ఎందాకైనా వచ్చే ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పాల్మన్‌పేట బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారు. మీ కోసం నేనున్నానంటూ ధైర్యం చెప్పేందుకు ఆ పల్లెలో నేడు పర్యటించనున్నారు. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
దర్యాప్తు హామీ.. మరో దగా!
పాల్మన్‌పేట దమనకాండపై సొంత పార్టీ నేతను దోషిగా నిలబట్టే ధైర్యం ఉందా? చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా అనుమానాలు అరకొర సాయంపై బాధితుల అసంతృప్తి రెండు జిల్లాల్లో సంచలనం సృష్టించిన పాల్మన్‌పేట దమనకాండపై విచారణ జరిపిస్తానన్న ముఖ్యమంత్రి హామీ అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దౌర్జన్య కాండకు ప్రధాన కారకుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడేనని బాధితులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. అలాంటప్పుడు తమ పార్టీలో కీలక నేతపై దర్యాప్తు నిర్వహించే సాహసానికి చంద్రబాబు పూనుకోరని అంటున్నారు. ఒక వేళ నిర్వహించినా అది మొక్కుబడి తంతుగానే ఉంటుంది తప్ప నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించే అవకాశమే ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అరకొరసాయంపై కూడా బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖపట్నం: పాల ్మన్పేటలో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. పాయకరావుపేట మండలం పాల ్మన్పేటలో గత నెల 28న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వందలాది మంది విధ్వంసకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. తుని నియోజకవర్గానికి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు రాజకీయ కక్షతోనే తమపై దౌర్జన్యానికి ఉసిగొల్పారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దమనకాండలో 78 మంది గాయపడగా, బాధితుల్లో అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అల్లరిమూకల విధ్వంసకాండలో సుమారు 40 ఇళ్లు పాక్షికంగా, నాలుగు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవే కాకుండా మరో 80 మోటారు సైకిళ్లను కూడా ధ్వంసం చేశారు. అప్పటి నుంచి గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల దురాగతంపై వైఎస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీ బృందం సభ్యులు మోపిదేవి వెంకటరమణ, దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, కురసాల కన్నబాబు, కోలా గురువులు, చిక్కాల రామారావు తదితరులు పాల్మన్‌పేటలో పర్యటించారు. బాధితులకు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును పాయకరావుపేట మండల టీడీపీ నాయకులు, పాల్మన్‌పేట సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి ‘యనమల’ దౌర్జన్యకాండను వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆ ఘటనపై విచారణ జరిపిస్తానని వారికి హామీ ఇచ్చారు. అంత ధైర్యం ఉందా? తమపై దౌర్జన్యానికి కారకుడు మంత్రి యనమల సోదరుడు కృష్ణుడేనని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాధిత పాల్మాన్పేట గ్రామస్తులు ఏకరువు పెడుతున్నారు. పాల్మాన్పేట ఘటనపై విచారణ జరిపించడమంటే మంత్రి యనమలపై విచారణ చేపట్టమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే మంత్రి సోదరుడు దోషిగా తేలుతాడని చెబుతున్నారు. అందువల్ల సీఎం అంతటి సాహసానికి పూనుకోరని, ఘటనను నీరు గార్చడానికి, బాధితులను తాత్కాలికంగా శాంతింపచేయడానికే అలా హామీ ఇచ్చారన్న వాదనలున్నాయి. పాల్మాన్పేట ఘటనపై విచారణకు ఆదేశించే దమ్మూ, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవని, బాధితులను తప్పుదారి పట్టించడానికేనని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. మొక్కుబడి సాయం..! పాల్మాన్పేట బాధితులకిచ్చే సాయంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. వాస్తవానికి 40కి పైగా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర నుంచి 2 లక్షల వరకూ నష్టం వాటిల్లగా కేవలం రూ.50 వేలు సాయంగా ప్రకటించడం తగదని బాధితులు అంటున్నారు. ఇక పూర్తిగా దెబ్బతిన్న నాలుగిళ్లకు ఒక్కో ఇంటికి రూ.3.75 లక్షల వరకు నష్టం జరిగినట్టు అధికారులే తేల్చారు. మరోవైపు అల్లరిమూకలు దాదాపు 80 మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. ఒక్కో బైకుకు రూ.10 నుంచి 30 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈ లెక్కన సీఎం ప్రకటించిన రూ.50 వేలు ఏ మూలకు సరిపోతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. అందరికీ రేషన్ ఇవ్వాలి.. గ్రామంలో అధికారులు కేవలం 50 మంది బాధితులకే 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు మంచినూనె చొప్పున అందజేస్తున్నారు. నాటి పీడకలను మత్స్యకారులు గుర్తు చేసుకుంటూ భయంతో వణికిపోతున్నారు. అప్పట్నుంచి వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నారని, 50 మందికే కాకుండా గ్రామంలోని 600 మంది కార్డుదార్లందరికీ రేషన్ ఇవ్వాలని పాయకరావుపేట జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు అధికారులను డిమాండ్ చేశారు. -
పాల్మన్‌పేటకు నో ఎంట్రీ
నిజనిర్ధారణకు పోలీసుల ఆటంకాలు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న వైనం బాధితులను పరామర్శించి తీరుతామన్న నేతలు చివరకు మూడు వాహనాలకు అనుమతి తుని : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో జరిగిన దాడులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు, టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు ప్రోద్బలంతో తెలుగు తమ్ముళ్లు పాల్మన్‌పేట మత్స్యకారులపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు శుక్రవారం వచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన ఈ కమిటీలో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మత్స్యకార నాయకుడు కోలా గురువులు ఉన్నారు. వీరంతా శుక్రవారం ఉదయం పది గంటలకు తుని శాంతినగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ర్ట నేతలు వస్తున్న విషయం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. విషయం గమనించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాల్మన్‌పేటలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇంతమందిని అనుమతించలేమని చెప్పారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పాల్మన్‌పేట వెళ్తామని, బాధితులను పరామర్శిస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బాధితులను ఓదార్చేందుకు వస్తే ఇన్ని ఆటంకాలు సృష్టిస్తారేమిటంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులు కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాయి. ఈ దశలో కమిటీ సభ్యులతో విశాఖ జిల్లా అదనపు ఎస్పీ ఎన్ఎఫ్ రాజ్‌కుమార్, సీఐ సీహెచ్ వెంకట్రావు చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం పాల్మన్‌పేటకు మూడు వాహనాలను అనుమతించేందుకు పోలీసులు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు కమిటీ సభ్యులు పాల్మన్‌పేట బయలుదేరారు. టీడీపీ గూండాల దాడుల్లో నష్టపోయిన మత్స్యకారులను పరామర్శించారు. వారివెంట వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా నాయకులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబూరావు, తునికి చెందిన కుసుమంచి సత్యనారాయణ, కీర్తి రాఘవ ఉన్నారు. -
అధికార మదం.. అమాయకులపై దౌర్జన్యం
► ఊరు మొత్తాన్ని నేలమట్టం చేసే కుట్ర వైఎస్సార్సీపీయే లక్ష్యం ► అన్న అండతో తమ్ముడి అరాచకం ఊహించలేకపోయామంటున్న పోలీసులు ► నిందితులపై ఐదు కేసులు నమోదు 58 మంది అరెస్ట్, రిమాండ్ ► ఎస్ఐపై చర్యలుంటాయన్న ఏఎస్పీ ఇంకా భయం గుప్పెట్లోనే పాల్మన్‌పేట ‘కొట్టకండయ్యా అని కాళ్లా వేళ్లాపడ్డాం.. మీరెవరో, మేమెవరో, మీకూ.. మాకూ ఏమిటి శత్రుత్వం, ఎందుకిలా కొడుతున్నారు, ఇది మీకు న్యాయమా అని కన్నీరుమున్నీరై వేడుకున్నాం.. అయినా మా మాటలు వారి చెవికెక్కలేదు. మా అక్క చంటిబిడ్డ తల్లి.. ఆమెపైకి రాయి విసరారు. కొంచెముంటే బిడ్డ ఏమైపోయేదో.. మేం ఈ ఊరిలో ఎలా బతకాలి.’ -పిక్కి మేరీ, బాధితురాలు ‘మిమ్మల్ని చెరబట్టినా మీ మగాళ్లు అడ్డుకోవడానికి రారంటూ మా జుత్తు పట్టుకుని చావగొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదల్లేదు. నానా దుర్భాషలాడారు. అసలు మనం ఎక్కడున్నామో అర్ధం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం అండగా నిలవడంతో భయమోస్తోంది.’ -కోడ మల్లిక, బాధితురాలు. ప్రజలను బిడ్డల్లా చూసుకోవాల్సిన పాలకులే అధికార మదంతో రాక్షసులుగా మారితే ఎలా ఉంటుందో పాల్మన్‌పేట దారుణకాండ రుజువుచేసింది. తన అన్న రాష్ర్టంలో సీనియన్ నాయకుడిగా, మంత్రిగా ఉన్నాడనే ధైర్యంతో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచి వేసేందుకు కుట్రపన్నిన ఓ తమ్ముడు చేసిన అరాచకానికి పాల్మన్‌పేట నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. కూలిపోయిన ఇళ్లు, పగిలిపోయిన పరికరాలు, ధ్వంసమైన ద్విచక్రవాహనాలు మౌనంగా రోది స్తుంటే, మేమసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. అని దెబ్బలు తిన్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. - సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న పాల్మన్పేటను పూర్తిగా నేల మట్టం చేయాలని టీడీపీ కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది. ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ గరికిన రమణల ఇళ్లు ప్రధానంగా టార్గెట్ చేశారు. వాటిపై దాడి చేసి ఇళ్లలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారి వాహనాలు, ఇళ్లు లక్ష్యం చేసుకున్నారు. దీనంతటికీ ముందుగానే పక్కా వ్యూహం రచించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఊరిపై దాడికి రాగానే ఎవరెవరు ఎవరిపై దాడిచేయాలనే స్పష్టతతోనే దాడులకు పాల్పడం వెనుక నిందుతులు ఓ ప్రణాళికతోనే దాడులకు వచ్చినట్లు రూఢీ అవుతోంది. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆ ఊరిలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ దురాగతానికి టీడీపీ పాల్పడినట్లు బాధితుల మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏకంగా 86 వాహనాలను నాశనం చేయడంతో పాటు ఇళ్లల్లోకి చొరబడి బీరువాల్లో ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. చివరికి బియ్యం బస్తాలు కూడా దొమ్మీ చేసేశారంటే ఈ దాడులు క్షణికావేశంలో చేసినవి కాదని, పక్కా ప్రణాళికతో తెగబడినవని స్పష్టమవుతోంది. అన్న అండతో తమ్ముడి అరాచకం రాష్ర్ట మంత్రి యనమల రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడే ఈ అరాచకానికి ప్రధాన సూత్రధారని బాధితులు చెబుతున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంతో అతనికి సంబంధం లేదు. కానీ తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలై ఆ అవమానాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. సరిహద్దు నియోజకవర్గమైన పాయకరావుపేటలో, తన నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై కత్తి కట్టాడు. సమయం చిక్కితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనికోసం కొందరు రౌడీమూకలను పెంచిపోషిస్తున్నారు. వారితో దురాగతాలు చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీడని భయం.. పాల్మన్‌పేటపై టీడీపీ గూండాల దాడి తర్వాత ఆ గ్రామం పోలీసుల పహారా మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. అక్కడి ప్రజలు ఒంటరిగా ఇళ్లల్లో ఉండేందుకు కూడా భయపడుతూ అంతా కలిసి కట్టుగా గుంపులుగానే ఉంటున్నారు. ఏఎస్పీ ఐశ్యర్య రస్తోగితో పాటు స్పెషల్‌పార్టీ, ఆక్టోపస్, ఏఆర్, సివిల్ పోలీసులు దాదాపు 200 మంది 15 పికెటింగ్‌లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బాధితులు వణికిపోతున్నారు. ప్రతికార దాడి చేయడానికి తామకు క్షణం పట్టదని, కాని తాము టీడీపీ రౌడీల్లా వ్యహరించలేమని బాధితులు అంటున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఈ గ్రామం వదిలి పొట్ట చేతపట్టుకుని వసల పోతామంటున్నారు. లేడీ డాన్‌లా.. వందలాది మంది టీడీపీ రౌడీమూకలతో పాటు ఓ మహిళ కూడా ఈ దారుణకాండలో పాలుపంచుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. రాజయ్యపేట గ్రామానికి చెందిన టీడీపీ నేత, ల్యాండ్ లార్డ్ పిర్ల వెంకట్రావు కుమార్తె కళ్యాణి లేడీ డాన్‌లా తమపై దాడులు చేసిందని పిక్కి మేరీ అనే బాధిత యువతి తెలిపింది. స్థానిక జడ్పీ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న యాదాల అప్పలరాజు విద్యార్థులపైనా వివక్ష చూపిస్తున్నారని, ఆయన కూడా దాడుల్లో పాల్గొన్నాడని బాధితులు తెలిపారు. బాధితులకు జగన్ భరోసా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుడు చిక్కాల రామారావుతో జగన్ ఫోన్లో మాట్లాడారు. పాల్మన్‌పేటలో ప్రస్తుత పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. బాధితులకు పార్టీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన వెంటనే అందిస్తామని, వారికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పారు. ఊహించలేకపోయాం.. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి దాడులకు పాల్పడతారని ముందుగా ఊహించలేకపోయాం. నాలుగు రోజుల ముందు నుంచి గొడవలు జరుగుతుండటంతో రెండు పికెటింగ్‌లు ఏర్పాటు చేశాం. ఇరు వర్గాలు ముందురోజు రాత్రి రాజీకి వచ్చాయి. కానీ తెల్లారేసరికి ఇలా పక్క జిల్లా నుంచి వచ్చి విరుచుకుపడ్డారు. దాదాపు 110 మందికి పైగా నిందితులు దాడుల్లో పాలుపంచుకున్నట్లు గుర్తించాం. వారిలో 58 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాం. మిగతావారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. ఈ దుర్ఘటనలో మా సిబ్బంది తమ పాత్ర సక్రమంగానే నిర్వర్తించారు. దానివల్లనే ఇద్దరు పోలీసులు తీవ్రంగా గామపడ్డారు. అయితే స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తీరును బాధితులు తప్పుపడుతున్నారు. ఆయనపై విచారణ జరిపి భవిష్యత్‌లో మరెవరూ అలా ప్రవర్తించకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటాం. - ఐశ్వర్య రస్తోగి, ఏఎస్పీ -
పాల్మన్ పేటలో దారుణకాండ
దాడులతో చిగురుటాకులా వణికిన గ్రామం నాలుగు రోజుల్లో మూడు దాడులు తాజా దాడుల్లో వీరంగం చేసిన వందలాదిమంది మూకలు ఒకసారి కాదు.. నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒకే సామాజికవర్గం వారిపై.. మరో సామాజిక వర్గీయులు జరిపిన దాడులతో పాల్మన్‌పేట చిగురుటాకులా వణికిపోయింది. గ్రామంలో భయానక పరిస్థితి నెలకొంది. ఎప్పుడు.. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనన్న భయంతో అక్కడి ప్రభజలు బిక్కుబిక్కుమంటున్నారు. వందల సంఖ్యలో మూకలు కర్రలు, కత్తులు, బల్లాలతో విరుచుకుపడిన తీరు వారిని కంటి మీద కునుకు లేకుండా చేసింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనే ఇంతటి దారుణానికి నేపథ్యం. ఈ నెల 25న కొందరు మత్స్యకార వర్గీయులపై పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన యాదవ వర్గీయులు దాడి చేసి కొట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు గానీ.. యాదవ వర్గీయులు మాత్రం పట్టించుకున్నారు. మాపైనే ఫిర్యాదు చేస్తారా? అన్న ఆగ్రహంతో సోమవారం రాత్రి మళ్లీ మత్స్యకారులపై పడ్డారు. కొందరిని గాయపరిచారు. అప్పుడు కూడా గ్రామ సర్పంచ్ తదితరులు ఫిర్యాదు చేసినా పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఫలితంగా ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం పక్కనున్న తూర్పుగోదావరి జిల్లా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తమ వర్గీయులను రప్పించారు. వారందరూ వాహనాల్లో మారణాయుధాలతో పాల్మన్‌పేటపై దండెత్తారు. వీరవిహారం చేసి గ్రామాన్ని గడగడలాడించారు. సుమారు 50 మందిని గాయపరిచారు. ఇళ్లు, షాపులు, వస్తువులను ధ్వంసం చేశారు. బాధితులు, క్షతగాత్రులందరూ వైఎస్సార్సీపీకి చెందినవారే. తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు ఈ దాడులను ఆపలేకపోగా.. వారి ముగ్గురు గాయపడ్డారు. ఇంత దారుణం జరిగిన తర్వాత అదనపు బలగాలు, పోలీసు అధికారులు తీరిగ్గా వచ్చారు. మత్స్యకారులను సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే తీవ్రంగా నష్టపోయిని బాధితులు వారిని నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడులు జరిగాయని స్పష్టం చేశారు. పక్క జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలకనేత ప్రమేయంతోనే పక్కా వ్యూహంతో తమపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీల ఫ్లెక్సీలను దహనం చేశారు. పాయకరావుపేట: పాల్మన్‌పేటలో ఒక సామాజిక వర్గం వారు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. పాత కక్షలతో మండలంలోని పాల్మన్పేటలోని ఒక సామాజిక వర్గంపై మరో సామాజికవ ర్గం వారు పొరుగు జిల్లా గ్రామస్తులతో కలిసి మంగళవారం మరో సారి దాడులు చేసి బీభత్సం సృష్టించారు. పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన వారితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన సుమారు నాలుగు వందల మంది పాల్మన్‌పేట మత్స్యకారులపై కర్రలతో దాడులు చేసి స్వైర విహారం చేసి ఇళ్లు, బైక్‌లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. దొరికినవారిని దొరికినట్టు విచక్షణా ర హితంగా కొట్టడంతో 50 మంది వరకు మత్స్యకారులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సత్యనారాయణ వెళ్లి దాడులు ఆపేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని ఆరోపిస్తూ మత్స్యకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రాంబాబును అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంవల్లే మళ్లీ దాడులు జరిగాయన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీలు ఉన్న ప్లెక్సీలు ధ్వంసం చేసి దహనం చేశారు. దాడులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికారపార్టీ కీలక నేత ప్రమేయంతో వేమవరం, ముసలయ్యపేట ,రాజయ్యపేట, గొల్ల ముసలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన వారు దాడులకు పాల్పడ్డారని మత్స్యకారులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఇళ్లతో పాటు సమారు వంద ఇళ్లలో సామాన్లు, బైక్‌ల వంటి ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టు పక్కల స్టేషన్ల నుండి పోలీసులను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సంఘటనలో గాయపడిన కోడా రామూర్తి, పిక్కి కొండయ్య, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాధం, గోసల అప్పలరాజు, వెంకటలక్ష్మి, జి.నాగమణి, చొక్కా శ్రీను, వంకా మహేష్, గరికిన తిరుపతిరావు, గోసల జగదీష్, గోసల రమణ, భాస్కరరావు, గరికిన ముసలి, సత్యనారాయణ, వంకా రమణ, పిక్కి కోదండ తదితరులకు తుని ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం వారిని నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కోడా రామూర్తి, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాథంల పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షలే సంఘటనకు మూలం పాల్మన్‌పేటకు చెందిన మత్స్యకారులకు, రాజయ్యపేటకు చెందిన యాదవులకు మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయి. పాల్మన్‌పేటకు చెందిన దోని సాయికుమార్, చొక్కా మణికంఠలు ఈనెల 24న హేచరీలో పనికివెళ్తుండగా రాజయ్యపేటకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈనెల 27 రాత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కందాల సత్తిబాబు, చొక్కా దేవుడు, చింతకాయల నాగరాజు, కందాల రమణ, యజ్జల కృష్ణపై యాదవ సామాజికవర్గానికి చెందిన వారు రెండో సారి దాడికి పాల్పడ్డారు. దాడిలో యజ్జల కృష్ణను ఉరి వేయడానికి ప్రయత్నించారని బాధితులు చెబుతున్నారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో వారు స్పదించలేదని పాల్మన్‌పేట సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి ఉంటే మంగళవారం తమపై దాడులు జరిగేవి కావని మత్స్యకారులు చెబుతున్నారు. పోలీసులదే నైతిక బాధ్యత కేవలం మత్స్యకారులను అణగదొక్కాలనే ప్రయత్నంతోనే దాడులు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ దోని నాగార్జున మాట్లాడుతూ, ఈ దాడులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో ఉన్నామనిపిస్తోందన్నారు. తమ వర్గీయులపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింకోకపోవడంవల్లే మళ్లీ దాడులకు దిగారని ఆరోపించారు. ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ ప్రజాప్రనిధులకు రక్షణ లే కుండా పోయిందని, విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులే ప్రత్యక్ష సాక్షులు వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోడా కోటేశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులపై అధికార పార్టీ అండదండలతో దాడులు చేశారన్నారు. ఈనెల 24న మత్య్సకారులపై జరిగిన దాడికి సంబంధించి 25న ఫిర్యాదు చేశామన్నారు. గ్రామానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుని కుమారుడిపై ఫిర్యాదు ఇవ్వడం వల్ల పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. దీనికి తోడు తమపైనే ఫిర్యాదుచేస్తారా అనే ధోరణితో మళ్లీ 27వ తేదీ రాత్రి రెండోసారి దాడిచేశారన్నారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ కోసం పోలీసులు పిలవగా వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో మంగళవారం మూడో సారి దాడులకు తెగబడ్డారన్నారు. అధికారపార్టీ నేత ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో ఎస్ఐతోపాటు పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నారని, మత్య్సకారులపై దాడులకు ప్రత్యక్ష సాక్షులు పోలీసులేనని చెప్పారు. దీనికి నైతిక బాధ్యత పోలీసులే వహించాలన్నారు. గ్రామాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు సంఘటన జరిగిన గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఏఎస్పీ రస్తోగీ, ఆర్డీవో సూర్యారావులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ దాడులకు పాల్పడినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.