నిజనిర్ధారణకు పోలీసుల ఆటంకాలు
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న వైనం
బాధితులను పరామర్శించి తీరుతామన్న నేతలు
చివరకు మూడు వాహనాలకు అనుమతి
తుని : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో జరిగిన దాడులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు, టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు ప్రోద్బలంతో తెలుగు తమ్ముళ్లు పాల్మన్‌పేట మత్స్యకారులపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు శుక్రవారం వచ్చారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన ఈ కమిటీలో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మత్స్యకార నాయకుడు కోలా గురువులు ఉన్నారు. వీరంతా శుక్రవారం ఉదయం పది గంటలకు తుని శాంతినగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ర్ట నేతలు వస్తున్న విషయం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
విషయం గమనించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాల్మన్‌పేటలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇంతమందిని అనుమతించలేమని చెప్పారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పాల్మన్‌పేట వెళ్తామని, బాధితులను పరామర్శిస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బాధితులను ఓదార్చేందుకు వస్తే ఇన్ని ఆటంకాలు సృష్టిస్తారేమిటంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులు కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాయి. ఈ దశలో కమిటీ సభ్యులతో విశాఖ జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌ఎఫ్ రాజ్‌కుమార్, సీఐ సీహెచ్ వెంకట్రావు చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం పాల్మన్‌పేటకు మూడు వాహనాలను అనుమతించేందుకు పోలీసులు అంగీకరించారు.
దీంతో మధ్యాహ్నం 12 గంటలకు కమిటీ సభ్యులు పాల్మన్‌పేట బయలుదేరారు. టీడీపీ గూండాల దాడుల్లో నష్టపోయిన మత్స్యకారులను పరామర్శించారు. వారివెంట వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా నాయకులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబూరావు, తునికి చెందిన కుసుమంచి సత్యనారాయణ, కీర్తి రాఘవ ఉన్నారు.
పాల్మన్‌పేటకు నో ఎంట్రీ
Published Sat, Jul 2 2016 12:59 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement