నేనున్నానని..
పాల్మన్‌పేట.. ఆ ఊరు ఊరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే. మహానేత వైఎస్, జననేత జగన్ అంటే ప్రాణం పెట్టేస్తారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించి వైఎస్సార్ సీపీ నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిళ్లకు.. చివరికి బెదిరింపులకు దిగినా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారు.
అంతే.. అహం దెబ్బతిని కక్షగట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు అదను చూసి మారణాయుధాలతో ఊరిపై పడిపోయారు. ఆడా మగా.. పిల్లా జెల్లా.. ముసలి ముతక.. తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టు చితకబాదేశారు. ఇళ్లు, ఇళ్లల్లో సామాగ్రి ధ్వంసం చేశారు. తీవ్రగాయాలపాలై భీతావహులైన గ్రామస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోలేదు.
ఆనక.. ముళ్లపొదల్లో ఓ వద్ధుడి
మృతదేహం కనపడగా..
ఆ వృద్ధుడిని పాల్మన్‌పేట గ్రామస్తులు చంపేశారంటూ కేసులు కట్టేశారు. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్య కేసు నమోదు చేశారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వర్గ పోరుగా చూపిస్తూ సునిశిత సమస్యగా మార్చే కుట్ర పన్నుతున్నారు.
ఇంతజరిగినా జిల్లా కలెక్టర్ గానీ, మంత్రులు గానీ ఆ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆ పల్లె వైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఆపదలో ఉన్న ప్రజల కోసం అండగా నిలిచేందుకు ఎందాకైనా వచ్చే ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పాల్మన్‌పేట బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారు. మీ కోసం నేనున్నానంటూ ధైర్యం చెప్పేందుకు ఆ పల్లెలో నేడు పర్యటించనున్నారు.
–సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం