పాల్మన్‌పేట దమనకాండపై సొంత పార్టీ నేతను దోషిగా నిలబట్టే ధైర్యం ఉందా?
చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా అనుమానాలు
అరకొర సాయంపై బాధితుల అసంతృప్తి
రెండు జిల్లాల్లో సంచలనం సృష్టించిన పాల్మన్‌పేట దమనకాండపై విచారణ జరిపిస్తానన్న ముఖ్యమంత్రి హామీ అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దౌర్జన్య కాండకు ప్రధాన కారకుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడేనని బాధితులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. అలాంటప్పుడు తమ పార్టీలో కీలక నేతపై దర్యాప్తు నిర్వహించే సాహసానికి చంద్రబాబు పూనుకోరని అంటున్నారు. ఒక వేళ నిర్వహించినా అది మొక్కుబడి తంతుగానే ఉంటుంది తప్ప నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించే అవకాశమే ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అరకొరసాయంపై కూడా బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
విశాఖపట్నం: పాల ్మన్‌పేటలో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. పాయకరావుపేట మండలం పాల ్మన్‌పేటలో గత నెల 28న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వందలాది మంది విధ్వంసకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. తుని నియోజకవర్గానికి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు రాజకీయ కక్షతోనే తమపై దౌర్జన్యానికి ఉసిగొల్పారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దమనకాండలో 78 మంది గాయపడగా, బాధితుల్లో అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అల్లరిమూకల విధ్వంసకాండలో సుమారు 40 ఇళ్లు పాక్షికంగా, నాలుగు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవే కాకుండా మరో 80 మోటారు సైకిళ్లను కూడా ధ్వంసం చేశారు. అప్పటి నుంచి గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల దురాగతంపై వైఎస్సార్‌సీపీ నిజనిర్థారణ కమిటీ బృందం సభ్యులు మోపిదేవి వెంకటరమణ, దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, కురసాల కన్నబాబు, కోలా గురువులు, చిక్కాల రామారావు తదితరులు పాల్మన్‌పేటలో పర్యటించారు. బాధితులకు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును పాయకరావుపేట మండల టీడీపీ నాయకులు, పాల్మన్‌పేట సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి ‘యనమల’ దౌర్జన్యకాండను వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆ ఘటనపై విచారణ జరిపిస్తానని వారికి హామీ ఇచ్చారు.
అంత ధైర్యం ఉందా?
తమపై దౌర్జన్యానికి కారకుడు మంత్రి యనమల సోదరుడు కృష్ణుడేనని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాధిత పాల్మాన్‌పేట గ్రామస్తులు ఏకరువు పెడుతున్నారు. పాల్మాన్‌పేట ఘటనపై విచారణ జరిపించడమంటే మంత్రి యనమలపై విచారణ చేపట్టమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే మంత్రి సోదరుడు దోషిగా తేలుతాడని చెబుతున్నారు. అందువల్ల సీఎం అంతటి సాహసానికి పూనుకోరని, ఘటనను నీరు గార్చడానికి, బాధితులను తాత్కాలికంగా శాంతింపచేయడానికే అలా హామీ ఇచ్చారన్న వాదనలున్నాయి. పాల్మాన్‌పేట ఘటనపై విచారణకు ఆదేశించే దమ్మూ, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవని, బాధితులను తప్పుదారి పట్టించడానికేనని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు.
మొక్కుబడి సాయం..!
పాల్మాన్‌పేట బాధితులకిచ్చే సాయంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. వాస్తవానికి 40కి పైగా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర నుంచి 2 లక్షల వరకూ నష్టం వాటిల్లగా కేవలం రూ.50 వేలు సాయంగా ప్రకటించడం తగదని బాధితులు అంటున్నారు. ఇక పూర్తిగా దెబ్బతిన్న నాలుగిళ్లకు ఒక్కో ఇంటికి రూ.3.75 లక్షల వరకు నష్టం జరిగినట్టు అధికారులే తేల్చారు. మరోవైపు అల్లరిమూకలు దాదాపు 80 మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. ఒక్కో బైకుకు రూ.10 నుంచి 30 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈ లెక్కన సీఎం ప్రకటించిన రూ.50 వేలు ఏ మూలకు సరిపోతుందని వీరు ప్రశ్నిస్తున్నారు.
అందరికీ రేషన్ ఇవ్వాలి..
గ్రామంలో అధికారులు కేవలం 50 మంది బాధితులకే 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు మంచినూనె చొప్పున అందజేస్తున్నారు. నాటి పీడకలను మత్స్యకారులు గుర్తు చేసుకుంటూ భయంతో వణికిపోతున్నారు. అప్పట్నుంచి వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నారని, 50 మందికే కాకుండా గ్రామంలోని 600 మంది కార్డుదార్లందరికీ రేషన్ ఇవ్వాలని పాయకరావుపేట జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు అధికారులను డిమాండ్ చేశారు.
దర్యాప్తు హామీ.. మరో దగా!
Published Mon, Jul 4 2016 1:17 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement
Advertisement