ఎమ్మిగనూరులో ఘరానా మోసం తేలు కుట్టిన దొంగల్లా బాధితులు
ఎమ్మిగనూరు: నాగుపాములు, నాగమణుల సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమాలన్నీ విజ యాలు సాధించినవే. అదే సూత్రంతో ఓ ఇద్దరు ఎమ్మిగనూరులో పలు వ్యాపారులకు వెర్రెక్కించారు. నాగమణి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేశారు. అసలు ఉందో లేదో తెలియని మణి కోసం ఇళ్లు, వాకిలి తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, మరో స్వీటు వ్యాపారి కలసి నాగ‘మణి’ పేరిట జనాలను బుట్టలో వేశారు. రూ.కోట్లు విలువ చేసే మణి కర్ణాటకలోని ఓ బ్యాంకు లాకర్‌లో ఉందని, మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే లాకర్‌ను తెరువగలడని జోరుగా ప్రచారం చేశారు.
మణితో తమ దశ తిరుగుతుందన్న అత్యాశతో కొందరు రూ.రెండు కోట్ల నుంచి లక్షల్లో వారికి ముట్టజెప్పారు. మొత్తం రూ.8 కోట్లు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని మలేసియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని, తొందర్లోనే మణి వస్తుందని ఆరునెలలుగా నమ్మబలుకుతున్నారు. వీరికి డబ్బులిచ్చి మోసపోయిన వ్యక్తి సోదరులు పోలీసు శాఖలో పని చేస్తున్నారు.
తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకుని అగ్రహారం ఏజెంట్‌ను ప్రశ్నించగా., జూలై 15 లోగా రూ.50 లక్షలు తిరిగిచ్చేస్తామని, ఈ వ్యవహారం బయటకు పొక్కనివ్వొద్దంటూ వేడుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు మలేిసియా వెళ్లి వచ్చినట్టు సమాచారం. మణి పేరిట వసూలు చేసిన మొత్తం ఏం చేశారో.? డబ్బు తిరిగి ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మణి మాయలో వీరికి డబ్బులు సమర్పించిన బాధితులు.., బయటకు చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.
రూ.కోట్లు మింగిన నాగ‘మణి’
Published Mon, Jul 7 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement